NewsOrbit
బిగ్ స్టోరీ

ఉంటే మాతో ఉండు, లేదా..!

హిందీ నటి దీపికా పదుకోనే అకస్మాత్తుగా అంటరానిదయిపోయింది. దేశానికి శర్తువు అయి కూర్చుంది. ఆమె నటించిన ఒక ప్రమోషనల్ వీడియో విడుదలను కేంద్రప్రభుత్వం నిలిపివేసింది. యాసిడ్ దాడి బాధితులలో, దివ్యాంగులలో స్ఫూర్తి కలిగించే లక్ష్యంతో ఆ వీడియో రూపొందించారు. వీడియో విడుదల నిలిపివేతకు కారణం ఊహించుకోవడం కష్టం కాదు. ఆమె జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు)కి వెళ్లింది. అక్కడ గత ఆదివారం దాడిలో గాయపడిన విద్యార్ధులకు సంఘీభావం ప్రకటించింది.

ఎంత తప్పు చేసింది! ఆమె ఏలినవారి కన్నెర్రకు గురికావడానికి ఇంకేం కావాలి? ఓ యాసిడ్ దాడి బాధితురాలి జీవితగాధ ఆధారంగా తీసిన ఛపాక్ అనే హిందీ సినిమాలో దీపిక బాధితురాలి పాత్ర పోషించింది. ఆమెతో ఆ వీడియో తీయడానికి కారణం కూడా అదే. దీపిక జెఎన్‌యు వెళ్లిన దరిమిలా ఆమె సినిమాను బహిష్కరించాలన్న పిలుపు కూడా ట్విట్టర్‌లో షికారు చేసింది.

తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం దీపికపై అక్కసు వెళ్లగక్కారు. జెఎన్‌యు విద్యార్ధులకు మద్దతు తెలియజేయడం అంతటి అకృత్యానికి పాల్పడిన వ్యక్తిని అంత తేలికగా వదిలితే ఎలా! “సిఆర్‌పిఎఫ్ జవాను మరణించిన ప్రతిసారీ పండగ చేసుకునే వారి పక్కన నువ్వు నుంచుంటావని నాకు తెలుసు. సైద్ధాంతికంగా తమతో విభేదించే యువతులను మర్మస్థానంలో కొట్టే వారితో కలిసి నడిచే నీ హక్కును నేను కాదనను” కేంద్రమంత్రి స్థానంలో ఉన్న ఒక మహిళ ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న సాటి మహిళను  విమర్శించేందుకు వాడిన పదజాలం ఎలా ఉందో చూశారుగా?

దీపిక జెఎన్‌యు వెళ్లిరాగానే బిజెపి అధికార ప్రతినిధి సంవిత్ పాత్రా విమర్శకు తెర తీశారు. యధావిధిగా ఆమెపై పాకిస్థాన్ మద్దతుదారు ముద్ర వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఆదర్శం మరి! మరో బిజెపి నాయకుడు షానవాజ్ హుస్సేన్, వామపక్ష భావజాల సంస్థలకు సంఘీభావం తెలపడం దీపిక ఏకపక్ష ఆలోచనలను ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. రామ్ కదమ్ అనే మరో బిజెపి పెద్దమనిషి సినిమా నటి సినిమా నటిగా ఉండాలి కానీ ఒక రాజకీయ పార్టీకి ప్రతినిధిలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు.

దీపిక జెఎన్‌యు వెళ్లింది  అన్యాయంగా దెబ్బలు తిన్న విద్యార్ధులనూ, టీచర్లనూ కలిసేందుకు. దానిని తప్పు పడుతున్న బిజెపి నాయకులు ఏమి సందేశం ఇస్తున్నారు? జెఎన్‌యులో జరిగింది  ఒక నేరం. ముసుగులు ధరించిన దుండగులు క్యాంపస్‌లో ప్రవేశించి విద్యార్ధి సంఘం అధ్యక్షురాలు సహా చాలామందిని చితకబాదారు. నేరం ఎవరు చేశారన్న దానికి కొన్ని ఆధారాలు  ఉన్నప్పటికీ పోలీసులు ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు. నేరానికి పాల్పడిన వారికి అధికారపక్షం, పోలీసుల అండదండలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసు. అయినంత మాత్రాన ప్రజా జీవితంలో ఉన్నవారు నేరస్థులను బహిరంగంగా సమర్ధిస్తారా? మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకోరు కదా!

దీపికను దుయ్యబట్టడం, బెదిరించడం ద్వారా బిజెపి నాయకులు చేస్తున్న పని సరిగ్గా అదే. ఎముకలు మెడలో వేసుకోవడం. ఇక దాగుడుమూతలు అనవసరం అని తీర్మానించినట్లున్నారు: “అవసరమైతే పట్టుకుని చితకబాదుతాం. ఎవరు అడ్డం వస్తారో చూస్తాం. ఉంటే మాతో ఉండండి. లేదంటే నోరు మూసుకోండి”. ఎలాంటి అనుమానానికీ ఆస్కారం లేని విధంగా ఈ సందేశం బయటకు పంపడం దీపికపై బిజెపి నాయకుల దాడి లక్ష్యం.

ఇక్కడ లక్ష్యంగా దీపిక కనబడుతున్నప్పటికీ దాని వెనుక మరో లక్ష్యం కూడా ఉంది. మూకల ముష్కర దాడిలో తల పగిలిన జెఎన్‌యు విద్యార్ధి సంఘం నేత ఐషే ఘోష్, ఆమె సహచర క్షతగాత్రులపై పిచ్చికుక్క ముద్ర వేయడం ఆ లక్ష్యం. వారంతా పాకిస్థాన్ పక్షం వారు. సాటి అమ్మాయిలను మర్మస్థానాల్లో తన్నగల కర్కశులు. వీరంతా తుకడే తుకడే గ్యాంగ్. అంటే భాతరదేశాన్ని ముక్కలు ముక్కలు చేద్దామని చూస్తున్న వారు. కేంద్రప్రభుత్వంలో భాగమైన మంత్రి ఒకరు, ఒక నేరంలో బాధితుల గురించి ఇలా మాట్లాడడం విచిత్రంగా ఉందా. ఇంకా చిత్ర విచిత్రాలు చూస్తాం. తొందరెందుకు!

జెఎన్‌యు హింసాకాండను నేరుగా ఖండించిన బిజెపి నేత ఒక్కరు కూడా లేకపోవడం యాదృచ్ఛికం కాదు. ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ జగదీష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన బిజెపి సీనియర్  నేత మురళీ మనోహర్ జోషీ కూడా దుండగుల దాడిని ఖండించలేదు. ఆ పార్టీ నుంచి ఎవరైనా గానీ ఎక్కువలో ఎక్కువ వ్యాఖ్యానించింది యూనివర్సిటీలు రాజకీయాలకు నెలవు కారాదని. మరి తమ పార్టీకి అనుబంధ విద్యార్ధి సంఘంగా ఉన్న ఎబివిపిని ఎందుకు రద్దు చేయరో తెలియదు. ఆ ఎబివిపి నుంచే చాలామంది బిజెపిలో నాయకులుగా ఎదిగిన విషయాన్ని వారు ఇలాంటప్పుడు ప్రస్తావించరు.

వామపక్ష భావజాలంలోనో, కాంగ్రెస్ సిద్ధాంతాలలోనో సమాజానికి హితం కానిది ఏముందో నరేంద్ర మోదీ మొదలుకుని కింది స్థాయి వరకూ బిజెపి నాయకులు ఎవరూ వివరించరు. “వామపక్షాలను బలపరుస్తున్నావా? కాంగ్రెస్‌తో అంట కాగుతున్నావా? అయితే నువ్వు పాకిస్థాన్ పక్షమే. నువ్వు అసలు మాకు ఎదురు నిలవడానికే లేదు. మేము చేసే పనులను నువ్వు సమర్ధించావా సరే, లేదా నోరు మూసుకుని కూర్చో. కాదని నోరు తెరిచావో జెఎన్‌యు విద్యార్ధులకు పట్టిన గతి పడుతుంది. అలాంటి వారికి ఎవరైనా మద్దతుగా నిలిస్తే దీపికా పదుకోనేను వేటాడుతున్నాం చూడు అలా వేటాడుతాం”.

1939లో ప్రపంచాన్ని ఓ భయంకరమైన యుద్ధంలోకి నడిపించిన హిట్లర్ జమానాలోని  నాజీ జర్మనీలో సరిగ్గా ఇలాంటి వాతావరణమే ఉండేది: “మాతో లేవా? ఇంకేం నువ్వు మాకు శత్రువే. నీ బతుకు మా దయ మీద ఆధారపడి ఉంది”. హిట్లర్‌కు దేశంలోనూ, దేశం వెలుపలా శత్రువులు ఉన్నారు. అలాగే బాహ్య శత్రువుగా చూపేందుకు నరేంద్ర మోదీ సర్కారుకు  పాకిస్థాన్ బూచి ఉండనే ఉంది. ఇక ఈ ప్రభుతను నడిపించే సంఘ్‌ పరివార్‌కు దేశంలో ఎక్కడ చూసినా శత్రువులు ఉన్నారు. జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్‌సి), పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ద్వారా వారిని వేరు చేయడమే అసలు లక్ష్యం. మరి అంతటి మహోన్నత లక్ష్య సాధనకు అడ్డం వస్తున్న జెఎన్‌యు విద్యార్ధులను కొట్టకుండా ముద్దు పెట్టుకోవాలా? వారికి సంఘీభావం ప్రకటించే సెలబ్రిటీలను వేటాడకుండా ఉపేక్షించాలా?

 

ఆలపాటి సురేశ్ కుమార్  

author avatar
Siva Prasad

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment