దేవాలయాలకే కాదు ఏపీ లో మృతదేహాలకి కూడా భద్రత లేదు..!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అలాగే మృతుల సంఖ్య కూడా ఎవరికీ అందనంత దూరం పోయింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం పనితీరు పట్ల కొన్ని విమర్శలు ఎదురవుతున్నాయి.

 

కరోనా శవాలండి బాబూ అవి…!

మొన్నటి వరకు మనం దేవాలయాల్లో చోరీలు, ఆలయాలపై వివాదాలు చూశాం. అయితే ఇప్పుడు తాజాగా కరోన మృతదేహం వద్ద కూడా కొంతమంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. శవాలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కనీస మానవత్వం లేకుండా దోచేస్తున్నారు. తాజాగా తిరుపతి స్విమ్స్ శ్రీ పద్మావతి స్టేట్ కరోనా ఆసుపత్రిలో మృతి చెందిన ఒక వ్యక్తి బంగారపు ఉంగరం తో పాటు అతడి కి సంబంధించిన ఖరీదైన మొబైల్ కూడా మాయం కావడం గమనార్హం.

సీసీటీవిలో దొరికాడు..!

గత కొద్ది రోజులుగా కరోనా ఆసుపత్రిలో మృతదేహంపై బంగారు ఆభరణాలు మాయం అవుతుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక స్విమ్స్ కరోనా ఆస్పత్రిలోనే ఇవన్నీ జరుగుతుండడం గమనార్హం. ఈ సమయంలోనే చౌడేపల్లె వెంకటరత్నంనాయుడు అదే ఆసుపత్రిలో పది రోజుల క్రితం మరణించాడు. అతడి చేతికి ఉన్న బంగారు ఉంగరం తో పాటు ఖరీదైన మొబైల్ పీపీఏ కిట్లతో విధుల్లో ఉన్న ఒక వ్యక్తి తీసుకుంటూ ఉండటం గమనార్హం. గురువారం సిసి టివి ఫుటేజ్ లో ఇది స్పష్టంగా కనిపించింది.

మంత్రి గరం గరం..

ఇక దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కరోనా మృతదేహంపై బంగారు ఆభరణాలు మాయం వ్యవహారంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విపరీతంగా మండిపడ్డారు. ఈ ఘటన పై సీరియస్ అయిపోయి వెంటనే తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ తో ఫోన్లో మాట్లాడి ఈ చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.