వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కీలక ప్రకటనపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. చిరు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో ఇల్లు కట్టుకుని ఇక్కడ స్థిరపడాలనేది తన కోరిక అని అందుకే భీమిలి రోడ్డులో స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి తెలిపారు. త్వరలో తాను విశాఖ వాసిని అవుతానని పేర్కొన్నారు. తాను కొనుగోలు చేసిన భూమిలో త్వరలో గృహ నిర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు. చిరు చేసిన ఈ ప్రకటనపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ .. ఏపి కార్యనిర్వహణ రాజధాని విశాఖపట్నంలో స్థిరపడాలని మెగాస్టార్ తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇదే సందర్భంలో త్వరలో రిలీజ్ కాబోయే వాల్తేర్ వీరయ్య చిత్రం గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని విజయసాయి తెలిపారు.

ఆదివారం విశాఖలో వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంలో చిరంజీవి.. విశాఖ ప్రాంతాన్ని, విశాఖ ప్రజలను ప్రశంసించారు. ఇక్కడి ప్రజలు కుళ్లుకుతంత్రాలకు తావు ఇవ్వరని అన్నారు. ఇక్కడ కాస్మోపాలిటన్ కల్చర్ కనిపిస్తుందన్నారు. ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. అందుకే తాను విశాఖలో సెటిల్ అవ్వాలని అనుకుని ఈమధ్యే భీమిలి రోడ్డులో స్థలం కూడా తీసుకున్నట్లు చెప్పారు. విశాఖ ఎప్పుడొచ్చినా తనకు అహ్లాదకరంగా ఉంటుందన్నారు. త్వరలో ఇల్లు కట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టాలని అన్నారు.
గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన సమయంలోనే చిరంజీవి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఆయన సోదరుడు, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ సహా వివిధ రాజకీయ పక్షాలు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా చిరంజీవి మాత్రం సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్ధించారు. స్వాగతించారు. అధికార, పరిపాలనా వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమని చిరంజీవి అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నారని చిరంజీవి ప్రశంసించారు. జగన్మోహనరెడ్డి నిర్ణయం వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఏపి ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా చేస్తున్న విశాఖ ప్రాంతంలో సెటిల్ కావాలని అనుకుంటున్నానని పేర్కొనడం విశేషం.