NewsOrbit
బిగ్ స్టోరీ

కశ్మీర్ నిశ్శబ్దం వెనుక..!

ఒకపక్క 73వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో ఈ దేశం మునిగితేలుతుండగా , మరొకపక్క చిరిగిన గుడ్డలు వేసుకున్న ఈ దేశపు బాల బాలికలు “మేరా భారత్ మహాన్” అని రాసి ఉన్న, జాతీయ జండాలు, సావనీర్లు ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర అమ్ముకుంటున్నారు. నిజం చెప్పాలంటే నా దేశం గొప్పది అని అనుకోవటం కష్టంగా ఉన్నది ఈ రోజున. మనని పాలిస్తున్న ప్రభుత్వం పూర్తిగా దుర్మార్గంగా తయారవ్వటం దానికి కారణం.

1947లో జమ్మూ కశ్మీర్ భారతదేశంలో విలీనం అవ్వటానికి ముఖ్య కారణం నాటి జమ్మూ కశ్మీర్ రాజ్యంతో భారతదేశం కుదుర్చుకున్న విలీన ఒప్పందం. అటువంటి విలీన ఒప్పందంలోని ముఖ్య భాగాన్ని క్రితం వారం భారతదేశ ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించింది. దీనికి సన్నాహకంగా ఆగస్ట్ 4 అర్థరాత్రి నుండి కశ్మీర్ మొత్తాన్నీ ఒక భారీ కారాగారంగా మార్చివేసింది. డెబ్బై లక్షల కశ్మీరీలను తమ తమ ఇళ్ళల్లో బంధించి, ఇంటర్నెట్ సదుపాయం, ఫోన్ సదుపాయం పూర్తిగా తొలగించింది.

విలీన ఒప్పందంలో ముఖ్య భాగమైన భారత రాజ్యాంగంలోని 370 అధికరణని రద్దు చేస్తున్నామని ఆగస్ట్ 5 నాడు భారతదేశ హోంశాఖ మంత్రి పార్లమెంట్ లో పేర్కొన్నారు. విపక్ష పార్టీలు తమ తలలు ఆడించాయి. మరుసటి రోజు సాయంత్రానికల్లా జమ్మూ-కశ్మీర్ పునర్విభజన చట్టం, 2019 ప్రవేశపెట్టడమూ ఉభయ సభలలోనూ ఆమోదం పొందటము చక చకా జరిగిపోయాయి.

ఈ చట్టం జమ్మూ కశ్మీర్ కి ఉన్న ప్రత్యేక హోదాని రద్దు చేసింది. తనకంటూ సొంత రాజ్యాంగం, సొంత జెండా ఉండటం కూడా ఈ ప్రత్యేక హోదాలో భాగమే. జమ్మూ కశ్మీర్ కి ఉన్న రాష్ట్ర హోదాని రద్దు చేసి దాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అందులో మొదటి కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ . ఇప్పుడు తనకంటూ శాసనసభ ఉన్నా కూడా- బాగా కుదించిన అధికారాలతో- ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఈ ప్రాంతాన్ని పాలిస్తుంది. రెండవ ప్రాంతం లడఖ్. ఈ ప్రాంతం  కూడా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీలో ఉంటుంది. దీనికి శాసనసభ ఉండదు.

ఈ చట్టాన్ని బల్లలు గుద్ది మరీ పార్లమెంట్ ఆమోదించింది. ఇలా బల్లలు గుద్ది ఆమోదించటమనేది భారతదేశ వలస పాలకుల సాంప్రదాయం. ఈ తంతుకంతటికీ కూడా వలసవాదం వాసనలు ఉన్నాయి. ఆఖరికి కశ్మీర్  అనే ఈ అవిధేయ వలస ప్రాంతం అధికారికంగా రాజ్యంలో భాగం అయ్యింది అనే ఆనందం పాలకుల మొఖాన తాండవించింది. కశ్మీర్ తన మంచి కోసమే రాజ్యంలో భాగం అయ్యింది సుమీ.

భారతదేశ పౌరులు ఇప్పుడిక అక్కడ భూమి కొనుక్కుని తమకి కొత్తగా సంక్రమించిన ఈ సంస్థానంలో స్థిరపడొచ్చు. ఈ కొత్త ప్రాంతంలో వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. ఇప్పటికే భారతదేశ కుబేర పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ కొన్ని “ప్రకటనలు” వాగ్దానం చేశాడు. ఇప్పుడు దీని కారణంగా లడఖ్, కశ్మీర్ ల సున్నితమైన హిమాలయ పర్యావరణం మీద; ఇక్కడ ఉండే భారీ హిమనీనదాల మీద; చాలా ఎత్తులో ప్రవహించే సరస్సులు, ఐదు నదుల మీద ఉండబోయే ప్రభావం గురించి ఎవరికీ పట్టింది లేదు.

జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదాని రద్దు చెయ్యటం అంటే రాజ్యాంగంలోని 35A అధికరణని రద్దు చెయ్యటం. ఈ అధికరణ స్థానిక ప్రజలకి తమ ప్రాంతం మీద హక్కులు దాఖలు పరిచి, తమ ప్రాంతాన్ని తాము పాలించుకునే సదుపాయం కలిపించింది. “వ్యాపారానికి ఈ ప్రదేశం ఇప్పుడు అందుబాటులో ఉంది” అంటే ఇజ్రాయెల్ చేస్తునట్టు ఆక్రమించిన దేశంలో నివాస ప్రాంతాలు ఏర్పాటు చేయడం, టిబెట్ దేశంలో చైనా చేస్తునట్టు ఆక్రమిత దేశంలోకి తమ దేశ జనాభాని తరలించడం లాంటి చర్యలు కూడా భాగం అవ్వొచ్చు.

కశ్మీరీలకి ఇది ఆదికాలిక భయంగా ఉంటూనే ఉంది. ఈ సుందరమైన, అటవీ లోయలో ఇల్లు కావాలనుకుంటున్న భారతీయులు విజయగర్వంతో తమ ప్రాంతాన్ని ఉప్పెనలా ముంచెత్తుతున్నట్లు కశ్మీరీలు అనుక్షణం కనే పీడ కల నిజం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఈ కొత్త చట్టం గురించిన వార్త వ్యాప్తి చెందడటంతో అన్ని రకాలకి చెందిన జాతీయవాదులు ఆనందోత్సాహాలలో మునిగితేలారు. ప్రధాన స్రవంతి మీడియా చాలావరకు తల ఒంచుకుని తమ పూర్తి అంగీకారం తెలియచేసింది. వీధుల్లో నృత్యాలు, ఇంటర్నెట్ లో మహిళల పట్ల అసభ్యత పొంగి పొర్లాయి. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన రాష్ట్రంలో ఘోరంగా ఉన్న స్త్రీ-పురుష నిష్పత్తిలో తానే విధంగా మార్పు తీసుకువచ్చానో చెబుతూ “ మా ధకర్ గారు బిహార్ నుండి అమ్మాయిలను తెచ్చుకుందాము అంటుండేవాడు. ఇప్పుడు కశ్మీర్  మనందరికీ తెరిచిన ద్వారం అంటున్నారు కాబట్టి ఇక నుండి కశ్మీర్ నుండి మనం అమ్మాయిలని తెచ్చుకోవచ్చు” అని జోక్ చేశాడు.

ఇటువంటి అసహ్యకరమైన సంబరాల మధ్య  ముళ్ళ కంచెలతో, సైనిక బలగాల పహారాతో నిండిన కశ్మీర్ వీధుల నిశబ్దం అన్నిటికన్నా బిగ్గరగా వినిపించిన శబ్దం. డెబ్బై లక్షల మంది అవమానితులుగా, కంచెల మధ్య, డ్రోన్ల నిఘా మధ్య, ఎటువంటి సంచార సాధనాల సదుపాయం లేని పరిస్థితుల మధ్య ఈ నిశబ్దంలో జీవిస్తున్నారు. ఈ సమాచార యుగంలో ఒక ప్రాంతం జనాభా మొత్తానికి మిగతా ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా కొన్ని రోజులు బందీలుగా ఉంచిన ఈ ఉదంతం మనం ఎటు వైపుకి ప్రయాణిస్తున్నామో తెలియచేస్తున్నది.

కశ్మీర్ భారతదేశం “విభజన”లో అసంపూర్తిగా మిగిలిపోయిన అంశం అని తరుచుగా చెబుతుంటారు. ఈ “విభజన” అనే పదాన్ని 1947లో బ్రిటిష్ పాలకులు ఇష్టారీతిన ఈ ఉపఖండంలో సరిహద్దులు ఏర్పాటు చేసినప్పుడు “సమస్తాన్ని” విభజించారు అని చెప్పటానికి వాడుతున్నారు. అయితే నిజానికి అక్కడ “సమస్తం” అంటూ ఏమీ లేదు. బ్రిటిష్ ఇండియా ప్రాంతమే కాకుండా వందలాది సార్వభౌమ సంస్థానాలు ఉండినాయి. భారతదేశంలో కానీ పాకిస్థాన్ లో కానీ  విలీనం అయ్యేందుకు తమకు అంగీకారయోగ్యమైన షరతుపై చర్చలు జరిపాయి  అవి విడివిడిగా చర్చలు జరిపాయి. భారతదేశంలో విలీనం అవ్వటానికి సుముఖంగా లేని వాటిని బలవంతాన విలీనం చేశారు.

విభజన, దాని పర్యవసానంగా జరిగిన హింస నేటికి ఉపఖండం జ్ఞాపకాల మీద మానని గాయలుగా  ఉన్నాయి. అయితే అప్పటి హింసకి, భారతదేశం పాకిస్థాన్ దేశాలుగా ఏర్పాటు అయ్యిన దగ్గర నుండి జరిగిన హింసకి విభజన ఎంత కారణమో ఏకీకరణ కూడా అంతే కారణము. భారతదేశంలో జాతి నిర్మాణం పేరు మీద జరిగిన ఏకీకరణ కారణంగా 1947 నుండి భారతదేశ సరిహద్దుల లోపల “తమ సొంత ప్రజల” మీద సైన్యాన్ని ఉపయోగించని రోజు లేదు. ఈ జాబితా చాలా పెద్దది- కశ్మీర్, మిజోరం, నాగాలాండ్, మణిపూర్, హైదరాబాద్,అస్సాం.

ఈ ఏకీకరణ ప్రక్రియ చాల సంక్లిష్టంగానూ, బాధాకరంగానూ ఉంటూ వచ్చింది. దీని ఖర్చు కొన్ని వేల ప్రాణాలు. ఒకప్పటి జమ్మూ కశ్మీర్ సరిహద్దుకి ఆవల ఇవతల నేడు చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ ఏకీకరణ ఫలితమే.

పార్లమెంట్ లో గతవారం జరిగింది అటుఇటుగా విలీన ఒప్పందాన్ని పూడ్చిపెట్టిన వ్యవహారమే. సంక్లిష్ట మూలాలు ఉన్న ఈ పత్రం మీద అపఖ్యాతి మూటకట్టుకున్న డోగ్రా హిందూ మహారాజు హరి సింగ్ సంతకం పెట్టాడు. అస్థిరమైన, ముక్కలు చెక్కలు అయిన ఆయన సామ్రాజ్యం భారత్-పాకిస్థాన్ మధ్య ఏర్పడిన నూతన సరిహద్దుపై పరచుకుని ఉంది.

రాజా హరిసింగ్ మీద 1945లో చెలరేగిన తిరుగుబాట్లని ఆనాటికి వ్యాప్తి చెందుతున్న విభజన మంటలు ఎగదోసాయి. పశ్చిమాన పర్వతప్రాంతాలతో కూడుకున్న పూంచ్ జిల్లాలో మెజారిటీగా ఉన్న ముస్లింలు మహారాజా దళాల మీద, అలాగే హిందూ ప్రజానీకం మీద తిరగబడ్డారు. దక్షిణాన ఉన్న జమ్మూలో మిగతా సంస్థానాల దళాల మద్దతుతో మహారాజు దళాలు ముస్లింల మీద ఊచకోతకి తెగబడ్డాయి. జమ్మూ నగరం వీధుల్లోనూ, దాని పరిసర జిల్లాలలోనూ డెబ్బై వేల నుండి రెండు లక్షల వరకు ముస్లింలను సాయుధ దళాలు చంపాయి అని చరిత్రకారులు, ఆనాటి  వార్తా కధనాలు చెబుతున్నాయి.

జమ్మూలో చోటుచేసుకున్న ఊచకోత గురించి విని ఆగ్రహోదగ్రులైన పాకిస్థానీ “చొరబాటుదారులు” వాయువ్య  సరిహద్దు ప్రాంతం పర్వతాల నుండి బయలుదేరి కశ్మీర్ లోయ మొత్తం మీద  దోపిడీ చేసుకుంటూ, తగలబెట్టుకుంటూ వచ్చారు. దానితో కశ్మీర్ నుండి జమ్మూకి పారిపోయిన హరి సింగ్ తనకి సహాయం చెయ్యమని నాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూని ప్రాధేయపడ్డాడు. భారతదేశ సైన్యం కశ్మీర్ లోయలోకి అడుగుపెట్టడానికి చట్టపరంగా అవకాశం కలిపించిన పత్రమే విలీన ఒప్పందం.

Photo Courtesy: Bettmann Archive/Getty Images

1947లో పాకిస్థాన్ దురాక్రమణదారులను పారద్రోలేందుకు శ్రీనగర్‌లో దిగిన భారత సైన్యం

స్థానిక ప్రజల మద్దతుతో భారతదేశ సైన్యం పాకిస్థాన్ “చొరబాటుదారులని” వెనక్కి నెట్టెయ్యగలిగింది. అయితే అది ఎంతో దూరం కాదు. ఆ లోయకి చివరలో ఉన్న పర్వతాల శ్రేణి వరకు మాత్రమే. దానితో ఈ మాజీ డోగ్రా సామ్రాజ్యం భారత్-పాకిస్థాన్ మధ్య విడిపోయింది.  జమ్మూ కశ్మీర్ ప్రజలు  ఈ విలీన ఒప్పందానికి ఆమోదం తెలపవలసిన అవసరం ఉంది. అందుకోసం రిఫరెండం జరుపుతామని భారతదేశం కశ్మీరీలకి మాట ఇచ్చింది. అయితే ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఈనాటికీ జరగలేదు. దాని ఫలితంగానే ఈ ఉపఖండంలోనే అత్యంత ప్రమాదకరమైన రాజకీయ సమస్య జీవం పోసుకుంది.

ఆ తరువాత 72 సంవత్సరాలలో భారతదేశంలో ఏర్పడిన ప్రభుత్వాలు అన్నీ ఈ విలీన ఒప్పందాన్ని జీవం మొత్తం కోల్పోయే వరకు పూర్తిగా నీరుగార్చాయి. ఇప్పుడు దాన్ని బూడిద కూడా చేశారు.

పరిస్థితులు ఇక్కడ వరకు రావటానికి కారణమైన విషయాలన్నిటినీ చెప్పటం కుదరని పని. అవి చాలా సంక్లిష్టమైనవి. 1950, 60 దశకాలలో దక్షిణ వియత్నాంలో తాను ఏర్పాటు చేసిన కీలుబొమ్మ ప్రభుత్వాలతో అమెరికా ఆడిన ఆటలు ఎంత ప్రమాదకరమైనవో అలాంటివి అని చెబితే సరిపోతుంది.

చాల కాలం ఎన్నికలలో అవకతవకలు జరిగిన తరువాత చారిత్రక క్షణం 1987లో వచ్చింది. ఆ సంవత్సరం జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఎన్నికలలో దిల్లీ పాలకులు మరీ ఘోరంగా  రిగ్గింగ్ కి పాల్పడ్డారు. అప్పటివరకు తమ స్వయం నిర్ణయాధికారం కోసం దాదాపుగా అహింసాయుతంగా జరుగుతున్న పోరాటం 1989 నాటికి పూర్తి స్థాయి స్వాతంత్ర పోరాటంగా రూపుదిద్దుకుంది. కొన్ని లక్షల మంది వీధుల్లోకి వచ్చారు. వారికి దక్కిన జవాబు ఊచకోత.

తొందరలోనే కశ్మీర్ లోయ మిలిటెంట్ల అడ్డాగా తయారయ్యింది. పాకిస్థాన్ శిక్షణ ఇచ్చి, ఆయుధాలు సమకూర్చిన సరిహద్దుకి రెండు వైపులకి చెందిన కశ్మీరీలను, అలాగే విదేశీ మిలిటెంట్లను జనం గుండెల్లో పెట్టుకున్నారు. ఉపఖండంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల ప్రభావం మరొక్కసారి కశ్మీర్ మీద పడింది- కశ్మీర్ సంస్కృతికి పూర్తిగా పరాయిదైన రాడికల్ ఇస్లాం భావజాలం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఒక వైపు, భారతదేశంలో అప్పుడప్పుడే జడలు విప్పుతున్న వికృతమైన హిందూ జాతీయవాదం ఇంకొకవైపు కశ్మీర్ మీద ప్రభావం చూపాయి.

దీనిలో జరిగిన మొదటి నష్టం ఏమిటంటే కశ్మీరీ ముస్లింలకి, పండిట్లు అనేబడే అక్కడ స్థానికంగా ఉండే అతి కొద్ది మంది హిందువులకి మధ్య తర తరాలుగా ఉన్న బంధం దెబ్బతినటం.  లోయలో హింస మొదలయినప్పుడు 400 మంది పండిట్లని మిలిటెంట్లు చంపారు అని కశ్మీరీ పండిట్లు నడుపుతున్న కశ్మీరీ పండిట్ల పోరాట సమితి లెక్క వేసింది. ప్రభుత్వ లెక్క ప్రకారం 1990 చివరి నాటికి 25,000 పండిట్ కుటుంబాలు కశ్మీర్ లోయని వదిలేసి వెళ్ళిపోయాయి.

వాళ్ళు తమ ఇళ్ళని, తమ జన్మభూమిని, తమకున్న వాటిన్నటినీ కోల్పోయారు. సంవత్సరాలు గడిచే కొద్దీ మరిన్ని వేల మంది పండిట్లు కశ్మీర్ లోయని వదిలేసి వెళ్ళిపోయారు. దాదాపుగా పండిట్లు అందరూ కశ్మీర్ లోయని వదిలేసి వెళ్ళిపోయారు. ఈ వివాదం ముదురుతున్న కొద్దీ వేల సంఖ్యలో మరణించిన ముస్లింలతో పాటు కశ్మీర్ పండిట్ల పోరాట సమితి లెక్క ప్రకారం 650 మంది పండిట్లు కూడా ప్రాణాలు కోల్పోయారు.

అప్పటినుండి ఎంతోమంది పండిట్లు జమ్మూ నగరంలో చాలా దుర్భర పరిస్థితులలో శరణార్ద శిబిరాలలో తల దాచుకుంటున్నారు. ముప్పై ఏళ్ళు గడిచాయి. అయినా కానీ ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వాలు పండిట్లు తమ స్వస్థలాలకి తిరిగి వెళ్ళటానికి ఎటువంటి సహాయం అందించలేదు. ప్రభుత్వాలు అన్నీ వారిని అలా అనిశ్చితిలో ఉంచి, వాళ్ళ కోపాన్ని ఎగదోసి, అర్థం చేసుకోదగ్గ వాళ్ళ కడుపుమంటని కశ్మీర్ గురించి తాము ప్రచారం చేస్తున్న ఒక భయంకరమైన జాతీయవాద కథనానికి ప్రాణాంతకమైన ఇంధనంగా వాడుకుంటున్నాయి. ఈ మహా విషాదంలో ఒక చిన్ని భాగాన్ని ఈ విషాదానికి సంబంధించి మిగతా భయంకరమైన విషయాలని దాచిపెట్టడానికి చాలా అనువుగా తన కధనంలో వాడుకుంటున్నారు.

ఈరోజు కశ్మీర్ ప్రపంచం మొత్తం మీద  సైనిక దళాల సాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఒకటి. బహుశా ప్రపంచం మొత్తం మీద సైనిక దళాల సాంద్రత ఎక్కువ ఉన్నప్రాంతం కశ్మీర్ అనుకుంటా.  సైన్యమే ఒప్పుకున్నట్టు కేవలం వేళ్ళలో లెక్కపెట్టదగిన “తీవ్రవాదులని” ఎదుర్కోవటానికి ఐదు లక్షల మంది సైనికులు అక్కడ ఉన్నారు. ఇంతకుముందు ఏమైనా సందేహాలు ఉంటె ఉండి ఉండొచ్చు కానీ ఇప్పుడు స్పష్టంగా తెలిసిన విషయం ఏమిటంటే కశ్మీరీ ప్రజలే వారి నిజమైన శత్రువులు.  గత ముప్పై సంవత్సరాలుగా భారతదేశం కశ్మీర్ లో చేసిన దురాగతాలు క్షమార్హం కానివి.  ఈ సంఘర్షణలో డెబ్బై వేల మంది ప్రజలు, మిలిటెంట్లు, సాయుధ బలగాలు చనిపోయారని అంచనా. కొన్ని వేల మంది “అదృశ్యం” అయిపోయారు. ఇంకా ఎన్నో వేల మంది కశ్మీర్ లోయలో అడుగడుగునా ఉండే టార్చర్ ఛాంబర్ బాధితులు. ఈ టార్చర్ ఛాంబర్లు ఒక చిన్న స్థాయి అబూఘరిబ్ వ్యవస్థ లాగా ఉంటాయి.

గత కొన్ని సంవత్సరాలలో కొన్ని వందల మంది యువకులని పెల్లెట్లు కాల్చడం ద్వారా అంధులుగా మార్చారు. ఈ పెల్లెట్లు పేల్చే షాట్ గన్లు ఇప్పుడు సైనిక దళాల సరికొత్త ఆయుధం. ఈరోజు కశ్మీర్ లోయలో ఉన్న మిలిటెంట్లలో చాలా మంది స్థానిక కశ్మీరీ యువకులే. వాళ్ళు ఇక్కడే శిక్షణ పొందారు, ఇక్కడే ఆయుధాలు సమకూర్చుకున్నారు. తాము ఏమి చేస్తున్నదీ బాగా తెలిసే చేస్తున్నారు. వాళ్ళకి బాగా తెలుసు తుపాకి పట్టుకున్న మరుక్షణం నుండి తమ “షెల్ఫ్ లైఫ్” ఆరు నెలల కన్నా ఎక్కువ ఉండదు అని. “తీవ్రవాదిని” సైనిక దళాలు చంపేసిన ప్రతి సారి కశ్మీరీలు కొన్ని వేల సంఖ్యలో ఆ యువకుడిని పూడ్చిపెట్టడానికి వస్తున్నారు. ఆ కుర్రవాడు వీళ్ళ దృష్టిలో అమరుడుగా కీర్తి పొందుతాడు.

ఆగస్టు 10వ తేదీన శ్రీనరగ్‌లో భద్రతా దళాలు ప్రయోగించిన పెల్లెట్లకు కళ్లల్లో, చేతి పైన గాయాలయిన సమీర్ అహ్మద్. ఇతను స్థానికంగా ఒక దినపత్రిక కార్యాలయంలో పేజి మేకప్ ఆర్టిస్టుగా పని చేస్తాడు Photo Courtesy: New York Times

ముప్పై సంవత్సరాల సైనిక ఆక్రమణ గురించిన వివరాలు టూకీగా ఇవి. ఇన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సైనిక ఆక్రమణ పూర్తి ప్రభావం గురించి చెప్పటం ఇంత చిన్న వ్యాసంలో కుదరని పని.

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మొదటి అయిదేళ్ల కాలంలో ఆయన దుందుడుకు విధానం కశ్మీర్‌ని మరింత హింసాత్మకం చేసింది. ఈ ఫిబ్రవరిలో ఒక కశ్మీరీ ఆత్మాహుతి సభ్యుడు నలభై మంది భారత సైనిక దళ సభ్యులని హతమార్చిన తర్వాత భారతదేశం పాకిస్థాన్ మీద వైమానిక దాడి చేసింది. పాకిస్థాన్ తిప్పికొట్టింది. అణ్వాయుధ శక్తులైన రెండు దేశాలు పరస్పరం వైమానిక దాడులకు దిగడం ఇదే మొదటిసారి. నరేంద్ర మోదీ రెండవ సారి గద్దెనెక్కిన రెండు నెలలకే ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన తురుపు ముక్కను వాడింది. ఇది మందుగుండు సామాగ్రిపై అగ్గిపుల్ల విసరడమే.

ఇదే ఘోరం అనుకుంటే ఇది చేసిన విధానం మరింత జుగుప్సాకరం. జూలై చివరి వారంలో వివిధ కారణాల పేరు మీద 45,000 మంది సైనిక బలగాలని కశ్మీర్ లోకి పంపించారు. చెప్పిన కారణాలు అన్నిటిలోకీ బాగా సమ్మతి  పొందింది ఏమిటంటే అమరనాథ్ యాత్ర మీద పాకిస్థాన్  “దాడి” చేసే అవకాశం ఉంది అన్న కారణం.

యాత్ర దారిలో పాకిస్థాన్‌లో తయారు చేసినట్టు మార్కింగ్ ఉన్న ల్యాండ్ మైన్ ఒకటి బయటపడింది అని ఆగస్ట్ 1 నాడు భారతదేశంలో కొన్ని టీ.వి ఛానళ్ళు ప్రసారం చేశాయి. భక్తులు అందరూ (అలాగే ఈ యాత్ర దారికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న పర్యాటకులు కూడా) కశ్మీర్‌ను తక్షణం విడిచి వెళ్ళాలని ఆగస్ట్ 2 నాడు ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. ఇది భక్తులు, పర్యాటకులు భయపడి తండోపతండాలుగా కశ్మీర్ ని విడిచి వెళ్ళటానికి కారణం అయ్యింది. అయితే కశ్మీర్ లో పనిచేస్తున్న సుమారు రెండు లక్షల మంది భారత దేశ వలస కూలీలు మాత్రం ప్రభుత్వం చేపట్టిన తరలింపు ప్రయత్నానికి ముఖ్యులు కాదు.  పట్టింపుకి నోచుకోవటానికి కూడా అర్హత లేని పేదవాళ్ళు కాబోలు. ఆగస్ట్ 3 శనివారం నాటికి భక్తులు, పర్యాటకులు కశ్మీర్ నుండి వెళ్ళిపోయారు. ఇక కశ్మీర్ మొత్తం సైనిక దళాల చేతుల్లోకి వెళ్ళిపోయింది.

ఆదివారం అర్థరాత్రి సమయానికి కశ్మీరీలని తమ తమ ఇళ్ళల్లో బంధించి, సమాచార వ్యవస్థలు అన్నిటినీ ఆపేశారు. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారని మరుసటి రోజు మనకు తెలిసింది. వీళ్ళందరూ కూడా  ప్రధాన స్రవంతి భారతదేశ అనుకూల రాజకీయ నాయకులు. ఇన్ని సంవత్సరాలుగా భారతదేశం పెత్తనాన్ని అక్కడ సాఫీగా అమలు చేసింది వీళ్ళే.

జమ్మూ కశ్మీర్ పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాలు తీసేసుకున్నారు అని వార్తా పత్రికలు తెలిపాయి. అందరికన్నా ఎక్కువగా ఈ స్థానిక పోలీసులే ముందు వరసలో నుంచుని, ఆక్రమణకి కావలసిన క్షేత్ర స్థాయి పనులు చేసి, దానికి కావలసిన నిఘా వ్యవస్థని ఏర్పాటు చేసి, తమ దొరల కోసం క్రూరాతి క్రూరమైన పనులు చేసి తమ సొంత ప్రజలలో తమ మీద ఏహ్య భావనకి తామే కారణం అయ్యారు. ఇదంతా కూడా కేవలం కశ్మీర్ లో భారతదేశ జెండా రెపరెపలాడటానికి. ఇప్పుడేమో పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు కోపోద్రిక్తులైన కశ్మీరీలకు వీరినే ఆహారంగా వేస్తున్నారు.

ఈ రకంగా కశ్మీర్‌లో తమ వారినే మోసం చెయ్యటం, బహిరంగంగా అవమానించటం చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఒకరకమైన అజ్ఞానం నుండి ఈ పని చేయగలిగారు. భారతీయ రాజ్యతంత్రం వంచనాశిల్పంతో కొన్ని దశాబ్దాలు కష్టపడి  అక్కడ తమకు అనుకూలమైన పద్ధతిలో నిర్మించిన భారీ యంత్రాగాన్నినాశనం చేసింది కూడా ఈ అజ్ఞానమే. ఇప్పుడు ఇక మిగిలింది వీధిలో నిరసనకారులు వర్సెస్ సాయుధ బలగాలు. ఇది యువ కశ్మీరీలకు ఎలా పరిణమిస్తుందన్నది పక్కన పెడితే, ఇలాంటి పరిస్థితిలో సైనికులను ఇరికించడం కూడా అన్యాయమే.

స్వయం నిర్ణయాధికారం కోరుకుంటున్న లేదా పాకిస్థాన్‌లో విలీనం కోరుకుంటున్న మిలిటెంట్ సెక్షన్ ఒకటి కశ్మీర్ లో ఉంది.  వారికి భారత రాజ్యాంగం మీద కానీ చట్టాల మీద కానీ పెద్ద నమ్మకం, గౌరవం లేదు. ఇన్నాళ్ళు భారతదేశంతో లాలూచీ పడుతున్న వాళ్ళు పూర్తిగా తుడుచుకుపెట్టుకు పోయారు అని, దాగుడుమూతలు ఇక సమాప్తం చెందాయని వాళ్ళు తప్పక ఆనందిస్తారు. అయితే అలా ఆనందించటం తొందరపాటే అవుతింది. ఖచ్చితంగా దాగుడుమూతలు మళ్ళీ మొదలవుతాయి. అలాగే కొత్త రాజకీయ పార్టీలు, కొత్త రాజకీయ క్రీడలు కూడా.

కశ్మీర్‌ని పూర్తిగా బంధించిన నాలుగు రోజుల తరువాత సంబరాలు జరుపుకుంటున్న దేశ ప్రజలని, అలాగే బంధింపబడిన కశ్మీరీలని ఉద్దేశించి ప్రసంగించే పేరు మీద ఆగస్ట్ 8న ప్రధాని నరేంద్ర మోదీ టివీ తెరల మీద ప్రత్యక్షమయ్యారు. మారిన మనిషిలాగా మాట్లాడారు. ఎప్పుడూ ఉండే దూకుడు, ఉద్రిక్తత, ఆరోపణా శైలీ లేవు. పిన్న వయస్కురాలైన తల్లి మాట్లాడినట్టు చాలా సున్నితంగా మాట్లాడాడు. ఈనాటి వరకు ఇదే తన అత్యంత భయం గొలిపే అవతారం.

ఇప్పుడు ఇక జమ్మూ కశ్మీర్ అవినీతి నాయకుల కబంధ హస్తాల నుండి విముక్తి పొంది ఢిల్లీ ప్రత్యక్ష పాలన కింద ఉంటుంది కాబట్టి దాని వలన జమ్మూ కశ్మీర్ కి లభించే లాభాల గురించి చెబుతున్నప్పుడు ఆయనన కంఠం వణికింది, కళ్ళు చెమ్మగిల్లాయి. గత కాలపు ఫ్యూడల్ రైతుకూలీలు మళ్లీ పుడితే వారికి పాఠాలు చెబుతునట్టు భారతదేశ ఆధునికత గొప్పతనం గురించి ఆయన ఉపన్యాసంలో  దంచారు. హిందీ సినిమా షూటింగ్‌లు మళ్ళీ కశ్మీర్‌లో జరుపుకోవచ్చని చెప్పారు.

కశ్మీర్ చర్య తర్వాత మోదీ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ఆహ్మదాబాద్‌లో వింటున్న జనం

తాను ఇటువంటి ఉద్రేకపూరిత ప్రసంగం ఇస్తున్నప్పుడు కశ్మీరీలని సమాచార దిగ్బంధంలో ఉంచవలసిన అవసరం ఏముందో ప్రధాని చెప్పలేదు. తమకు చాలా లాభం చేకూరుస్తుందని తెగ చెబుతున్న ఈ నిర్ణయం ముందు తమని ఎందుకు సంప్రదించలేదో కశ్మీరీలకి చెప్పలేదు. సైనిక ఆక్రమణ కింద ఉండేవారు భారతదేశ ప్రజాస్వామ్య ఫలాలని ఏ విధంగా అనుభవించాలో చెప్పలేదు. ఇంకొన్ని రోజుల్లో ఈద్ పండగ ఉంది. వాళ్లకి ఈద్ శుభాకాంక్షలు చెప్పటం మాత్రం గుర్తుంచుకున్నారు. అయితే పండగ సందర్భంగా దిగ్బంధం ఎత్తివేస్తానని మాట ఇవ్వలేదు. దిగ్బంధం ఎత్తివేయలేదు కూడా.

తరువాతి రోజు ఉదయం భారత దేశ దినపత్రికలు, కొంతమంది ఉదారవాద వ్యాసకర్తలు- అందులో కొంతమంది నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించే వాళ్ళే- క్రితం రోజు మోదీ ఇచ్చిన ప్రసంగం గురించి ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. నిజమైన వలస పాలన ప్రజలలాగా ఇండియాలో చాలా మంది తమ హక్కులకి భంగం కలిగే విషయంలో జాగరూకతగా ఉంటూ, కశ్మీరీల విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ ప్రమాణాలు ఏవీ పాటించరు.

ఆగస్ట్ 15 గురువారం నాడు తన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ ఢిల్లీ ఎర్ర కోట నుండి మాట్లాడుతూ ఈ కశ్మీర్ చర్యతో తమ ప్రభుత్వం భారతదేశం స్వప్నం అయిన “ఒక దేశం, ఒకే రాజ్యాంగం” లక్ష్యాన్ని చివరికి సాధించిందని చెప్పుకొచ్చారు. అయితే ఆ ముందు రోజు సాయంత్రమే సమస్యాత్మకమైన  కొన్ని ఈశాన్య రాష్ట్రాలలోని తిరుగుబాటు సంస్థలు – ఈ రాష్ట్రాలలో కూడా మాజీ జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి లాగానే ప్రత్యేక హోదాలు ఉన్నాయి  – తాము ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఎర్ర కోట దగ్గర మోదీ అభిమానులు చప్పట్లు కొడుతుండగా, దాదాపుగా డెబ్బై లక్షల మంది కశ్మీరీలు దిగ్బంధంలో ఉన్నారు.  సమాచార దిగ్బంధం మరింత కాలం అమలులో ఉండవచ్చు.

ఈ దిగ్బంధం ముగిసాక- ముగియక తప్పదు- కశ్మీర్‌లో చెలరేగే హింస భారతదేశంలోకి వ్యాప్తి చెందటం ఖాయం. దేశంలో ముస్లింలను ఇప్పటికే దుర్మార్గులుగా చిత్రిస్తూ, ఒక మూలకి తోసివేస్తూ, ఆర్థికంగా కిందకి నెడుతున్నారు. వీరు క్రమం తప్పకుండా మూక హత్యలకి గురవుతున్నారు కూడా. అప్పుడు కశ్మీర్ హింసని ఈ ముస్లింల మీద ద్వేషాన్ని మరింత పెంచటానికి వాడుకుంటారు. రాజ్యం ఈ అవకాశాన్ని వాడుకుని, తమ నిరసనలు బహిరంగంగా, ధైర్యంగా వెలిబుచ్చుతున్న యాక్టివిస్టులు, న్యాయవాదులు, కళాకారులు, విద్యార్ధులు, మేధావులు, పాత్రికేయులు వంటివారిపై కూడా దౌర్జన్యానికి పాల్పడుతుంది.

Photo Courtesy: New York Times

శ్రీనగర్‌లోని కశ్మీర్ ప్రెస్‌క్లబ్‌తో జర్నలిస్టులు కూర్చుని మాట్లాడుకుంటున్న ఇటీవలి చిత్రం 

ప్రమాదం అనేక దిక్కుల నుండి వస్తున్నది. నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గంలోని చాలామంది మంత్రులతో సహా ఆరు లక్షల మంది సభ్యులు గల సంస్థ అతివాద, హిందూ జాతీయవాద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అది నేడు భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సంస్థ. ముస్సోలినీ బ్లాక్ షర్ట్స్ ప్రేరణగా ఈ సంస్థ ఒక ‘స్వచ్ఛంద’ మిలీషియాను తయారుచేసింది. రోజు రోజుకి దేశంలోని అన్ని సంస్థల మీద ఈ ఆర్.ఎస్.ఎస్ పట్టు పెంచుకుంటున్నది. నిజం చెప్పాలంటే నేడు ఈ సంస్థే రాజ్యం.

ఇలాంటి రాజ్యం కన్నుసన్నులలో ఎన్నో చిన్న హిందూ సంస్థలు- ఇవి హిందూ రాజ్యం స్టార్మ్ ట్రూపర్లు- దేశవ్యాప్తంగా మొలకెత్తాయి. అవి తమ మారణకార్యాన్ని చాలా నిష్టగా చేసుకుంటూ పోతున్నాయి.

వీళ్ళ ప్రధానమైన గురి మేధావులు, విద్యావేత్తలు. మొన్న మే నెలలో బిజెపి సార్వత్రిక ఎన్నికలలో గెలిచిన మరుసటి రోజు ఆర్.ఎస్.ఎస్. మాజీ అధికార ప్రాతినిధి, నేటి బిజెపి ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ఈ విధంగా అన్నారు. “ ఈ దేశపు మేధో, విధాన వ్యవస్థలపై విపరీతమైన పట్టు కలిగిన నకిలీ లౌకికవాద/ఉదారవాద గుంపుల “అవశేషాలని”  ఈ దేశపు అకాడెమిక్, సాంస్కృతిక, మేధో పటం నుండి తొలగించాల్సిన అవసరం ఉంది.”

ఆ “తొలగింపు” ప్రక్రియకి నాందిగా ఆగస్ట్ 1 నాడు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని సవరించారు. ఇప్పుడు “టెరరిస్టు” నిర్వచనంలో సంస్థలే కాకుండా వ్యక్తులని కూడా చేర్చొచ్చు. ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చెయ్యటం,  అభియోగ పత్రం దాఖలు చెయ్యటం, విచారణ, శిక్ష లాంటి ప్రక్రియతో అవసరం లేకుండా ఏ వ్యక్తినైనా ప్రభుత్వం టెరరిస్టుగా ప్రకటించవచ్చు.  “ సర్, తీవ్రవాదానికి కారణం తుపాకులు కాదు. ఉగ్రవాదానికి మూల కారణం దాని వ్యాప్తి కోసం చేసే ప్రచారం. అటువంటి వారందరినీ ఉగ్రవాదులుగా ప్రకటిస్తే ఏ పార్లమెంట్ సభ్యుడికీ అభ్యంతరం ఉండకూడదని నేను అనుకుంటున్నాను” అని పార్లమెంట్లో  హోం మంత్రి అమిత్ షా చెప్పినప్పుడే ఎటువంటి వారిని ఉగ్రవాదులుగా ప్రకటిస్తారు అనేది స్పష్టం అయిపోయింది.

మాలో కొంతమందికి ఆయన కళ్ళు మమ్మల్నే చూస్తున్నట్టు అనిపించింది. తన స్వరాష్ట్రం గుజరాత్‌లో వరస హత్య కేసుల్లో నిందితుడుగా అమిత్ షా జైలు జీవితం గడిపారన్న విషయం తెలవడం భయం మరింత పెంచింది. ఆయన్ని విచారిస్తున్న ట్రయిల్ కోర్టు న్యాయమూర్తి బ్రిజ్ గోపాల్ హరికిషన్ లోయా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. తరువాత వచ్చిన న్యాయమూర్తి అమిత్ షా ని చాలా తొందరగా నిర్దోషిగా విడుదల చేశాడు. వీటన్నిటినీ చూసి ధైర్యం పొందిన కొన్ని వందల మంది అతి మితవాద టి.వి యాంకర్లు ఇప్పుడు బహిరంగంగానే అసమ్మతివాదులను నిందిస్తున్నారు, వాళ్ళ మీద లేని పోని అభాండాలు వేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే “టి.వి.ద్వారా హత్యకి గురయ్యారు” అనేది రాబోయే రోజుల్లో ఒక కొత్త రాజకీయ దృగ్విషయంగా మారే అవకాశాలు ఉన్నాయి.

ప్రపంచం అంతా చూస్తుండగానే భారతదేశ ఫాసిజానికి అవసరమైన నిర్మాణం అంతటా జరిగిపోతున్నది.

జూలై 28 నాడు కశ్మీర్‌లో కొంత మంది స్నేహితులని కలవటానికి నేను ఫ్లైట్ లో టికెట్ బుక్ చేసుకున్నాను. అక్కడి అలజడి గురించి, సైన్యాన్ని దించటం గురించి అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. వెళ్లాలా వద్దా అని నేను సందిగ్ధంలో ఉన్నాను. నేను నా స్నేహితుడు ఒకరు దీని గురించి ఇంట్లో చర్చించుకుంటున్నాము. అతను ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడు. ప్రజాసేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసాడు. ముస్లిం కూడా. జనాలను, ముఖ్యంగా ముస్లింలని, మూకలు చుట్టుముట్టి “జై శ్రీరాం“ అంటూ నినదించాలని ఒత్తిడి చేస్తున్న కొత్త దృగ్విషయం గురించి మాట్లాడుకుంటున్నాము.

కశ్మీర్‌ను సైన్యం ఆక్రమిస్తే, భారతదేశాన్ని ఈ మూకలు ఆక్రమించాయి.

తాను కూడా ఈ విషయం గురించే ఆలోచిస్తున్నానని నా మిత్రుడు చెప్పాడు. ఎందుకంటే తన కుటుంబ సభ్యులని కలవటానికి ఢిల్లీ బయట జాతీయ రహదారి మీద కొన్ని గంటలు తను ప్రయాణించాలి.

“నన్ను చాల సులువుగా ఎవరైనా ఆపేయొచ్చు.” అని అన్నాడు.

“మరి అలాంటప్పుడు ఈ భయం గురించి, ఈ విషయాల గురించి నువ్వు మాట్లాడాలి.’ అని నేను అన్నాను. “నువ్వు బతకాలి.”

“నేను బతకను” అని తను అన్నాడు. “ఎందుకంటే మాట్లాడినా, మాట్లాడకపోయినా వాళ్ళు నన్ను చంపేస్తారు. తబ్రేజ్ అన్సారీని చంపేసినట్టు.”

కశ్మీర్ మాట్లాడటం కోసం ఎదురుచూస్తూ  నేడు భారతదేశంలో మనం చర్చించుకుంటున్న విషయాలు ఇలాంటివే. కశ్మీర్ తప్పక మాట్లాడుతుంది.

అరుంధతీ రాయ్

వ్యాసకర్త రచయిత్రి. ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’, ‘ద మినిస్ట్రీ ఆఫ్ అట్‌మోస్ట్ హాపీనెస్’ వంటి పుస్తకాలు రాశారు. ఆమె తాజా పుస్తకం ‘మై సెడిషస్ హార్ట్’ అనే వ్యాస సంకలనం

‘న్యూయార్క్ టైమ్స్’ సౌజన్యంతో

author avatar
Siva Prasad

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment