ప్చ్… జగనుకి కోర్టులు కలిసి రావట్లే…!!

23 Mar, 2020 - 07:57 PM

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: జగన్ సర్కార్ కు కోర్టులు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని ప్రభుత్వం సవాల్ చేయగా కమిషనర్ నిర్ణయాన్ని సమర్ధించిన సుప్రీం కోర్టు తాజాగా ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ను సమర్ధించింది. నేడు హైకోర్టు రెండు ప్రభుత్వ జిఓలపై స్టే ఇచ్చింది.

ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
అమరావతి రాజధాని ప్రాంతంలో వేరే ప్రాంతాలవారికి భూములిస్తూ…వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. గుంటూరు, విజయవాడ, దుగ్గిరాల, పెదకాకాని ప్రాంతాలకు చెందిన 51 వేల మందికి 1,215 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజధాని ప్రాంత రైతులు ఆ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని గ్రామాల్లోని పేదలకు మాత్రమే భూములివ్వాలని సీఆర్డీఏ చట్టంలో ఉందని రైతుల తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం స్టే ఇచ్చింది. అదే మాదిరిగా విశాఖ జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 6 వేల ఎకరాలను కేటాయిస్తూ జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. భూ సమీకరణ విధానం కింద ఈ భూములను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోని రైతులు సవాల్ చేయగా హైకోర్టు స్టే ఇచ్చింది.

పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులపై.. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. సత్వరమే రంగులు తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టులో జరిగిన విచారణలో భాగంగా.. గ్రామ సచివాలయ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశించింది. దీనిపై సుప్రీం కోర్టులో సవాల్ చేయగా హైకోర్టు కోర్టు తీర్పును సమర్ధించింది.

ఇంగ్లీష్ మీడియం విద్యా భోదన విషయంలో

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపైనా విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గకుండా నేడు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై న్యాయపరమైన చిక్కులు, ప్రతిపక్షాల విమర్శలు రాకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయనున్నట్లు తెలిపింది. అయితే ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు మీడియం చదవాలనుకునే పిల్లల కోసం మండలానికి ఒక తెలుగు మీడియం స్కూలును ఏర్పాటు చేయనుంది. ఉర్థు, ఒరియా, కన్నడ, తమిళ మీడియం స్కూళ్లను యథాతథంగా కొనసాగించనున్నారు. ప్రతి మీడియం స్కూల్‌లోనూ తెలుగును తప్పనిసరి చేయాలని ఆదేశాలిచ్చారు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు బస్సు ఛార్జీలు కూడా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్బంధ ఇంగ్లీష్ మీడియం అమలుపై ప్రతిపక్షాల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. శాసనమండలిలో బిల్లును తిప్పి పంపారు. తర్వాత హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై… వారికి ఇష్టమైన మీడియంలో చదువుకునే హక్కు విద్యార్థులకు ఉందని హైకోర్టు తెలిపింది. ఇంగ్లీష్ మీడియంలో నిర్బంధ బోధన కుదరదని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేసేందుకు సిద్ధమైంది.