Vijaya Sai: పార్టీలు వేరు అయినా రాజకీయ పార్టీల నేతలు పరస్పరం వివిధ సందర్భాల్లో శుభాకాంక్షలు తెలియజేసుకోవడం, ఎదురెదురుగా తారసపడిన సందర్భాల్లో షెక్ హ్యాండ్ ఇచ్చుకుని ముచ్చటించుకోవడం సర్వ సాధారణమే. అయితే ప్రస్తుతం రాజకీయ వైరాలను సైతం వ్యక్తిగత వైరాలుగా భావిస్తూ ఎడ మొహం .. పెడ మొహంగా పలువురు నేతలు ఉంటూ ఉన్నారు. రాజకీయ శతృత్వాన్ని వ్యక్తిగత శతృత్వంగా భావిస్తూ వస్తున్నారు. ప్రత్యర్ధి ఎదురుగా తారస పడకూడదని, మాట్లాడకూడదని కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఇవేళ ఓ నాయకుడు చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇవేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు. ఆ పార్టీ నేతలు ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, స్నేహితులు శుభాకాంక్షులు తెలపడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తొలి సారి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాక్షాంక్షలు తెలియజేయడం వైసీపీతో పాటు ఇతర రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ఎన్నడూ విజయసాయి ఇలా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు. చాలా వరకూ చంద్రబాబుపై ఇంతకు ముందు వ్యంగ్యంగా, విమర్శనాత్మకంగా, ఘాటు పదజాలంతో విజయసాయి ట్వీట్ లు చేస్తుండేవారు. అయతే ఇటీవల తారకరత్న మరణంతో విజయసాయిరెడ్డి కుటుంబం, నందమూరి కుటుంబం దగ్గరయ్యింది. అప్పటి నుండి చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శల ట్వీట్లు తగ్గాయి.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఇవేళ తొలి సారి విజయసాయి రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. “టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా” అంటూ విజయసాయి ట్వీట్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం తప్పు కాదు కానీ ఎన్నడూ లేని ఈ అలవాటు ఏంటని వైసీపీ క్యాడర్ సోషల్ మీడియాలోనే ప్రశ్నిస్తుండటం గమనార్హం. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
విషాదం తొక్కిసలాటలో 85 మంది మృతి, వందల మందికి గాయాలు