ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదపండితులు జగన్ దంపతులను ఆశీర్వదించారు. తెలుగు వారి తొలి పండుగ ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల నుండి వచ్చిన వేద పండితులు ప్రత్యేకంగా ప్రసాదాలు తీసుకువచ్చి అందించారు. శుభాకృత్ నామ ఉగాది రోజున తెలుగుతనం ఉట్టిపడేలా గోశాల ప్రాంగణాన్ని అలంకరించారు. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టిపడే విధంగా ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. వేడుకలకు ముందు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో సీఎం జగన్ దంపతులు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ పంచాంగాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. కప్పగంతు సుబ్బరాయ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని సుబ్బరాయ సోమయాజి అన్నారు. ఉద్యోగులు, శ్రామికులకు మంచి ఫలితాలు ఉంటాయన్నారు. పాడి పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉంటుందన్నారు. ఆహార ఉత్పత్తులతో ముడి పడిన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. పంచాంగ పఠనం చేసిన అనంతరం సుబ్బరాయ సోమయాజిని సీఎం జగన్ సన్మానించారు.

సీఎం జగన్ దంపతులకు మంత్రి ఆర్కే రోజా జ్ఞాపికను అందజేశారు. సాంస్కృతిక శాఖ రూపొందించిన క్యాలెండర్ ను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ దంపతులు వీక్షించారు. తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలు కనువిందు చేసేలా సెట్టింగ్ లు ఏర్పాటు చేశారు. తిరుమల ఆనంద నిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేశారు. మండపంలో గోడలకు ఏర్పాటు చేసిన దశావతారాల బొమ్మలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు తదితరులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రముఖుల ఉగాది శుభాకాంక్షలు ఇలా..
