MP RRR: వైసీపీ రెబల్, ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత పార్టీకి కొరకరాని కొయ్యగా మారారన్నది తెలిసిన విషయమే. వైసీపీకి, రాష్ట్ర ప్రభుత్వానికీ, సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. పార్లమెంట్ లో ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అటుపై ఆయనపై రాజద్రోహం కేసు కూడా పెట్టారు. మొత్తంగా ఆయనకూ వైసీపీకి మధ్య అగాధం పూడ్చలేనంతగా పెరిగిపోయింది. ఈమధ్య ఆయనే స్వయంగా ఫిబ్రవరి 5లోపు అనర్హత వేటు వేయించాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. లేదంటే తానే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తానని అన్నారు. అయితే.. ఇప్పుడు ఆయనకే షాక్ ఇచ్చేలా రఘురామపై ప్రివిలేజ్ కమిటీకి పంపారు.

జిల్లాల పునర్విభజన ఎఫెక్ట్..
అమరావతి రాజధాని ఏకైక అజెండాగా తాను నరసాపురంలో ఉప ఎన్నికకు వెళ్తానని సవాల్ చేశారు. ఇప్పటి వరకూ ఓటమి ఎరుగని వైసీపీకి నరసాపురంలో నా గెలుపు ద్వారా అపజయాన్ని పరిచయం చేస్తానని కూడా సవాల్ చేశారు. దీంతో ఉప ఎన్నిక జరిగితే రఘురామను ఓడించేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాల పునర్విభజన ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాలు అటు రాజమహేంద్రవరంలోకి 3, ఇటు కృష్ణాలోని రెండు, పశ్చిమలోని 5 స్థానాలు కలిపి ఏలూరు జిల్లాగా, ఏడు స్థానాలతో పశ్చిమ గోదావరి జిల్లాగా మూడు భాగాలవుతోంది. భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం ఉండనుంది. ఇప్పుడీ పునర్విభజన కూడా వైసీపీకే కలిసొస్తుందా అంటే సానుకూల సంకేతాలే వస్తున్నాయి.
వైసీపీ ప్లాన్..
పశ్చిమ గోదావరి జిల్లా ప్రకారం ఏడు స్థానాల్లో వైసీపీ బలంగా ఉంటే రఘురామకు చెక్ పడక తప్పదు. రఘురామ రాజీనామా, ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలోపు.. ఉగాదికే కొత్త జిల్లాలు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే.. రఘురామకు వైసీపీ స్కెచ్ లో పడినట్టే. అయితే.. జనగనణ ప్రకారం జూన్ వరకూ ఈ ప్రక్రియ చేపట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. మరోవైపు.. ఎంపీ భరత్ వేసిన పిటిషన్ పై లోక్ సభ స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపారు. ఇన్ని పరిణామాల మధ్య రఘురామ ఎత్తులు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.