వైసీపీ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మరో సారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. బాపట్లలో ఇవేళ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్దంగా ఉన్నారని విమర్శించారు. టీడీపీ కూటమికి గుణ పాఠం నేర్పిస్తామన్నారు. చంద్రబాబు తనకు తాను సింహంలా ఊహించుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు చెప్పేవి అన్నీ అబద్దాలేనని పేర్కొన్నారు. టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ గా అభివర్ణించిన విజయసాయి రెడ్డి .. అధికారం కోసం టీడీపీ నేతలు దేశ ద్రోహానికి కూడా వెనుకాడరని దుయ్యబట్టారు. దేశ వ్యతిరేక శక్తులతోనూ పొత్తు పెట్టుకుంటారని విమర్శించారు.

ఏపీలో చంద్రబాబుకు ఒక స్థిర నివాసం కూడా లేదని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసుకుని గొప్ప విజన్ అంటూ చంద్రబాబు హడావుడి చేస్తాడని, ఇప్పుడు విజన్ 2047 అంటూ కొత్త రాగం అందుకున్నాడని విమర్శించారు. ప్రజలను నమ్మించి మోసం చేసేందుకే చంద్రబాబు విజన్ మాట అని అన్నారు. 2024 తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని విజయసాయి రెడ్డి అన్నారు. అసాంఘీక వ్యక్తులు సపోర్టు చేసే టీడీపీ అసలు రాజకీయ పార్టీనే కాదని, టీడీపీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేయాలని విజయసాయి డిమాండ్ చేశారు.
లోకేష్ కు ఎటువంటి రాజకీయ భవిష్యత్తు లేదని అన్నారు. వైసీపీ ఘన విజయం సర్వేల ద్వారా తేలిపోయిందన్నారు. క్షేత్ర స్థాయిలో వైసీపీకి పూర్తి బలం ఉందని, గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. 51 శాతానికిపైగా ప్రజలందరూ వైసీపీ వైపే ఉన్నారనీ, ఈ సారి ఎన్నికల్లో 151 సీట్లకు ఒక్క సీటు కూడా తగ్గదని అన్నారు విజయసాయి రెడ్డి. ప్రజలు మళ్లీ సీఎం జగన్ సంక్షేమ పాలననే కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్ -1 తుది ఫలితాలు విడుదలు .. టాపర్లు వీరే