Viveka Murder Case Witness Suspicious Death: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి మృతి చెందాడు. పులివెందులకు చెందిన గంగాధర్ రెడ్డి అనంతపురం జిల్లా యాడికిలో నివాసం ఉంటున్నాడు. యాడకిలోని అతని నివాసంలో బుధవారం రాత్రిలో మృతి చెందాడు. అనారోగ్యంతోనే నిద్రపోతున్న సమయంలో గంగాధర్ రెడ్డి మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివేకా హత్య కేసులో గంగాధర్ రెడ్డిని సీబీఐ పలు మార్లు విచారించింది. ఆ క్రమంలో గంగాధర్ రెడ్డి సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేస్తూ తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ గతంలో రెండు సార్లు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు.

- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Viveka murder case Witness Suspicious Death: వివిధ కోణాల్లో దర్యాప్తు
వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలోనే గంగాధర్ రెడ్డి మృతి చెందడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా అనారోగ్యంతోనే మృతి చెందాడా..? ఆత్మహత్య చేసుకున్నాడా..? లేకుంటే ఎవరైనా హత్య చేశారా..? అనేది పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగి అతని ఇంటి పరిసరాలను పరిశీలించింది. అనంతరం గంగాధర్ రెడ్డి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన గంగాధర్ రెడ్డి.. వివేకా హత్య కేసులో నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకరరెడ్డి అనుచరుడు కావడంతో ఈ కేసు ప్రాధాన్యతను సంతరించకుంది.