ఒక సెలబ్రిటీ ఇంట్లో శుభకార్యం అంటే చాలు మన వారికి ఎక్కడలేని ఊపు వచ్చేస్తుంది. ఆ హంగామా మొత్తం సోషల్ మీడియాలోనే ముందు మొదలైపోతుంది. సరే ఎంతైనా ఫాన్స్ కదా ముచ్చటపడి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని వదిలేస్తే ఊరికే ఉంటారా….? ఒక్కొక్కరు ఒక్కొక్క సిబిఐ ఇన్వెస్టిగేటర్ లాగా మారిపోయి వధూ వరుల పుట్టుపూర్వోత్తరాలు దగ్గర్నుండి అన్ని విషయాలు చెబుతుంటారు…. శోధిస్తుంటారు.. కొత్త కొత్త కథలను పరిశోధిస్తారు… ఇంకా వీలు కాకపోతే వారే సొంతగా రాస్తారు. ఇక ఈ కథలు ఎంత క్రియేటివ్ గా ఉంటాయి అంటే అది ఆ కుటుంబంలోని సభ్యులు చదివినట్లైతే ఇలాంటిది ఒకటి నిజంగా జరిగిందా..? ఏమో…! ఇది చూస్తుంటే నిజమే అనిపిస్తోంది… కానీ…. అయినా అసలు ఇలా ఎప్పుడు జరిగింది? అని వారిలో వారే మదన పడిపోయి కన్ఫ్యూజ్ అయిపోతారు.
ఇప్పుడు మనం మాట్లాడుకో పోయేది చిరంజీవి తమ్ముడు నాగబాబు బిడ్డ కొణిదెల నిహారిక పెళ్లి గురించి. అది ఖాయమైపోయింది అని తెలుసు…. వరుడు పేరు జొన్నలగడ్డ చైతన అని కూడా తెలుసు. తండ్రి గుంటూరు ఐజి ప్రభాకర్ రావు. ఇక నిహారిక మరియు చైతన్యాలు ప్రీ – వెడ్డింగ్ ఫోటో షూట్ లలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధం అని కూడా అందరికి తెలుసు. అయితే ఈ సంబంధం కలవడం వెనుక రెండు ఆసక్తికరమైన కథలు వెలుగులోకి వస్తున్నాయి. సరే అవి నిజాలే అనుకుంటే కాసేపు అవి ఎంత వైవిధ్యభరితంగా ఉన్నాయో మీరే చూడండి.
మొదటిగా నిహారిక కాబోయేమామగారు ప్రభాకర్ రావు ఉన్నారు కదా…. ఆయనకు ఓ చెల్లెలు ఉండేది. ఆమెను గతంలో నాగబాబు కి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని చిరంజీవి అప్పట్లో అనుకున్నాడట. అంటే ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచన అది. ఇప్పుడు ఎలా బయటపడిందో ఎవరికీ తెలియదు కానీ ఆ సంబంధం ఎందుకో కుదరలేదు. మళ్లీ 30 ఏళ్ల తర్వాత ప్రభాకర్ రావు చేసుకోకపోయినా…. తన తమ్ముడి కూతురిని అదే ఇంటికి ఇద్దామని అనుకున్నాడట చిరంజీవి. ఇక ఈ సంబంధం కుదిర్చింది కూడా చిరంజీవే కాబట్టి ఈ కథ కి పెద్దగా ప్రాబ్లం లేదు.
రెండవ కథ ఏమిటంటే ప్రభాకర్ రావు భార్య పేరు పద్మ. ఆమె తండ్రి పేరు గుణ వెంకట రత్నం అంటే ప్రభాకర్ రావు మామ. ఆయనకు చిరంజీవి, నాగబాబు తండ్రి వెంకట్రావుకి అప్పట్లో మంచి దోస్తీ ఉండేది. అందుకని పద్మ పెళ్ళయ్యాక భర్త ప్రభాకర్ రావు కూడా చిరంజీవికి మంచి స్నేహితుడు అయ్యాడు. తరచూ టచ్ లో ఉంటూ…. మంచి చెడు మాట్లాడుకుంటూ ఉండగా ఈ మధ్య ప్రభాకర్ రావు చిరంజీవి తో మాట్లాడుతూ తమ అబ్బాయి చైతన్యకి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పాడు. ఇక నిహారికకు కూడా పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఆ కుటుంబం ఉండడంతో వారి ఇద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నుండి బయటకు వచ్చిందే ఈ సంబంధం. ఇక్కడ కూడా అంతా చిరంజీవి చేతుల పైనే జరిగింది…. అన్ని విషయాలను ఆయనే పెద్దరికంగా…. బాధ్యతను చొరవగా తీసుకున్నాడు.
ఇక ఈ మెగా కాంపౌండ్ చాలా పెద్దది అన్న విషయం తెలిసిందే. వారికి రెండు కథలని వినిపిస్తే ఇలాంటివి మాకే తెలియదు మీకు ఎక్కడ నుండి బయటకు వచ్చాయి అని నోర్లు వెళ్ళబెడుతున్నారట. ఇక కొంతమంది దగ్గర వారు మాత్రం ఈ రెండింటిలో.. రెండవ కథకి ఓటు వేసి పక్కకు వెళ్లిపోతున్నారట. ఇంకా మెగా ఫ్యాన్స్ చూస్తే మా నిహారిక పెళ్లి వెనక ఇలాంటి ఆసక్తికరమైన కథలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు. సరే ఏదైనా నిశ్చితార్థం మరియు పెళ్లి అయ్యేలోగా ఈ వార్తలు, కథల పర్వం ఆగి మరియు వారి పెళ్లి శాంతంగా జరిగి సుఖసంతోషాలతో వారి దాంపత్య జీవితం కళకళలాడాలని ఆకాంక్షిద్దాం.