NewsOrbit
బిగ్ స్టోరీ

పవన్ కల్యాణ్ గారూ నా మాటలు కాస్త ఆలకించండి!

పవన్ కల్యాణ్ గారూ, మొన్న ఆంధ్రజ్యోతిలో మీ ఇంటర్వ్యూ చదివాను. నాకు కలిగిన అభిప్రాయాలు మీకు చెప్పాలనిపించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మీకు ప్రజాదరణ ఉంది. మీరు చివరికి ఏం చేస్తారన్నదానితో, ఏ పార్టీతో సంబంధం పెట్టుకుంటారన్న దానితో నిమిత్తం లేకుండా ఈ మాటలు మీకు చెబుతున్నాను. ఎందుకంటే మీరు ఏదన్నా చెబితే ప్రజలు ఆ మాటలు ఆలకిస్తారు. ప్రజలు అలా ఆలకించేలా చేసుకోగలిగిన శక్తి రాష్ట్రంలో ప్రస్తుతానికి మరో ఇద్దరికే ఉంది. వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు. అలాంటి శక్తి ఉండడం గొప్ప సంగతి. అది ఉన్నవారు అసంఖ్యాక జనావళికి దగ్గరవుతారు కాబట్టి ప్రజలపై గట్టి ప్రభావం చూపగలరు. ఆ కారణంగా వారి అభిప్రాయాలకు విలువ ఎక్కువ. మంచివయినా సరే చచ్చువయినా సరే.

మొదటగా కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి రద్దు చేయడం గురించి. మీరు చెప్పిన మాటలు, అక్కడ ముందు కశ్మీరీ పండిట్ల హక్కులకు భంగం కలిగింది కాబట్టి ఇప్పుడు మిగతా కశ్మీరీల హక్కులకు భంగం కలిగినా ఫరవాలేదనిపించేలా ఉన్నాయి. మరింత స్థూలంగా చూస్తే కశ్మీరీ మిలిటెంట్లనూ, సాధారణ కశ్మీరీ ముస్లింలనూ మీరు ఒకే గాట కట్టారనిపిస్తోంది. చెగువెరాను ఆరాధించే మీరు ఒక ప్రజా సమూహం హక్కుల గురించి అంత తేలికగా తీసుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. రెండు తప్పులు ఎప్పటికీ ఒప్పు కావు మిత్రమా. ఇంకో రకంగా చెప్పాలంటే రెండవ తప్పు చేసి మొదటి తప్పును సరిదిద్దలేం.

ఈ పని  కశ్మీరీల కోసం చేశామని కదా మోదీ – షా ద్వయం చెబుతున్నది! మరి ఆ పనికి కశ్మీరీలు సంతోషంగా లేకపోవడం ఏమిటని మీకెన్నడూ సందేహం కలగలేదా? కశ్మీర్‌ లోయలో అంతా సవ్యంగా ఉందంటున్నారే, మరి మూడు నెలలు దాటిపోయిన తర్వాత కూడా అక్కడ ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు నిర్బంధంలో ఎందుకున్నారో? వారి మిలిటెంట్లు కారు. పూర్తిగా ప్రజ్యాస్వామిక వాదులే కదా! మీరు సినిమా రంగం నుంచి వచ్చారు కాబట్టి మరొక్క మాట చెబుతున్నాను. మిలిటెన్సీ తీవ్రంగా పెచ్చరిల్లిన రోజుల్లో కూడా అప్పుడప్పుడూ తప్ప కశ్మీర్ లోయలో సినిమా షూటింగ్‌లు ఆగలేదు.

కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు సందర్భంగానే, ఏ సమస్యపైనన్నా మేధావులు తటస్థ వైఖరి అవలంబించాలని మీరు అభిప్రాయపడ్డారు. అది ఎలా సాధ్యమో నాకు అర్ధం కాలేదు. రైటు, లెఫ్టు కాకుండా మధ్యన నుంచొని  సమస్యను సంపూర్ణంగా చూడాలని మీరు అన్నారు. అలానే అనుకుందాం. మరి మీరు ఎక్కడ నుంచొని చూస్తే మీకు కశ్మీరీ పండిట్ల హక్కుల ఉల్లంఘన కనబడి, కశ్మీరీ ముస్లింల హక్కుల ఉల్లంఘన కనబడకుండాపోయింది? నాదృష్టిలో సత్యం కీలకం అని మీరు అదే సందర్భంలో అన్నారు. అంటే కశ్మీరీ పండిట్ల హక్కుల ఉల్లంఘన ఒక్కటే కశ్మీర్ సమస్యకు సంబంధించిన సత్యమా? సమాజ గమనానికి సంబంధించిన అంశాలలో చిరసత్యాలతో పాటు సాపేక్ష సత్యాలు కూడా ఉంటాయని మీ అధ్యయనంలో మీకు ఎప్పుడూ తోచలేదా? మధ్యతరగతి మేధావి వర్గంపై మీరు మరిన్ని అభాండాలు వేశారు. ఆ వర్గం కార్పొరేట్లకు అండగా మారిపోయిందని అన్నారు. కార్పొరేట్లు చేస్తున్న సహజ వనరుల దోపిడీ, వారి వల్ల జరుగుతున్న పర్యావరణ విధ్వంసం, ప్రజా సమూహాల హక్కుల హననంపై గొంతెత్తుతున్నదీ, ఈ ధోరణులకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాలకు అండగా నిలుస్తున్నదీ మధ్యతరగతి మేధావులేనన్న సంగతి మీకు నిజంగా తెలియదా, లేక కావాలని మాట్లాడుతున్నారా?

మీరు మాట్లాడిన ఇంకొక అంశం అత్యాచారాల వంటి హేయమైన నేరాలకు  శిక్షల గురించి. మీరు దుబాయ్, సింగపూర్ వంటి చోట్ల అమలులో ఉన్న కఠినమైన దండనలను బలపరిచారు. ప్రపంచవ్యాప్తంగా నేర శిక్షాస్మృతి పరిణామం చెందుతూ వచ్చింది. యూరప్ దేశాల్లో కూడా ఒకప్పుడు మరణశిక్షను బహిరంగంగా అమలు చేసేవారు. ఒకప్పటి రోమన్ చక్రవర్తులు సామాన్యులకు వినోదం కల్పించేందుకు కోలాజియంలో మనుషులను మనుషులు వధించే క్రీడలు బానిసలతో నిర్వహించేవారు. దానికీ మరణశిక్ష బహిరంగంగా అమలు చేయడానికీ మధ్య పెద్ద తేడా లేదు (ఇప్పుడు నాగరీక సమాజాలుగా గుర్తింపు పొందుతున్న యూరప్ దేశాల్లో ఒకప్పుడు బహిరంగ శిక్షలకు ప్రజలు ఎలా కేరింతలు కొట్టేవారో తెలుసుకుంటే విపరీతమైన ఆశ్చర్యం కలగకమానదు). ఈ రకమైన శిక్షలు నేరాలను నిరోధించలేవని కూడా రుజువయింది. మానవ సమాజం క్రమంగా నాగరీక శిక్షాస్మృతి వైపు పయనించింది. దీనికి అక్కడక్కడా మినహాయింపులు ఉన్న మాట వాస్తవమే. మన సమాజం కూడా మళ్లీ వెనక్కు వెళ్లాలని మీరు కోరుకుంటున్నారా?

సినిమా హాళ్లలో జనగణమన పాడడం ప్రస్తావనకు వచ్చినపుడు మీరు ముస్లింల గురించి మాట్లాడారు. హిందువులలో ఎవరన్నా తప్పు చేస్తే సాటి మతస్తులే ఖండిస్తున్నారనీ, అదే ముస్లింల దగ్గరకొచ్చే సరికి  అలా జరగడం లేదనీ మీరు  అన్నారు. మీకు ఈ అభిప్రాయం ఎందుకు కలిగిందో మాత్రం వివరించలేదు. ముస్లింలు ఒక సమూహంగా మతవాదులు అన్న అభిప్రాయం మీ మాటల్లో ధ్వనిస్తున్నది. ఇది పూర్తిగా తప్పు అభిప్రాయమని నేను చెప్పదలచుకున్నాను. అక్బరుద్దీన్ ఒవైసీ ఒక్కడే ముస్లిం సమాజానికి ప్రతినిధి అని మీరు భావిస్తున్నట్లున్నారు. కాదు. ముస్లింలలో చాలామంది సంస్కరణ వాదులు ఉన్నారు. ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకమాట అంటున్నాను. ఏమాత్రం భిన్నాభిప్రాయం కనబడినా అది వెలిబుచ్చిన వారిని పాకిస్థాన్ వెళ్లండని హుంకరించే హిందుత్వ వాదులు – వీరిలో కొందరు కేంద్రమంత్రులు -చాలామంది తయారయ్యారు. మరి హిందూ సమాజం కూడా సంస్కరణకు అతీతంగా తయారయిందని అందామా?

బిజెపితో మీ సంబంధాల గురించి ఇటీవల చాలా చర్చ జరుగుతోంది. అమిత్ షా అంటే చాలా ఇష్టం అని మీరు ఆ మధ్య చెప్పారు. విభజన హామీలు అమలు చేయకపోయేసరికి ప్రజల కోసం విభేదించాను కానీ బిజెపితో సంబంధాలు తెగలేదని కూడా అన్నారు.  తాజా ఇంటర్వ్యూలో మీరు ఇంకాస్త స్పష్టత ఇచ్చారు. ఒక్క విషయం అడగదలచుకున్నాను  మిమ్మల్ని. పార్లమెంట్ సాక్షిగా, ఆ తర్వాత 2014 ఎన్నికల ప్రచారంలో ప్రజల సమక్షంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన అనంతరం తుంగలో తొక్కి పైగా అబద్ధాలతో బూకరించే రాజకీయపార్టీతో మీకు ఇంకా సంబంధాలు ఏమిటి? మీ కార్యక్షేత్రం తెలుగునేల. ఇక్కడి ప్రజలకు సంబంధించి బిజెపి ఇంకా ఏం ద్రోహం చేస్తే దానికి మీరు దూరం అవుతారు?

మీ రాజకీయాలు అధికారం కోసం కాదని మీరు మరోసారి ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. రాజకీయాలు రిజల్ట్ ఓరియెంటెడ్ కాదనీ, జర్నీ ఓరియెంటెడ్ అనీ మీరు అన్నారు. ప్రయాణానికి కూడా గమ్యం ఉంటుంది. రాజకీయాల గమ్యం అధికారమేనన్న సంగతి మీకు తెలియదని నేను అనుకోను(గతంలో మీరు అధికారం సంపాదిస్తామని అన్నారు కూడా). అధికారం సంపాదిస్తేనే కదా అనుకున్నది అమలు పరచగలిగేది! ఆంధ్రప్రదేశ్‌ సర్వతోముఖాభివృద్దికి నాకు అధికారం అప్పగించి చూడండి అంటూ మీరు ప్రజల ముందుకు వెళ్లే ఆలోచన అసలు ఉందా లేదా? లేక అభాసుపాలవుతామన్న భయం వెనక్కు లాగుతున్నదా?

దామోదర సావర్కర్‌, భగత్‌సింగ్‌ పేర్లు మీరు ఒకే చోట ప్రస్తావించారు. ఇంటర్వ్యూలో మీరు చెప్పిన మాటలన్నీ చూస్తే సావర్కర్ అంటే కూడా మీకు ఇష్టమేనని నేను అనుకుంటున్నాను. అండమాన్ జైలు నుంచి బయటపడేందుకు బ్రిటిష్ పాలకులతో కాళ్ల బేరానికి వచ్చిన సావర్కర్, వలస పాలకులను ధిక్కరించి నవ్వుతూ ఉరికబం ఎక్కిన భగత్‌సింగ్ ఇద్దరూ మీకు ఒకేలా కనబడుతున్నారా? గాంధీజీ హత్యలో సావర్కర్ కూడా ఒక నిందితుడని మీకు తెలుసా? ఆధారాలు లేని కారణంగా ఆయనపై కేసు కొట్టివేసినా అసలు నిందితుడిగా ఎందుకు నిలబడాల్సివచ్చిందన్న మీమాంస మీకు ఎప్పుడూ రాలేదా?

ఇంటర్వ్యూలో చివరిగా మీరు మైనారిటీల గురించి  మాట్లాడారు. మెజారిటీ మతం వేపు మొగ్గు చూపుతున్నారన్న ప్రశ్నకు సమాధానంగా మీరు కులాన్నే తీయలేకపోయినపుడు మతాన్ని తొలగిండం అంత తేలిక కాదని అన్నారు. ఇక్కడ అంశం కులనిర్మూలన కాదు. మెజారిటీ మతవాదాన్ని మీరు బలపరుస్తున్నారన్న అభిప్రాయం సరైనదా కాదా అన్నది. సరైనదేనని మీ సమాధానం సూచిస్తున్నది. భారతీయతను మీరు గౌరవించండి. కాదనేవారు ఎవరు! భారతీయత పేరుతో బూటకపు జాతీయవాదాన్ని దేశంపై రుద్దే ప్రయత్నాలను ఖండించాలా వద్దా చెప్పండి. మతం ప్రాతిపదికగా వివక్ష కూడదన్న ఒక్క మాట మీ నోటి  నుంచి ఎందుకు రాలేదు మిత్రమా? ఇది అన్యాయం కదూ?

 

ఆలపాటి సురేశ్ కుమార్

 

 

author avatar
Siva Prasad

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment