ఏపిలో ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల కాగా, వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఇవేళ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఉదయం పార్టీ బీ ఫారాలు అందుకున్న పెన్మత్స సూర్యనారాయణరాజు, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం, జయమంగళ వెంకట రమణ, బొమ్మి ఇజ్రాయెల్, కోలా గురువులు .. అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపిలో సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని అన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఇన్ని అవకాశాలు ఇవ్వలేదని సజ్జల ప్రశ్నించారు. మూడున్నరేళ్లలో సీఎం జగన్ సామాజిక విప్లవం తీసుకువచ్చారని అన్నారు. 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 స్థానాలు బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించడం జరిగిందన్నారు. అందులో 11 స్థానాలు బీసీలకు కేటాయించడం చారిత్రాత్మకం అని అన్నారు. రాజకీయ సాధికారత దిశగా సీఎం జగన్ ముందుకు వెళుతున్నారని తెలిపారు. అన్నింటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

నారా లోకేష్, చల్లా భగీరథరెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పెనుమత్స సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకరరెడ్డి పదవీ కాలం మార్చి 29వ తేదీ ముగియనుంది. ఈ స్థానాలకు భర్తీకి ఎన్నికలు జరగనుండగా, పోతుల సునీత, పెనుమత్స సూర్యనారాయణరాజులకు మరో సారి అవకాశం కల్పించింది.
YS Viveka Murder Case: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి