Video Viral: ఓ పక్క వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, స్వచ్చందంగా సేవ చేయడానికి వచ్చిన వాళ్లు, వాళ్లు ఖాళీ సమయాల్లో వారికి కేటాయించిన ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. నిత్యం కార్యాలయాలకు వచ్చి కూర్చోవాల్సిన పని లేదు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పలు ప్రాంతాల్లోని మున్సిపల్ కమిషనర్లు, కార్యదర్శులు వాలంటీర్లు తమ పరిధిలో పని చేసే దిగువ స్థాయి సిబ్బందిగా భావిస్తూ జులం చలాయిస్తున్నారు. 24 గంటలు తమకు అందుబాటులో ఉండాలనీ, అనుమతి (పర్మిషన్ లేకుండా) బయటకు వెళ్లడానికి వీలులేదనీ, కార్యాలయంలో చెప్పిన ప్రతి పనీ చేయాలని ఆదేశిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఓ మహిళా వాలంటీర్ పై దుర్భాషలాడటం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. మహిళా వాలంటీర్ పై కమిషనర్ జులుం చలాయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ స్పందించారు. కమిషనర్ దురుసు ప్రవర్తనపై నరసరావుపేట ఆర్డీఓ విచారణ జరిపి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే.. షేక్ అక్తర్ అనే మహిళ నర్సరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో వాలంటీర్ గా విధులను నిర్వహిస్తోంది. అక్కడి అడ్మిన్ గా పని చేసే నవ్య అనే సచివాలయ ఉద్యోగి తనపై ఫిర్యాదు చేయడంతో కమిషనర్ తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారని మహిళా వాలంటీర్ అక్తర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత జనవరి నెల నుండి తాను విధులను సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ ఎప్పుడూ సచివాలయంలో అందుబాటులో ఉండాలంటూ వారడు అడ్మిన్ వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ ఆమెకు ఫోన్ చేసి దుర్భాషలాడటమే కాక కార్యాలయంలో నేరుగా కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కమిషనర్ అంటే లెక్కలేకుండా పోయింది. ఉద్యోగం చేస్తున్నావా? లేదా? ఒంటి గంటకు ఎక్కడకు పోయావు ? ఎవరు పర్మిషన్ ఇచ్చారు ? బొక్కలో వేసి ఉతికిస్తా, నీకు దిక్కున్న చోట చెప్పుకో, తీసి పడేస్తా, వెళ్లి ఎమ్మెల్యే గారికి చెప్పుకో అంటూ ఇలా బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనతో అసభ్యంగా మాట్లాడిన కమిషనర్ రామచంద్రారెడ్డి, వార్డు అడ్మిన్ నవ్యలపై చర్యలు తీసుకోవాలని వాలంటీర్ వేడుకుంటున్నారు. వాలంటీర్ పై కమిషనర్ విరుచుకు పడి దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు.