నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన కోటంరెడ్డి .. బుధవారం మీడియా సమావేశంలో అందుకు సంబంధించి ఇది అధారం అంటూ ఓ విషయాన్ని బయటపెట్టారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్న విషయాన్ని తనపై అభిమానంతో ఉన్న ఓ ఐపీఎస్ అధికారి చెప్పారని వెల్లడించారు. కానీ తాను మొదట నమ్మలేదన్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి తాను ఎప్పుడూ విధేయుడుగానే ఉన్నాననీ, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడ్డానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తింపు ఇవ్వకపోయినా బాధపడలేదన్నారు. పార్టీలో ఎన్నో అవమానాలు భరించానని, పార్టీ గురించి ఒక్క మాట కూడా తప్పుగా ఎక్కడా మాట్లాడలేదన్నారు. అయినప్పటికీ తన ఫోన్ చేశారని, అందుకు సంబందించి 20 రోజులకు ముందు ఆధారం దొరికిందన్నారు. తన చిన్న నాటి స్నేహితుడైన ఓ కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడిన సంభాషణ బయటకు వచ్చిందన్నారు.

ఏపి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు నెంబర్ నుండి కాల్ చేసి సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారన్నారు. తన స్నేహితుడితో మాట్లాడిన ఆడియోను తనకు పంపించారని తెలిపారు. ఇది ఫోన్ ట్యాపింగ్ కాదా అని అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ ఒక్క ఎమ్మెల్యేలతో ఆగదనీ, మంత్రులు, న్యాయమూర్తులు, ఐపీఎస్ల ఫోన్లు, విలేఖరులు, మీడియా యాజమాన్యాల ఫోన్ లు కూడా ట్యాప్ చేస్తారని ఆరోపించారు. అవమానించిన చోట ఇక తాను ఉండకూడదని నిర్ణయించుకున్నానని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయనని చెప్పేశారు కోటంరెడ్డి. తనకు నటన చేతకాదని, మోసం చేయడం రాదని కోటంరెడ్డి అన్నారు.
పార్టీ నుండి వెళ్లే వారు వెళ్లొచ్చని బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ బాలినేని మాటలను సీఎం మాటలుగానే భావిస్తున్నానని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు కోటంరెడ్డి, దేశ ద్రోహులు, స్మగ్లర్లపైనే అనుమతి తీసుకుని ఫోన్ ట్యాప్ చేస్తారని, ప్రభుత్వ పెద్దలే ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంటే ఇంకెవరికి చెప్పాలని ప్రశ్నించారు కోటంరెడ్డి.