ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించినా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులు ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతకు తార్కారణమని, రాబోయే ఎన్నికల్లో విజయానికి టీడీపీ విజయానికి ఇది సంకేతమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే ఈ ఫలితాలపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు వైసీపీని బాగా ఆదరించారన్నారు సజ్జల. ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ఏదో అయిపోయిద్ది అని అనుకోవద్దని ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి చురకలు అంటించారు. ఈ ఎన్నికల్లో ఓట్లు వేసింది సమాజంలోని చిన్న సెక్షన్ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. ఇవి సొసైటిని రిప్రజెంట్ చేసేవి కావని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు అన్నీ టీడీపీవి కావనీ, పీడీఎఫ్, ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీకి వెళ్లాయని పేర్కొన్నారు. ఈ ఫలితంతో టీడీపీ బలం పెరిగిందని అనుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకత ను ప్రతిఫలించవని చెప్పారు. టీడీపీ సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదని అన్నారు. ఈ ఫలితాలను తాము హెచ్చరికగా భావించడం లేదన్నారు. ఎందుకంటే ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదనీ, ఒక వర్గం ఓటర్లను సమాజం మొత్తానికి ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు.
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రుల ఓటర్లు ఎక్కువగా లేరని సజ్జల అన్నారు. యువతకు పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లు జారీ చేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ పోటీ చేస్తొందనీ, తెలంగాణ తరహాలోనే టీడీపీ ప్రయత్నాలు చేయొచ్చని సజ్జల అభిప్రాయపడ్డారు. అయితే.. తొలి సారి టీచర్ ఎమ్మెల్సీలు గెలవడం తమకు పెద్ద విజయమని అన్నారు సజ్జల. ఉపాధ్యాయులు తమను బాగా ఆదరించారని చెప్పారు. “మా ఓటర్లు వేరే ఉన్నారు, మాకు సంతృప్తికరంగానే ఓట్లు వచ్చాయి. అలాగని ఈ పలితాలు ఎలాంటి ప్రభావం చూపవు” అని సజ్జల స్పష్టం చేశారు.
నాలుగేళ్లలో మొదటి సారి టీడీపీలో ఉత్సాహం .. రెండు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ విజయంతో..