Video Viral: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. ముందుగా ప్రత్యేక విమానంలో బేగంపేట నుండి గన్నవరంకు చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి..అక్కడ రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంలో జగన్మోహనరెడ్డి గుమ్మం బయటకు వచ్చి చిరంజీవిని సాదరంగా ఆహ్వానిస్తూ లోపలకు తీసుకువెళ్లారు. సీఎం జగన్ ను చిరంజీవి దుశ్సాలువాతో సత్కరించి బొకే అందజేశారు. అనంతరం జగన్, చిరంజీవి లంచ్ మీటింగ్ కొనసాగుతోంది.

సినిమా టికెట్ల అంశంపై గత కొన్ని నెలలుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం ఏపి ప్రభుత్వం, సినీ పరిశ్రమ అన్నట్లుగా ఇరుపక్షాల నుండి మాటల దాడి జరుగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో హీట్ ఎక్కింది. ప్రస్తుత తరుణంలో చిరంజీవి జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకోంది.
సీఎం జగన్మోహనరెడ్డి ఆహ్వానం మేరకు చిరంజీవి నేడు తాడేపల్లికి వచ్చారు. తొలుత గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద చిరంజీవిని మీడియా ప్రతినిధులు పలకరించగా సినిమా అంశాలపై సీఎంతో చర్చించేందుకు వచ్చానని తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన బిడ్డగా సీఎంతో మాట్లాడేందుకు వచ్చానని అన్నారు. సీఎంతో భేటీ అనంతరం అన్ని విషయాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. కాగా చిరంజీవిని జగన్ స్వాగతిస్తూ తీసుకువెళ్లగా చిరంజీవి సీఎం జగన్ ను సన్మానిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.