AP High Court: ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలకు అతీతంగా ఎక్కువ మంది వేచి చూస్తున్న అంశం “రాజధాని వికేంద్రీకరణపై హైకోర్టు తుది తీర్పు”..! అప్పుడెప్పుడో గత ఏడాది ఆగష్టులో మొదలైన విచారణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కరోనా తర్వాత తేల్చేస్తామంటూ ఫిబ్రవరిలోనే చెప్పిన న్యాయమూర్తులు ఈరోజు లేదా వచ్చే నెలలో తుది తీర్పు ఇచ్చేస్తారేమోనని చాల మంది ఆశించారు. కోర్టు కూడా ఈ కేసుపై రోజువారీ విచారణ చేపడతాం, త్వరగా చీల్చేస్తామంటూ సంకేతాలిచ్చింది. కానీ తాజాగా ఈరోజు మళ్ళీ హైకోర్టు ముందు విచారణకు వచ్చినప్పటికీ నవంబరు 15కి వాయిదా పడింది. జగన్ ప్రభుత్వం ఏ మాత్రం ఊహించని విధంగా ఈ కేసులో హైకోర్టు ఎక్కువగా సమయం తీసుకుంటూ.., సుదూర వాయిదాలు వేస్తుంది. ఈరోజు వాదనల్లో చూసుకుంటే పిటిషనర్ల తరపు వాదనలే నెగ్గినట్టు చెప్పుకోవచ్చు..!

AP High Court: బౌతికంగా వాదించలేం.. నేరుగా కలుద్దాం..!
రాజధాని వికేంద్రీకరణపై దాఖలైన పిటిషన్లపై దాదాపు ఆరు నెలల విరామం తర్వాత ఈరోజు విచారణ ఆరంభమయింది. విచారణ చేపట్టిన నిమిషాల వ్యవధిలోనే పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాయిదా కోరారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించే కీలకమైన కేసు. విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా చేపట్టాలి. ఢిల్లీ నుండి కూడా విధించాల్సిన న్యాయవాదులు ఉన్నారు. దీనిలో భాగంగా న్యాయమూర్తులు అనేక కీలకమైన దస్త్రాలు పరిశీలించాల్సి ఉంది. అందుకే బౌతికంగా కలిసి, అన్ని డాక్యూమెంట్లు సిద్ధం చేసుకుని విచారణ చేపడితే బాగుంటుంది” అని కోరారు. దీనికి ప్రభుత్వం తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. “ఈ కేసులో ఇప్పటికే ఆలస్యమయిన కారణంగా రాష్ట్రంలో ఒక గందరగోళం నెలకొందని.. రాజధాని విషయంలో కోర్టు త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు” ఇటు పక్షాల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి.. ఈ కేసు విచారణను నవంబరు 15కి వాయిదా వేశారు. బౌతికంగా కలిసి, దస్త్రాలు అన్నిటినీ పరిశీలించి తదుపరి విచారణ చేయాలనీ ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో జగన్ ప్రభుత్వానికి చిన్నపాటి షాక్ తగిలింది. అమరావతికి కొంచెం ఊపిరి అందింది..

ఆ జడ్జి ఉండి ఉంటె..!?
నిజానికి రాజధాని వికేంద్రీకరణ కేసు ఇప్పటిది కాదు. గత ఏడాది ఏప్రిల్ నెలలో ప్రభుత్వం ఈ బిల్లుని ఆమోదించిన తర్వాత… గత ఏడాది ఆగష్టులో హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలయింది. అత్యంత కీలకమైన పిటిషన్ కావడంతో అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరీ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం దీన్ని విచారణ చేపట్టింది. ఆగష్టు నుండి డిసెంబర్ వరకు దాదాపు 14 వాయిదాల్లో వాదనలు విన్నారు. “రాజధానిగా అమరావతిలో చేసిన ఖర్చు, ఇచ్చిన భూములు, రైతుల సంఖ్యా, వారి కులాలు, నిధులు, నిర్మించిన భవనాలు, అక్కడి అన్ని రకాల సామజిక, ఆర్ధిక పరిస్థితులపై పూర్తి నివేదిక తెప్పించుకుని ఆ ధర్మాసనం అధ్యయనం చేసింది. కేసు విచారణ దాదాపు 75 శాతం ముగిసిందనగా… గత ఏడాది డిసెంబర్ లో జేకే మహేశ్వరీ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన అరూప్ గోస్వామి.. “ఇది కీలకమైన కేసు.., నేను మొదటి నుండి విచారణ చేపడతాను” అని చెప్పి… కేసు విచారణను ప్రారంభించారు. కానీ రెండు వాయిదాల తర్వాత కరోనా రెండోదశ వచ్చేయడం.., ఆపై ఆగష్టుకి వాయిదా పడడం.. ఇప్పుడు తాజాగా నవంబరుకి వాయిదా పడడంతో జగన్ శిబిరంలో నిరుత్సాహం పెరుగుతుంది. మరోవైపు విశాఖలో రాజధాని అంటూ మంత్రి బొత్స సత్యన్నారాయణ ఈరోజు కూడా మీడియాతో మాట్లాడారు. కొన్ని నెలల నుండి కోర్టు పరిధిలో కేసు ఉన్నప్పటికీ మంత్రి బొత్స సహా ఎంపీ విజయసాయిరెడ్డి పదే పదే విశాఖ నుండి పరిపాలన మొదలు అంటూ చెప్పిందే చెప్తున్నారు. దీని వెనుక ఒక వ్యూహం ఉందనుకున్నా.., విసిగిస్తున్నారు తప్ప ఫలితం కనిపించడం లేదు. కోర్టు ఏ విషయమూ చెప్పడం లేదు.. వాదనల్లో ఒక స్పష్టత లేదు.. కానీ విశాఖ పరిపాలన రాజధాని ఇదిగో, అదిగో అంటూ ప్రభుత్వం పదే పదే చెప్పడం ఏపీ ప్రజల్లో రాజధాని కథలు వైన్ ఓపిక నశిస్తుంది..!