Gudivada Politics: టార్గెట్ కొడాలి నాని – టీడీపీ స్పెషల్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా..!?

Gudivada Politics: TDP Target Kodali Nani - Special Strategy Exclusive
Share

Gudivada Politics: ఏపిలో గుడివాడ రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే.. మంత్రి కొడాలి నాని ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. మంత్రి పదవిలో ఉంటూ మీడియా ముందుకు వస్తే చాలు తన శాఖ గురించి, తన నియోజకవర్గ అభివృద్ధి గురించో మాట్లాడకుండా చంద్రబాబును, లోకేష్ లను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, ఏకవచనంతో సంభోదించడం, చెప్పుకోలేని విధంగా దూషించడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులకు నాని ప్రధమ శతృవుగా మారిపోయారు. ఇప్పుడు కొడాలి నానిని ఓడించడమే తెలుగుదేశం పార్టీకి ఒక ప్రెస్టేజి అంశంగా మారింది. ఇప్పుడు అందుకు టీడీపీ గ్రౌండ్ లెవల్ పాలిటిక్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో భాగంగా టీడీపీ గుడివాడలో అంతర్గత సర్వే నిర్వహించిందని సమాచారం. ఆ సర్వే ప్రకారం గుడివాడలో కొడాలిని పూర్తి స్థాయిలో దెబ్బతీసేందుకు నాన్ కమ్మ అభ్యర్థిని దించితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఓట్లు ఎక్కువగా ఉన్న బలమైన సామాజిక వర్గ నేతను కొడాలి నానికి ప్రత్యర్ధిగా రంగంలోకి దించితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని తెలియడంతో ఆ దిశగా అడుగులు వేస్తోంది.

Gudivada Politics: TDP Target Kodali Nani - Special Strategy Exclusive
Gudivada Politics: TDP Target Kodali Nani – Special Strategy Exclusive

Gudivada Politics: గుడివాడ రాజకీయ ముఖ చిత్రం..!

గుడివాడలో కమ్మ సామాజిక వర్గ నేతలు, ఓటర్లు తక్కువే. కానీ వరుసగా ఈ సామాజిక వర్గ నేతలే గెలుస్తూ వస్తున్నారు. కొడాలి నాని వరుసగా 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన ప్రతి సారి 20 వేల పైచిలుకు మెజార్టీతోనే గెలిచారు. ఆయన కంటే ముందు రావి వెంకటేశ్వరరావు, ఆయన తండ్రి రావి హరిగోపాల్, ఆయన తండ్రి రావి శోభనాద్రి చౌదరి మూడు సార్లు ఎమ్మెల్యేలుగా పని చేశారు. అంతకంటే ముందు ఎన్టీఆర్ ఇక్కడి నుండి రెండుసార్లు పోటీ చేసి గెలిచారు. వీరు అంతా కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే. రావి కుటుంబం నుండి అయిదు సార్లు ఎమ్మెల్యేగా పని చేయగా కొడాలి నాని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలానే ఎన్టీఆర్ రెండు సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కఠారి కుటుంబం నాలుగు సార్లు గెలుపొందింది. కఠారి సత్యనారాయణ ప్రసాద్ కాంగ్రెస్ నుండి మూడు సార్లు పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత కఠారి ఈశ్వర కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నియోజకవర్గంలో కులాల వారిగా ఓటర్లను చూసుకున్నట్లయితే ఎస్సీ సామాజికవర్గ ఓట్లు 54 వేలు, కాపు సామాజిక వర్గ ఓట్లు 26,800, యాదవ (బీసీ) సామాజిక వర్గ ఓట్లు 22,890, గౌడ సామాజిక వర్గం 15 వేలు, కమ్మ సామాజికవర్గం 14,400, ముస్లిం మైనార్టీ ఓట్లు 10,800, రెడ్డి సామాజికవర్గం 5,900, రజక సామాజికవర్గం 5,300 ఓట్లు ఉన్నారు.

Gudivada Politics: TDP Target Kodali Nani - Special Strategy Exclusive
Gudivada Politics: TDP Target Kodali Nani – Special Strategy Exclusive

గ్రౌండ్ రిపోర్ట్ రాధాకి అనుకూలం..!?

ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గ ఓట్లే అధికం. నియోజక వర్గంలో 2లక్షల 25వేల పైచిలుకు ఓట్లలో దాదాపు 25 శాతం ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. ఆ తరువాత కాపు, యాదవ సామాజిక వర్గం అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. కాపు, యాదవ, రెడ్డి తదితర సామాజికవర్గ నేతల మద్దతుతో కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలి నాని గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు టీడీపీ స్ట్రాటజీ ప్రకారం కొడాలి నానికి ప్రత్యర్థిగా ఎస్సీ, బీసీ వర్గాలు ఆదరించే కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడిని పోటీకి దింపాలని చూస్తోంది. గుడివాడ నియోజకవర్గం నుండి పూర్తిస్థాయిలో తెలిసిన కాపు సామాజికవర్గ కీలక నేత వంగవీటి మోహనరంగా వారసుడు వంగవీటి రాధను పోటికి దించనున్నట్లుగా ఓ ప్రచారం జరుగుతోంది. 99 శాతం ఇది వాస్తవమేనన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా వినబడుతోంది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా గత వారం రోజులుగా వంగవీటి రాధ గుడివాడ నియోజకవర్గానికి చెందిన కాపు సామాజిక వర్గ నేతలతో భేటీ అవుతున్నారు. అది కూడా వైసీపీలోని కాపుసామాజిక వర్గ నేతలతో రహస్యంగా సమావేశం అవుతున్నారు. తాను ఇక్కడ నుండి పోటీ చేయనున్నాననీ, కలసి పని చేయడానికి రెడిగా ఉండాలని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.

Gudivada Politics: TDP Target Kodali Nani - Special Strategy Exclusive
Gudivada Politics: TDP Target Kodali Nani – Special Strategy Exclusive

ప్రణాళికలు సిద్ధమే..!?

ఆ తరువాత ఎస్సీ సామాజిక వర్గ నేతలతోనూ భేటీ అయి చర్చించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నేరుగా అయితే కార్యక్రమాలు చేయడం లేదు కానీ రహస్యంగా తన కార్యక్రమాల ప్రణాళికను రాధా సిద్దం చేస్తున్నారు. కొడాలి నాని మీద పోటీ చేయాలంటే ముందుగా ఆయన బలాబలాలు తెలుసుకోవాలి. ఆ బలంమీదనే దెబ్బతీసి బలహీనతగా మార్చలనీ, 2019లో జరిగిన పొరబాటు జరగకుండా కమ్మసామాజిక వర్గ నేతను కాకుండా కాపు సామాజికవర్గ నేతను దింపాలనేది టీడీపీ స్ట్రాటజీ. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మంచి పట్టు ఉన్న ఇమేజ్ ఉన్న నాయకుడు వంగవీటి రాధాను దింపాలని యోచన చేస్తోంది టీడీపీ. నిజానికి వంగవీటి రాధా కొడాలి నానికి మంచి స్నేహితుడు, సన్నిహితుడు కూడా. వీరి కుటుంబాల మధ్య కూడా మంచి సన్నిహిత సంబందాలు ఉన్నాయి. వంగవీటి రాధా అయితేనే కొడాలి నాని మీద గెలువగలరు అని భావించిన టీడీపీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే రహస్య భేటీలు జరుగుతున్నాయి. మరో నాలుగైదు నెలల్లో నియోజకవర్గంలో భారీ సభ పెట్టి వంగవీటి రాధా నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా బాధ్యతలు చేపట్టి కదనరంగంలోకి దిగాలన్నది ఆలోచన. గుడివాడ రాజకీయాల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా నడుస్తొంది. ఏమి జరుగుతుందో వేచి చూడాలి.


Share

Related posts

లోకేష్, వంశీ మాటల యుద్ధం

somaraju sharma

జగన్ క్రిష్టియన్ కావచ్చు.., కానీ ముందు రాజకీయుడు, సీఎం…!!

Srinivas Manem

Corona Vaccine: గుడ్ న్యూస్ః క‌రోనా వ్యాక్సిన్ ధ‌ర త‌గ్గింది

sridhar