YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ తెలంగాణ హైకోర్టులో గురువారానికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఇవేళ జాబితాలో లేని పిటిషన్ల పై విచారణ చేపట్టలేమని తెలిపింది. దీంతో పిటిషన్ పై రేపు విచారణ చేపట్టాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోరగా అందుకు కోర్టు అంగీకరించింది. గురువారం మధ్యాహ్నం విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

కాగా, అవినాష్ రెడ్డి పిటిషన్ పై మంగళవారమే హైకోర్టు విచారణ చేపట్టాల్సి ఉండగా, సుప్రీం కోర్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల కాపీ అందకపోవడంతో హైకోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల సారాంశం మేరకు తదుపరి విచారణ ఉంటుందని హైకోర్టు పేర్కొంది. మరో పక్క అవినాష్ రెడ్డి నిన్ననే హైదరాబాద్ నుండి పులివెందులకు వెళ్లారు. మరో సారి సీబీఐ దర్యాప్తు తీరును ఆయన తప్పుబట్టారు. తనను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సునీత స్టేట్ మెంట్ లపైనా అనుమానం వ్యక్తం చేశారు. సునీత సీబీఐకి ఇచ్చిన మొదటి స్టేట్ మెంట్ కు తర్వాత ఇచ్చిన స్టేట్ మెంట్ కు చాలా తేడాలు ఉన్నాయని అన్నారు అవినాష్ రెడ్డి.