అమ్మ జగనా…! కన్ను కరోనాపై… బుర్ర బాబుపై…!

23 Mar, 2020 - 09:12 PM

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో )

పోలీసుల విచారణ… ఆహా చాలలేదు.
సిఐడి విచారణ… ఆహా ఇదీ సరిపోలేదు.
సిట్ కి అన్ని పవర్లు ఇచ్చి విచారణ…! ఆహా ఇదీ అనుకున్నట్టు జరగట్లేదు. ఇక సీబీఐ ప్రధానాయుధం. బాబుకి లు బేడీలు వేయాలంటే ఢిల్లీ నుండి ఫైళ్లు కదలాల్సిందే. ఢిల్లీ నుండి నరుక్కు రావాల్సిందే…! అదే జరిగింది. జగన్ కన్ను కరోనా నియంత్రణపై ఉన్నా…, మైండ్ మాత్రం బాబుకి బేడీలు వేయించడంపైనే ఉంది. అమరావతి రాజధానిలో అక్రమాలపై చివరి అస్త్రం సీబీఐని దించాలని జీవో ఇచ్చేసారు. రాష్ట్రం.., దేశం…, ప్రపంచమే కరోనా అంటూ వనికిపోతున్న వేళ… జగన్ మాత్రం పక్కాగా, చక్కగా ఓ జీవో వదిలారు.


వెంటనే దిగాల్సిందే…!
“తమ్ముడు తమ్ముడే… పేకాట పేకాటే” ఇది బాగా అతికెల… కరోనా పని కరోనాదే., బాబు పని బాబుదే… ముందు బాబుకి బేడీలు పడాల్సిందే అని జగన్ మైండ్ నిత్యం ఆలోచిస్తుంది. అందుకే సీబీఐ మంత్రం వేశారు. ఇక వెంటనే దీనిపై కేంద్రం నుండి అనుమతి వచ్చేలా రంగంలోకి దిగాలి. సీబీఐ ఉన్నతాధికారుల నుండి, కేంద్ర హోమ్ శాఖ నుండి అనుమతులు రావాలి. దీనికి కాస్త లాబీయింగ్ చేయాలి. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ని ఒప్పించాలి. సాధారణంగా సీబీఐ విచారణ అంటేనే లేటు. ఇప్పటికీ రాష్ట్రంలోని వివేకా హత్య కేసు, సుగాలి ప్రీతి హత్య కేసుని సీబీఐకి ఇచ్చారు. ఇక ఇది మూడోది. కానీ ఇదే ముందు, ఇదే కీలకం. చంద్రబాబు బృందాన్ని నైతికంగా, రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బ కొట్టాలంటే వెంటనే సీబీఐ రావాలి, విచారణ మొదలు పెట్టాలి, బాబుకి చుక్కలు చూపించాలి.
బీజేపీ ఓకే అంటేనే…!
బాబుపై…, పూర్వ ప్రభుత్వ రాజధాని అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలంటే రాష్ట్రం జీవో ఇస్తే సరిపోదు. కేంద్రం అనుమతించాలి కదా. అంటే ఇక్కడ వైసీపీకి ప్రధాన శత్రువు బాబు కాబట్టి సులువుగా జీవో ఇచ్చేసారు. కానీ అక్కడ బిజెపికి చాలా పనులున్నాయి. నాడు 2011లో అంటే సోనియాగాంధీ ఇగో పై జగన్ దెబ్బ కొట్టి బయటకు వచ్చాడు కాబట్టి సీబీఐ దస్త్రం వేగంగా కదిలింది. ఏడాదిన్నరలో విచారణ, అరెస్టు, ఆస్తుల స్వాధీనం అన్ని చకచకా జరిగిపోయాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు. అసలైన లాబీయిస్టు, ముదురు. అందుకే జగన్ తక్షణ వ్యూహం బిజెపి పెద్దల ద్వారా ఒప్పించడం. ఎలాగూ నత్వాని, ముఖేష్ ద్వారా అమిత్ షా కి దగ్గరయ్యాడు కాబట్టి సులువుగా కలిసేసి అడిగేయొచ్చు.., 2019 నాటి పరిస్థితుల దృష్ట్యా అమిత్ షా, మోడీ కూడా చంద్రబాబుపై ఒకింత కోపంతో ఉన్నారు కాబట్టి ఆమోదం తెలిపేయొచ్చు. కానీ రాజకీయ కోణంలో మధ్యలో ఆపేయొచ్చు… బీజేపీ ఏమైనా చేయొచ్చు. సో… ఇదన్న మాట సంగతి. చంద్రబాబు ప్రభుత్వ రాజధాని అక్రమాలపై మనం త్వరలో పుంఖానుపుంఖాలుగా సాక్షిలో కథనాలు, మంత్రుల నోటి నుండి మాటలు వినబోతున్నాం, చూడబోతున్నాం. చూద్దాం… సీబీఐ బేడీలు బాబుకి పడతాయో, జగన్ ఆశ నెరవేరుతుందో లేదో…! – శ్రీనివాస్ మానెం