యాంకర్లు కాదు.. ప్రవక్తలు!

20 Jan, 2020 - 08:17 PM

రాజకీయాలు ఛానళ్ళను నడిపించాలా? లేదా ఛానళ్ళు రాజకీయాలను పురిగొల్పాలా?? మొదటిది చాలా సహజం! అది మామూలు సమయంలో వర్తిస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో రెండవది కీలకంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇదే సాగుతోంది. చావా, రేవో – అని రాజకీయ  పార్టీలు కాకుండా వాటి అనుబంధమని అందరూ నమ్మే ఛానళ్ళు ఇపుడు నడుస్తున్నాయి. నిజానికి ఇది టి.ఆర్.పి.ల స్థాయిని దాటిన స్థితి. దాన్ని వారు బహిరంగంగా చెప్పకపోవచ్చు కానీ, ఇది నడుస్తున్న చరిత్ర. విశాలాంధ్ర, ప్రజాశక్తి పత్రికలు రాజకీయ పార్టీల పత్రికలని దశాబ్దం క్రితం విడిగా చెప్పేవారు. కానీ నేడు వీటికి మించిన అన్యోన్యత పార్టీలు – మీడియా సంస్థల మధ్య వెల్లివిరుస్తోంది. నిజానికి చాలా వార్తా ఛానళ్ళు  లాభదాయకం కాని పరిస్థితుల్లో నడుస్తున్నాయి. కానీ ఆ ఛానళ్ళు నడవడమే కాదు కొత్తవి వస్తున్నాయి కూడా. అంటే అదృశ్యశక్తులు వున్నాయ్? వీక్షకులు, విమర్శకులు గుర్తించాలి.

బయటికి చెప్పే వాదనలు, వివరణలు చాలా తమాషాగా, చమత్కారంగా ఉంటాయి. 2008 నవంబరు నెలలో ముంబాయిలోని తాజ్ హోటల్లో ముష్కరులు కాల్పులు జరిపారు. దీనికి సంబంధించి న్యూస్ ఛానళ్ళు ప్రత్యక్ష ప్రసారాలు చేసి చాలా అపవాదు మూటగట్టుకున్నాయి. దీనికి టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ చేసిన సమర్థన చాలామందికి నవ్వు తెప్పించింది. దానికి 150 సంవత్సరాలు మించిన అనుభవమున్న ఆ పత్రిక చెప్పిన కారణం ఏమిటంటే  భారతదేశంలో వార్తాఛానళ్ళకు బాలారిష్టాలు దాటలేదని. అప్పటికి మనదేశంలో వార్తా ఛానళ్ళు ప్రవేశించి ఒక దశాబ్దం అయ్యింది కూడా. అంతకు మించిన  కారణం వారికి దొరకలేదని మనం భావించాలి. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ యజమాని కొత్త సిద్ధాంతం ప్రతిపాదించారు. టిఆర్‌పిల కోసం వార్తాఛానళ్ళు సంచలనాలు సృష్టించడం తప్పు కాదని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు నడుస్తున్న భాగోతం వేరుగా వుంది. సాక్షి మీడియా (తొలుత పత్రిక, తర్వాత ఛానల్) రాకముందు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నాయకుల – మీడియా యజమానుల పెనుగులాట భయంకరంగా సాగింది. పుష్కరం తర్వాత మళ్ళీ అమరావతి చుట్టూ నడిచే మీడియా ఛానళ్ళు అలాంటి చరిత్రను తిరగరాస్తున్నాయి. ఇపుడు ఆంధ్రప్రదేశ్ ఛానళ్ళ వార్తా పరిథి 13 జిల్లాలు కాదు 29 గ్రామాలు అనే రీతిలో ఈటీవీ, ఏబిఎన్, టీవీ-5, ఏపి24×7 వంటి ఛానళ్ళు సాగుతున్నాయి. ఈ సంస్థలు నడిపే పత్రికలలో కానరాని ‘కుచించుక పోవడం’ టీవీ ఛానళ్ళలో ఉంటోంది. అదే నేటి మీడియా సంస్థల వ్యూహాల రహస్యం. సంపాదకీయంలో పాలసీ  ప్రకటించనవసరంలేని సౌలభ్యం ఛానళ్ళలో ఉంటోంది. తాము మాట్లాడకుండా ప్రజావాణి అంటూ తమకు నచ్చిన లేదా తాము ఏర్పాటు చేసుకున్న వార్తలను ప్రసారం చేయవచ్చు.

ఇంతవరకు చెప్పుకున్న న్యూసెన్స్ కొంతకాగా; అసలు సమస్య డిబేట్ల యాంకర్లు ప్రవక్తలుగా మారిపోవడం. దేశం, జాతి, భవిష్యత్తు అంటూ యాంకర్లు అన్ని విషయాలు టీవీ స్క్రీన్ అంత నోరు చేసుకుని గంటలు తరబడి చర్చలు నిర్వహించడం. ఈ ఉద్యోగంలోకి రాక ముందు వీరు ఏమి చేశారు, ఏమి చదువుకున్నారు, వారి భావజాలం ఏమిటి, భవిష్యత్తు పట్ల ధోరణి ఏమిటి – అనేవి మనకు అసలు తెలియవు. ఎంతటి పానలిస్టునైనా వాక్యం మధ్యలో కాదు, పదం మధ్యలో కూడా ఆపి తాము చెప్పాలనుకున్నది  చెబుతుంటారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ మేథావుల ప్రపంచానికి తామే దిక్సూచులమన్నట్టు గొప్ప ప్రసంగాలు చేస్తుంటారు. పార్టీల ప్రతినిధులను మించి పార్టీలను కాపుకాసి రక్షిస్తుంటారు. ఈ ధోరణిని మీడియా యజమానులు ముందు ముందు ఎలా వివరించి, సమర్ధించుకుంటారో వేచి చూడాలి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ చైతన్యశీలుర మేథస్సు ఇలా గుంటపూలు పూస్తోంది.

డా. నాగసూరి వేణుగోపాల్