చేయి దాటితే చేటే…!

25 Mar, 2020 - 08:56 AM

మానవాళి మనుగడకు సవాలు విసిరిన కరోనా కట్టడి ఎలా? చైనా కాస్త కుదురుకుంటుంది. ఇటలీ దెబ్బతింటుంది. స్పెయిన్ అల్లకల్లోలం ఆగడం లేదు. అమెరికాకు గతి చిక్కడం లేదు. ఎక్కడా మరణాలు ఆగడం లేదు. మనకూ సోకింది. మాయదారి వైరస్ దేశంలో ప్రస్తుతం చేతుల్లోనే ఉంది. 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తున్నాం… మరి ఈ 21 రోజుల్లో అదుపులోకి వస్తుందా? పూర్తిగా దేశం నుండి వెళ్లిపోతుందా? 21 రోజుల తర్వాత కరోనను జయించేసినట్టేనా? అంటే ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే. ఇది కేవలం ప్రయత్నం మాత్రమే. మహమ్మారిని ఆపేందుకు మనం ప్రస్తుతం చేయగలిగింది ఇది మాత్రమే. ఇక్కడితో ఆగదు, ఆగిపోదు. కానీ ఫలితం ఆశించి ప్రయత్నం చేయడం మానవ ధర్మం, ఇప్పుడు దేశం చేస్తున్నది అదే.

ఎమర్జెన్సీ తప్పదు… తర్వాతో…!

ఇప్పుడు 21 రోజులు సామాజిక దూరం వలన కరోనా వ్యాప్తి తగ్గుతుంది. కానీ చాపకింద నీరులా వ్యాప్తి మాత్రం ఆగదు. గడిచిన నాలుగు రోజులుగా దేశంలో ఇళ్ల నుండి బయటకు రావడం పూర్తిగా తగ్గుతుంది. కానీ కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. ఎక్కడో ఓ చోట ఓ విదేశీయాన వ్యక్తి తగలడం, అతనికి వైరస్ సోకడం, అతని ద్వారా మిగిలిన వారికి పాజిటివ్ రావడం పరిపాటిగా మారింది. తెలంగాణలోని కొత్తగూడెం డీఎస్పి కుమారుడితో కలిసి పశ్చిమగోదావరి జిల్లాలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. ఆ కుమారుడు లండన్ నుండి వచ్చారు. ఇప్పుడు ఆ తండ్రీకొడుకులకు పాజిటివ్ తేలింది. అక్కడితో ఆగలేదు. ఆ శుభ కార్యానికి హాజరైన వారిలో ఎంతమందికి ఉంది, వారు ఇంకా ఎక్కడెక్కడికి వెళ్లారు అనేది ప్రస్తుతం ప్రశ్నగా మారింది. ఇలా సామాజికంగా మనిషి నుండి మనిషికి సులువుగా పాకేస్తుంది. ఈ వ్యాప్తిని ఆపడానికి మాత్రమే ఈ 21 రోజులు. అంతే తప్ప దేశం నుండి పూర్తిగా తరిమెయ్యడానికి కాదు. అది ప్రస్తుతం అసాధ్యమే. అప్పటికీ అదుపు కాకుంటే మెడికల్ ఎమర్జెన్సీ విధించే అవకాశాలు పరిశీలనలో ఉన్నాయి. ఆనక ఫుడ్, ఫినాన్సియల్ ఎమర్జెన్సీలు కూడా తప్పవు. ఇవన్నీ తాత్కాలికమే అయినా గడువు చెప్పలేం. దీని ఫలితంగా ముందు బలయ్యేది మధ్యతరగతి, పేద వర్గాలే. తగిన సాయం అందక, చేతిలో అవసరాలు తీరక, ఆకలితో అలమటించే అవకాశాలు లేకపోలేదు. అందుకే పరోక్షంగా ప్రభుత్వమే పొదుపు పాటిస్తూ, జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకునేలా సలహాలిస్తుంది.

శాస్త్రాల ఘోస మామూలుగా లేదుగా…!

సరే ఇప్పుడు సైన్స్ ఈ కరోనాకి మందు కనిపెట్టే పనిలో ఉంది. మరి ఈ సమయంలో తాము ఖాళీగా ఉంటే ఎలా అనుకుని… శాస్త్రాల నిపుణులు రంగంలోకి దిగారు. గ్రహాల చేటు.., రాసుల కలయిక, కదలిక అనుకూలం కాదంటూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు అంటూ…, మే చివరి వరకు తప్పదు అంటూ… ఎవరికి తోచిన భవిష్యత్ వారు చెప్పుకొస్తున్నారు. దానికి నిరూపనగా గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు అంటూ లెక్కలు తీస్తున్నారు. ఇవి మనం నమ్మాల్సిన పని లేదు, పూర్తిగా పక్కన పెట్టేయాల్సిన పనీ లేదు. కానీ అటు సైన్స్ నుండి ఆశించిన ఫలితం రావడం లేదు. ఇటు శాస్త్రం ఘోస కూడా ప్రతికూలంగా ఉంది. మరోవైపు 21 రోజులు ఆగినా కట్టడిపై నమ్మకం లేదు. ఇలా ఎలా చూసినా కరోనా విషయంలో మానవాళికి, దేశానికి అనుకూల పవనాలు ప్రస్తుతానికి లేవు. అందుకే చేయి దాటకుండా చూడడమే మన పని. చేయి దాటితే మాత్రం కచ్చితంగా చేటు తప్పదు. రానున్న వందల, వేల మరణాలు కళ్లారా చూస్తూ నిస్చేష్టులై ఉండిపోవడమే మన సాంకేతిక మెదళ్ల పని.