త్రివిధ దళాల్లో ఒక లక్షా యాభై అయిదు వేళ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి విజయసాయి రెడ్డి రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఇంటర్ సర్వీసీసెస్ ఆర్గనైజేషన్స్ బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఆర్మీలో ఒక లక్షా ముప్పై ఆరు వేల ఉద్యోగాలు, నౌకాదళంలో 12,500, వైమానిక దళంలో 7 వేలు చొప్పున ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. పొరుగు దేశమైన పాకిస్తాన్ ఆగడాలను కట్టడి చేస్తూ చైనాతో ఏర్పడిన ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కోవలసిన ఈ తరుణంలో త్రివిధ దళాల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయిన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా వదిలివేయడం మంచిది కాదని అన్నారు. ఈ ఉద్యోగ ఖాళీలను ఉద్యమ స్పూర్తితో భర్తీ చేయాలని రక్షణ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

అమెరికా, చైనా తర్వాత రక్షణ రంగంపై అత్యధిక వ్యయం చేస్తున్న మూడో దేశం భారత్. ఈ రెండు దేశాలకు దీటుగా ప్రపంచంలో భారత్ తిరుగులేని సైనిక శక్తిగా ఎదగవలసిన అవసరం ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. అమెరికా ఏటా తన జీడీపీలో 3.38 శాతం…అంటే 801 బిలియన్ అమెరికన్ డాలర్లు రక్షణ రంగంపై ఖర్చు చేస్తోందనీ, చైనా ఏటా తన జీడీపీలో 1.74 శాతం…అంటే 293 బిలియన్ డాలర్లు రక్షణ రంగంపై ఖర్చు చేస్తుంటే భారత్ ఏటా కేవలం 77 బిలియన్ డాలర్లు మాత్రమే రక్షణ రంగం కోసం ఖర్చు చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంపై చేస్తున్న వ్యయం క్రమంగా తగ్గిపోతోందన్నారు. 2016-17లో కేంద్రం చేసిన మొత్తం ఖర్చులో 17.8 శాతం ఉన్న రక్షణ రంగ వ్యయం 2023-24 నాటికి 13.2 శాతానికి తగ్గిపోయిందని అన్నారు. సైన్యం ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండేందుకు జీడీపీలో రక్షణ రంగానికి మూడు శాతం బడ్జెట్‌ను ఫిక్స్‌డ్ గా కేటాయించాలని రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సును ఆయన గుర్తు చేశారు.
జాతీయ భద్రతా వ్యూహం (నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ) లేని కారణంగా త్రివిధ దళాల మధ్య సమన్వయ లోపానికి కారణమని రిటైర్డ్ రక్షణ రంగ అధిపతులు, మాజీ సైనిక ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారనీ, అంతర్గతంగాను వెలుపల నుంచి దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యల నుంచి దేశానికి రక్షణ కల్పించడానికి జాతీయ భద్రతా వ్యూహం అత్యంత ఆవశ్యమని విజయసాయి రెడ్డి అన్నారు. ఇలాంటి ముఖ్యమైన అంశంపై రక్షణ మంత్రిత్వ శాఖ దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.