Penugonda: శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నగర పంచాయతీ పరిధిలో త్రాగునీటి సమస్యపై మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. నగర పంచాయతీ పరిధిలోని తిమ్మాపురం, ఇస్లాపురం, వెంకటరెడ్డిపల్లి గ్రామాలకు త్రాగునీరు సరఫరా కాకపోవడంతో బుదవారం ఇస్లాపురం క్రాస్ రోడ్డు వద్ద టీడీపీ, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఖాళీ బిందెలతో రహదారిపై భైటాయించి గంట పాటు నిరసన వ్యక్తం చేశారు. మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు గ్రామాలలో నీళ్లు అరకొరగా వస్తున్నాయనీ, ప్రతి రోజు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. నీటి సమస్యను అనేక మార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో రాస్తారోకో నిర్వహించామని చెప్పారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రమేష్ బాబు అక్కడకు చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. నీటి సమస్య పరిష్కరించే వరకూ ఆందోళన నిర్వహిస్తామని వారు తెలియజేయడంతో, అక్కడకి నగర పంచాయతీ కమిషనర్ వంశీ కృష్ణ అక్కడకు వచ్చి రేపటిలోగా నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కమిషనర్ హామీతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రమేష్, నియోజకవర్గ మైనార్టీ నాయకులు రియాజ్ బాషా, వార్డు కౌన్సిలర్ లు గీతా హనుమంతు, గిరి, సీఐటీయు నాయకులు మహబూబ్ బాషా, వజ్రం నాగప్ప, శ్రీరాములు, హరి, నాగరాజు, వెంకట్, హనుమంతు, బాష తదితరులు పాల్గొన్నారు.
ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాక్ లో భారీ ఎత్తున నిరసనలు