దేశం మొత్తం కాషాయమయం చేసెయ్యాలి అనేది బీజేపీ లక్ష్యం. ప్రాంతీయ పార్టీలను తొక్కేసి, ఎక్కేసి, లెక్కలోంచి తీసేసి… ఎలాగోలా రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవాలి అనేది బీజేపీ అతి పెద్ద వ్యూహం. అందుకు బీజేపీకి అత్యంత కీలకమైన ఏడాది 2021 ..! ఈ ఏడాది మే నెలలోగా తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ , కేరళ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ప్రస్తుతం తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ (ఎన్డీఏ) కూటమి అధికారంలో ఉండగా.., కేరళలో లెఫ్ట్, బెంగాల్ లో తృణమూల్, పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్నాయి. రానున్న శాసనసభ ఎన్నికల్లో బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను నూటికి నూరు శాతం దక్కించుకోవాలి అనేది బీజేపీ గట్టి వ్యూహం. అమిత్ షా మదిలో ఉన్న ఏకైక లక్ష్యం ఇదే. అందుకే ఆయన ప్రత్యేక దళాన్ని నియమించుకుని నిత్యం ఈ ఎన్నికలపై సమీక్ష చేస్తున్నారు. అయితే ఇటీవల బయటకు వచ్చిన ఓ సర్వే బీజేపీకి షాకింగ్ నిజాలను బయటపెట్టింది.
ఏబీసీ న్యూస్ – సి ఓటర్ ఏం చెప్పిందో చూద్దాం..!
ఏబీసీ న్యూస్ – సి ఓటర్ సంస్థ ఎన్నికల సర్వేలు చేయడం కొత్త కాదు. ఈ సర్వే సంస్థకి దేశంలో మంచి పేరే ఉంది. ఈ సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాలు బీజేపీకి మింగుడు పడడం లేదు. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో అస్సాం, పుదుచ్చేరి మాత్రమే బీజేపీ కూటమి దక్కించుకుంటుంది అని… తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలని బీజేపీ కోల్పోవాల్సిందే అంటూ తేల్చి చెప్పింది. కేరళలో ప్రస్తుతం అధికారంలో ఉన్న లెఫ్ట్ కూటమి, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే – కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తాయని సర్వే సంస్థ లెక్కలు చెప్తున్నాయి.
* బెంగాల్ లో 294 స్థానాలకు గాను వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూటమికి 120 నుండి 128 స్థానాలు.., తృణమూల్ కాంగ్రెస్ కి 155 నుండి 165 స్థానాలు వస్తాయనేది ఆ సర్వే సారాంశం.
* తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా … కాంగ్రెస్ – డీఎంకే కూటమి 160 స్థానాలు గెలుచుకుంటుంది అనీ.., బీజేపీ – అన్నా డీఎంకే కూటమికి 98 స్థానాలు రావచ్చని ఈ సర్వే లెక్కలు చెప్తున్నాయి.

తమిళనాడులో చిన్నమ్మ దెబ్బ బీజేపీకి పడుతుంది..!!
తమిళనాడులో ఎన్నికలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. సంప్రదాయ బద్ధంగా ఒక పార్టీకి ఒకసారి అక్కడి ఓటర్లు అధికారం ఇస్తుంటారు. కేవలం 2011 , 2016 లో వరుసగా రెండు సార్లు జయలలిత పార్టీ గెలుచుకుంది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే పార్టీ కుక్కలు చింపిన విస్తరిగా మారింది. ఆధిపత్యం కోసం, పెత్తనం కోసం గ్రూపులు పెరిగిపోయాయి. నాయకత్వ లెమిహో కొట్టుమిట్టాడుతోంది. జయలలిత స్నేహిత .. తమిళ చిన్నమ్మ శశికళ ఇప్పుడు డీఎంకే నుండి బయటకు వచ్చేసి ప్రత్యేక పార్టీ పెట్టుకున్నారు. ఆమె పార్టీతో పాటూ.., కమల్ హాసన్ పార్టీ కూడా ఈ సారి ఎన్నికల్లో కొంత ప్రభావం చూపిస్తాయని.., అనేక నియోజకవర్గాల్లో బీజేపీ కూటమి ఓట్లు ఈ పార్టీలు కొల్లగొడతాయనేది ఒక అంచనా. శశికళ పార్టీకి తమిళ నాట దాదాపు 75 నియోజకవర్గాల్లో సగటున 10 వేల ఓట్లు పడే అవకాశం ఉంది. అవన్నీ బీజేపీ కూటమికి మైనస్ అవ్వనున్నాయి. తద్వారా కాంగ్రెస్ – డీఎంకే కూటమికి గెలుపు సులువవుతుంది. అలా తమిళనాట బీజేపీకి చిన్నమ్మ దెబ్బ గట్టిగానే తగులుతుంది.

బెంగాల్ లో తృణమూల్ పాగా..!?
ఇక పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గెలుస్తారనేది సర్వే చెప్తుంది. మమతా బెనర్జీ సెంటిమెంట్ బెంగాల్ లో బాగా పని చేస్తుందని.., బీజేపీ పెద్దలు మమతని టార్గెట్ చేయడంతో అక్కడి ఓటర్లు ఆమెకు అండగా ఉంటారు అని సర్వేలో తేలింది. అయితే ఇక్కడి వ్యవహారం అంత తేలికగా తెలిసేది కాదు. ప్రస్తుతం బీజేపీ అతి పెద్ద టార్గెట్ బెంగాల్ లో గెలవడం. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కి చుక్కలు చూపించిన బీజేపీ.. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఆశలు పెట్టుకుంది. ప్రత్యర్థులపై కేసులు, ఐటీ దాడులు, ఆర్ధిక పరమైన చిక్కులు అన్ని అస్త్రాలతో రంగంలోకి దిగుతుంది. ఆపరేషన్ ఆకర్ష్ చేస్తుంది. అందుకే ఈ రాష్ట్రంలో ఫలితాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టం. ఎవరు గెలిచినా 20 , 25 స్థానాలు తేడా తప్ప… పెద్దగా వ్యత్యాసం ఉండకపోవచ్చు..!!