మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ లో వాదనలు వాడివేడిగా కొనసాగాయి. వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం లక్ష్మణ్ ఎదుట అవినాష్ తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు దాదాపు అయిదున్నర గంటల పాటు వాదనలు వినిపించారు. ఉదయం 10.50 గంటల నుండి మధ్యాహ్నం భోజన విరామం తర్వాత కూడా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు కొనసాగించారు.

అనంతరం వాదనలకు ఎంత సమయం కావాలని సునీత, సీబీఐ తరపు న్యాయవాదులను న్యాయమూర్తి ప్రశ్నించగా, కనీసం చెరో గంట సమయం కావాలని వారు తెలిపారు. ఇవేళే విచారణ పూర్తి చేస్తామని, అందరూ అంగీకరిస్తే వేసవి సెలవుల తర్వాత వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. దీనిపై స్పందించిన సునీత తరపు న్యాయవాది ఈరోజే వాదనలు కొనసాగించాలని, తమకూ అంత సమయం ఇవ్వాలని నేరుగా కోరారు. ఇవాళ సునీత, రేపు సీబీఐ తరపు న్యాయవాదుల వాదనలు వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో సునీత తరపు న్యాయవాది రవిచంద్ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను రేపు (శనివారం) ఉదయం 10.30 గంటలకు న్యాయమూర్తి వాయిదా వేశారు. రేపు సీబీఐ న్యాయవాది వాదనలు వినిపించనున్నారు.