కూలుతున్న కోటలు..! చంద్రబాబుకి పెద్ద బెంగ అక్కడే..!!

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

దర్నాలు లేవు..! ఆందోళనలు లేవు..! రాస్తారోకోలు లేవు..! పసుపు జెండా బుజాన ఎత్తుకొని రోడ్డు మీద తిరిగే కార్యకర్త లేడు..! పసుపు జెండా రెపరెపలు లేవు..! గడచిన ఏడాదిన్నరగా రాష్ట్రంలో పసుపు జెండా కనుమరుగు అవుతోంది.  జండా పట్టి పరుగెడదామని కార్యకర్తలు సిద్ధంగా ఉన్నప్పటికీ కార్యకర్తను నడిపించే, సాసించే  దిక్సూచిగా ఉండే నాయకులు కరువయ్యారు. నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి ఆఖరికి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా నామమాత్రపు నాయకత్వానికే పరిమితం అవ్వడంతో టీడీపి కోటలకు బీటలు వారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత చావుదెబ్బతిన్నంతగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎన్నికల నాటికి గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వెనుకడుగుమీద వెనుకడుగు వేస్తోంది.

 

గతంలో ప్రతిపక్ష పాత్ర ఇలా ఉండేది కాదు కద బాబూ..!

2004 నుండి 2014 వరకూ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోనే ఉంది. అప్పట్లో 2004లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖరరెడ్డి గాలిలో తెలుగుదేశం పార్టీకి ఇలానే చావుదెబ్బ తగిలింది. కేవలం 48 స్థానాలు మాత్రమే వచ్చాయి. అయినా పార్టీ క్యాడర్ చెక్కుచెదరలేదు. ఆరు నెలల్లోనే అంటే 2004 డిసెంబర్ నాటికే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర ఆరంభమయ్యింది. రోడ్డు మీదకు రావడం, ధర్నాలు, ఆందోళనలు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండాలు రెపరెప లాడాయి. ఈ క్రమంలోనే వారితో పాటు వామపక్షాలు, టీఆర్ఎస్ వంటిపార్టీలు కూడా జత కలిసి కాంగ్రెస్ పార్టీని ముప్పు తిప్పలు పెట్టేలా ఆందోళనలు, దర్నాలు చేశాయి. అలా పదేళ్లపాటు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర అద్భుతంగా పోషించింది. చంద్రబాబు కూడా అడపదడపా ప్రజల్లో ఉంటూ యాత్రలు చేస్తూ మెప్పు పొందారు. ఈ క్రమంలోనే 2014లో సిఎం అయిన తరువాత కూడా కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజనకు నిరసనగా ధర్మపోరాట దీక్ష అని, నవ నిర్మాణ దీక్ష అంటూ అధికారంలో ఉంటునే బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని నిరసనలు తెలియజేశారు. దానితో పాటు తమ ఎమ్మెల్యేలు జనచైతన్య యాత్ర, ప్రజా చైతన్య యాత్ర అంటూ నిత్యం జనంలో ఉండేలాగునే చర్యలు తీసుకున్నారు. అంటే అధికారం, ప్రతిపక్షం అలా బాధ్యతలు నిర్వర్తించిన టీడీపీ ప్రస్తుతం ఎందుకో పూర్తిగా వెనుకబడింది.

కరోనా సాకుతో ఏడు నెలల నుండి కార్యకలాపాలే లేవు..!

జగన్ ను ప్రశ్నించాలంటే..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలంటే బోలెడన్ని ఆయుధాలు ఉన్నాయి. ఒక్క పిలుపు ఇస్తే రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు, నిరసనలు తెలియజేయడానికి కార్యకర్తలు సిద్ధంగానే ఉన్నారు. కానీ హిందూ దేవాలయాలపై దాడులు, కొడాలి నాని వ్యాఖ్యలు, టీటీడీ డిక్లరేషన్, ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు మీటర్ల బిగింపు, వ్యవసాయ బిల్లు ఆమోదం ఇటువంటి వైఎస్ఆర్ సీపీ ఆమోదించిన చాలా పథకాలకు, ప్రాజెక్టులకు చేస్తున్న పనులకు, జరుగుతున్న చర్యలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాడే వీలు ఉంది. కానీ ఎందుకో కార్యకర్తలు రోడ్డు ఎక్కడం లేదు. అధినేత కేవలం జూమ్‌కు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ చార్జిలు, జిల్లా స్థాయి నాయకులు తమకు తోచిన విధంగా మీడియా ముందుకు వచ్చి స్టేట్ మెంట్ లు ఇచ్చుకుంటూ పబ్బం గడుపుతున్నారే తప్ప ఏ ఒక్కరు కూడా ప్రత్యక్ష ఆందోళనలలో పాల్గొనడం లేదు. మరో వైపు బీజేపీ కనీసం తాము ఉన్నామంటూ అంతో ఇంతో ఉనికిని చాటుకునే ప్రయత్నంలో హిందూ దేవాలయాలు జరుగుతున్నప్పుడు, కొడాలి నాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగానూ అక్కడక్కడా రోడ్డుపై దర్నాలు చేసి అరెస్టు అయ్యారు. కానీ తెలుగుదేశం పార్టీలో మచ్చుకు కూడా ఇటువంటి ఉదాహరణలు లేవు. అందుకే తెలుగుదేశం పార్టీ కోటకు బీటలు వారుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.