YSRCP: వైసీపీ ఎవరి చెవిలో “కమ్మ”ని పూలు పెడుతున్నట్టు..!?

Share

YSRCP: మనిషికి కులం ఉంటుంది.. మనిషి చుట్టూ భిన్నకులాలుంటాయి.. మనిషి బతకాలన్నా భిన్న కులాల అవసరం ఉంటుంది.. కానీ ఏపీలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ కులాలు, కుల రాజకీయాలు తయారయ్యాయి.. వీటితో పాటూ అంతరకుల రాజకీయాలు.., రాజకీయ అంతరకులాలు పుట్టుకొచ్చాయి..! ఒకప్పుడు ఏపీలో రాజకీయ ప్రయిజనాల కోసం కులాలను వాడుకుంటే.. ఇప్పుడు రాజకీయ విద్వేషాల కోసం కులాలను వాడుతుండడమే సమస్యకు కారణమవుతుంది..! ముఖ్యంగా వైసీపీ ఈ విషయంలో భిన్నమైన వైఖరితో.., వెరైటీ స్ట్రాటజీతో వెళ్తుంది.. “కమ్మ” సామాజికవర్గం విషయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు కొందరిలో అనేక అనుమానాలు కలిగిస్తుండగా.., కొందరిలో జగన్ పట్ల నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి..

YSRCP: ap cast politics
YSRCP: ap cast politics

ఇప్పుడు కొత్తా కాదు.. కానీ..!?

ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు ఇటీవల కాలంలో మరీ పెరిగిపోతున్నాయి. రాజకీయాల్లో కులాల వారీగా, మతాల వారీగా చీలికలు వచ్చే పరిస్థితి ఎక్కువగా కనబడుతోంది. కమ్మ అంటే తెలుగుదేశం, రెడ్డి అంటే వైసీపీ, కాపు అంటే జనసేనకు అనుకూలం అన్నట్లుగా మాటలు వినబడుతున్నాయి. వాస్తవానికి ఏపిలో కులాలను రాజకీయాల్లోకి తీసుకురావడం ఏప్పుడో 1970వ దశకంలోనే ప్రారంభం అయ్యింది. అప్పుడు కులాలను రాజకీయాల్లోకి తీసుకువచ్చి కుల విభజన జరిగితే ఇప్పుడు రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టడానికి కులాలను వాడుకుంటున్నారు. 1977లో రెడ్డి కాంగ్రెస్ ఏర్పాటు అయ్యింది. కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గ పెద్దలు అందరూ తమకు ఇందిరా గాంధీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె మీద, కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసి రెడ్డి కాంగ్రెస్ పేరుతో 1978 ఎన్నికల్లో విడిగా పోటీ చేశారు. మొదటి సారిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ పార్టీ తరుపునే గెలిచారు. ఆ తరువాత రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తరువాత 1982లో టీడీపీ ఎర్పాటునకు కూడా ప్రధాన కారణం సామాజిక వర్గమే. రాష్ట్రంలో మొట్టమొదటి నుండి రెడ్డి సామాజికవర్గం వాళ్లే ముఖ్యమంత్రులు అవుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు, వారితో సమానంగా ఓటింగ్ ఉన్నప్పటికీ కమ్మ సామాజిక వర్గానికి రాజకీయంగా సరైన ప్రాధాన్యత లభించడం లేదని భావించిన కొంత మంది ఆ సామాజిక వర్గ పెద్దలు ఎన్టీఆర్ తో మంతనాలు జరిపారు. కమ్మ సామాజిక వర్గంతో పాటు బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా సరైన ప్రాధాన్యత కల్పించాలని భావించి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మొదటి నుండి బీసీలకు టీడీపీ ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకున్నప్పటికీ… కమ్మ ప్రయోజనం అనే సీక్రెట్ అజెండా నడిపారు.

వైసీపీ ఎందుకో మరీ ఇలా..!?

గత అయిదారు సంవత్సరాల నుండి రాష్ట్రంలో రాజకీయం రెడ్డి, కమ్మగా మారిపోయింది. వైసీపీ అంటే రెడ్డి, కమ్మ అంటే టీడీపీ అనే విధంగా పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితులు ఇంకా మారిపోయాయి. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన సమయంలో సీఎం స్థాయిలో మొట్టమొదటి సారిగా ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ జగన్ .. పూర్తిగా ఫ్రెస్టేషన్ తో మాట్లాడారు. వాస్తవానికి ఆయన సీఎం హోదాలో ఏంతో హుందాతనంతో “ఎన్నికల వాయిదాకు ఎస్ఈసీ చెబుతున్న కారణం సహేతుకంగా లేదు. దీనిపై ప్రభుత్వం కోర్టును ఆశ్రయిస్తుంది. ఎస్ఈసీ ఎన్నికల వాయిదాపై పునరాలోచన చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయాలి”..! కానీ.. సీఎం జగన్ అలా మాట్లాడకుండా “నిమ్మగడ్డపై ఆవేశంతో మాట్లాడారు.. ఎన్నికలను వాయిదా వేయడంలో కుట్ర ఉంది. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ టీడీపీకి, కమ్మ కులానికి మేలు చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ” ఆరోపణ చేశారు. సీఎం స్థాయిలో ఆయన ఆ విధంగా కుల ప్రస్తావన తీసుకువచ్చి మాట్లాడటాన్ని చాలా మంది మేధావులు తప్పుబట్టారు. అదే విధంగా అమరావతి రాజధాని విషయంలో ఇది కమ్మవాళ్ల రాజధాని, అక్కడ కమ్మవాళ్లే ఎక్కువ, వారికే భూములు ఉన్నాయి అన్నట్లుగా వైసీపీ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కమ్మవాళ్ల కంటే బీసీలు, ఎస్సీలే అధికంగా ఉన్నారంటూ కోర్టులో అఫిడవిట్ లు దాఖలు అయ్యాయి.

కమ్మ టార్గెట్ అయితే.. ఈ పదవులు ఎందుకు..!?

కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ గా చేయడం వైసీపీ ఓ స్టాండ్ గా పెట్టుకుంది. అయితే ఇలా చేస్తుందని వైసీపీ పూర్తిగా కమ్మ వ్యతిరేక పార్టీ అనడానికి వీలులేదు… ఎందుకంటే జగన్ మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కమ్మ సామాజికవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాంలను వైసీపీలో చేర్చుకున్నారు. పలువురు కమ్మ నాయకులకు పార్టీలో, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు తాజాగా 11 మంది ఎమ్మెల్సీల కేటాయింపులో కమ్మ సామాజికవర్గానికి చెందిన ఇద్దరికి ఇచ్చారు. తలశిల రఘురాం, తూమాటి మాధవరావులను ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా వైసీపీ ప్రకటించింది. వీటన్నింటికి మించి తలశిల రఘురాం జగన్ కు అత్యంత సన్నిహితుడు. జగన్ పాదయాత్ర కు మొదటి నుండి ఇన్ చార్జిగా వ్యవహరించారు. ఇప్పుడు సలహదారుగా తలశిల ఉన్నారు. జగన్ కార్యక్రమాల ఇన్ చార్జిగా ఉన్నారు. ఓ పక్క పార్టీలో, ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గానికి పదవులు కేటాయిస్తూనే మరో పక్క ఆ సామాజిక వర్గాన్ని పేరు పెట్టి విమర్శించడంపై ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ వైరంతో చంద్రబాబును, ఆ పార్టీని విమర్శించడంలో తప్పులేదు కానీ కులాన్ని పేరు పెట్టి విమర్శించడంపైనే ఆక్షేపణ వస్తుంది. ఓ రాజకీయ పార్టీ ఇలా చేయడం వల్ల సున్నితమైన కుల విద్వేషాలను రెచ్చగొట్టినట్లు అవుతుందని, భావోద్వేగాలు బయటకు వస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. “మొత్తానికి కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేయడంలో వైసీపీ ఆడుతున్న డబుల్ గేమ్ సులువుగా అర్ధమైపోతుంది. ఓ వైపు ఆ సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూనే.., మాటిమాటికీ కమ్మ కమ్మ అంటూనే… పార్టీలో కమ్మ వాళ్లకు ప్రాధాన్యత ఇస్తూన్నారు. అంటే పార్టీలో ఉన్నవాళ్లు ఆ కమ్మ కాదా..!? వైసీపీ కమ్మ, టీడీపీ కమ్మ వేర్వేరా..!? అసలు కమ్మ వాళ్ళ ఓటింగ్ జగన్ కి అవసరం లేదా..!? లేదా కమ్మ వాళ్ళు అందరూ జగన్ పార్టీ విమర్శలకు భయపడి వల్లభనేని, కరణం తరహాలో పార్టీలోకి వచ్చేయాలా..!? పార్టీ అజెండా ఏమిటో సగటు విశ్లేషకులకు కూడా అంతు చిక్కడం లేదు..!


Share

Related posts

Bigg boss Harika : మోనల్ గజ్జర్ కు పోటీగా వచ్చేలా ఉన్న బిగ్ బాస్ హారిక?

Varun G

బిగ్ బాస్ 4: అవినాష్ ఎందుకిలా చేస్తున్నాడు..??

sekhar

Lake of skeletons: ఇండియా లోని లేక్ అఫ్ స్కెలెటన్స్ గురించి ఎప్పుడైనా విన్నారా??? Part 1

Naina