YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇవేళ ఆయన సోదరుడు వైఎస్ భాస్కరరెడ్డి సీబీఐ విచారణను ఎదుర్కొనున్నారు. తన కుమారుడు ఎంపీ అవినాష్ రెడ్డి, పెద్ద సంఖ్యలో అభిమానులు, వైసీపీ కార్యకర్తలతో పులివెందుల నుండి భాస్కరరెడ్డి కడపకు చేరుకున్నారు. కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ నందు మరి కొద్ది సేపటిలో సీబీఐ విచారణ ప్రారంభం కానున్నది. వివేకా హత్య కేసులో ఎంపి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ని అవసరమైతే అదుపులోకి తీసుకోవడానికి సిద్దంగా ఉన్నామంటూ తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తెలిపిన నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భాస్కరరెడ్డిని ఏడాది క్రితం వరుసగా రెండు రోజుల పాటు పులివెందులలో సీబీఐ విచారించింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి మరో సారి ఆయనను సీబీఐ విచారించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై సోమవారం వరకూ అరెస్టు చేయవద్దు అంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన తండ్రి భాస్కరరెడ్డి విషయంలోనూ సీబీఐ బలవంతపు చర్యలు తీసుకునే అవకాశం లేదన్న భావన వినబడుతోంది. ఓ పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇవేళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. భాస్కరరెడ్డి సీబీఐ విచారణ నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కడపలో మోహరించాయి. ఈ తరుణంలో సీబీఐ బలవంతపు చర్యలు తీసుకుంటే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇవేళ సీబీఐ అధికారులు భాస్కరరెడ్డిని విచారించి పంపించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సోమవారం తెలంగాణ హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల తర్వాతనే ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది తెలనున్నది.
భాస్కరరెడ్డికి గత నెల 23నే విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసినా, ఆయన వ్యక్తిగత కారణాలతో గడువు కోరారు. ఆ తర్వాత ఈ నెల 5వ తేదీన మరో సారి నోటీసులు అందజేసిన సీబీఐ అధికారులు .. ఈ నెల 12న కడపలో విచారణకు రావాలని సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు. ఈ విచారణపై రకరకాల ఊహాగానాలు వస్తున్నా సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Breaking: ఈనాడు రామోజీకి ఏపి సర్కార్ బిగ్ షాక్ .. మార్గదర్శిలో నిబంధనల ఉల్లంఘనలపై సీఐడీ కేసు నమోదు