Krishnapatnam Anandaiah: రాష్ట్రంలో ఇప్పుడు నాటు వైద్యుడు ఆనందయ్య, ఆయన స్వగ్రామం కృష్ణపట్నం పేరు మారుమోగుతోంది. శుక్రవారం రాత్రి ఆనందయ్య నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ఆనందయ్య ఇంటికి చేరుకున్నారు. అయితే ఆనందయ్యను మళ్లీ అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు కృష్ణపట్నం చేరుకున్నారు. అనందయ్యను అదుపులోకి తీసుకోవద్దని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆనందయ్య మందు పంపిణీని ఈ నెల 17వ తేదీ నుండి నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆనందయ్య కరోనా మందుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత పది రోజుల నుండి ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లారని ప్రచారం జరిగింది. ఆనందయ్య బంధువులతోనూ మాట్లాడే అవకాశం లభించలేదు. ఆనందయ్య మందు పంపిణీకి సంబంధించి రెండు మూడు రోజుల్లో నివేదికలు రానున్నాయనీ, దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. ఆనందయ్య మందు పంపిణీకి సంబంధించి దాఖలైన పిటిషన్ లపై హైకోర్టులో విచారణ కూడా జరుగుతోంది.

ఈ వ్యవహారం ఇలా ఉండగా శుక్రవారం రాత్రి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఆనందయ్య నివాసానికి చేరుకుని బాసటగా నిలిచారు. పోలీసులు తీసుకువెళ్లకండా అడ్డుకుంటామని, ఆయనకు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. పలువురు గ్రామ పెద్దలు కూడా అక్కడకు చేరుకుని ఆనందయ్యను పోలీసులు తీసుకువెళ్లరనీ, తాము ఇక్కడే ఉంటామని పేర్కొన్నారు.
Read More: DRDO: 2 డీజీ సాచెట్ ధర నిర్ణయించిన రెడ్డీస్ ల్యాబ్స్..
ఇదే విషయంపై టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఆనందయ్యకు రక్షణ కల్పించేందుకు ఎక్కడికో పోలీసులు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదనీ, కృష్ణపట్నంలోనే ఆయనకు సెక్యూరిటీగా ఇద్దరు ముగ్గురు కానిస్టేబుళ్లను పెట్టవచ్చని అన్నారు. రాష్ట్రంలో ఇతర నాయకులు, ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పించేందుకు పోలీసులు వారిని నిర్బంధంలోకి తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. కాగా ప్రస్తుతం కృష్ణపట్నం గ్రామానికి బయట ప్రాంతాల వారిని పోలీసులు అనుమతించడం లేదు. గ్రామంలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.