NewsOrbit
బిగ్ స్టోరీ

నాజీ చట్టాలను గుర్తుకు తెస్తున్న ఎన్‌ఆర్‌సి!

అస్సాం రాష్ట్రంలో మినహా మిగతా రాష్ట్రాలలో జనాభా రిజిస్టర్‌ని తయారు చేసి,  అప్‌డేట్ చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది అని 2019 జూలై, 31 నాడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనర్థం? ప్రస్తుతం అస్సాంలో జరుగుతున్న నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ ఆర్ సి) అప్‌డేట్  కార్యక్రమం ఇక ముందు దేశవ్యాప్తంగా అమలు చేస్తారు అని.

ఈ ఎన్‌ఆర్‌సి ప్రక్రియలో అంతర్లీనంగా ఉన్న లోపాల గురించి ఇప్పటికే ఎంతో మంది ఎంతో రాశారు. ఈ దేశంలో పుట్టి, జీవితం మొత్తం ఈ దేశంలో గడిపిన వారు తాము ఈ దేశానికి చెందిన పౌరులమే అని నిరూపించుకోవటానికి సరైన పత్రాలు సమర్పించాలి అనే ఒక ఆలోచనే ఇల్లు, కుటుంబ జీవనం కలిగి ఉండటం అనే ఒక ఆధిక్యతా భావన నుండి ఉద్భవించింది.

మొదటి కారణం- ఈ ప్రక్రియలో ఇల్లు లేని వారికి స్థానం లేదు. అస్సాం రాష్ట్రం వరద బాధిత రాష్ట్రం. ప్రతి సంవత్సరం ఋతుపవనాల సమయంలో  బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు నదీ పరివాహక ప్రాంతాన్ని ముంచెత్తుతాయి. పక్కా ఇళ్ళల్లో ఉండని వారు తమ సామానులని పోగొట్టుకుని, బ్రతుకు జీవుడా అంటూ బయటపడి జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలుపెట్టడం అనేది అక్కడ సర్వసాధారణం.

ఇటువంటి వాళ్ళు ఇప్పుడు తాము ఈ దేశంలో 1971 మార్చి 21 ముందునాటికే నివాసం ఉంటున్నామనో, లేదా వాళ్ళ తండ్రులు, తాతలు కనుక ఆ ముందు నుండి ఉండిఉంటే వాళ్ళు తమ తండ్రులు, తాతలే అనో నిరూపించుకోవాల్సిన పరిస్థితి. అలా నిరూపించుకోలేని పక్షంలో వాళ్ళు అక్రమ వలసదారులే. ఇదే విధంగా, ఈ ప్రక్రియలో వేధింపులు, హింస తట్టుకోలేక ఇంటి నుండి పారిపోయి మరొక చోట నివాసం ఏర్పరుచుకున్న అనాధలకి, అనాధ బాలలు లేదా యువకులకి చోటు లేదు.

ప్రతి పౌరుడికీ తనని ప్రేమించే తల్లి తండ్రులు ఉంటారు, తనకి సంబంధించిన పత్రాలు అన్నీ వాళ్ళు భద్రంగా ఉంచుతారు అన్న ఆలోచనే లోపభూయిష్టమైనది. అందువలన ఈ ఎన్‌ఆర్‌సి ప్రతి అడుగులోనూ బలవుతున్నది ఎటువంటి ఆసరా లేని దీనులే. మతంతో నిమిత్తం లేకుండా ఈ ప్రక్రియ పౌరులు కానివారిని తొలగిస్తున్నప్పటికీ (అయితే సచార్ కమిటీ నివేదిక ప్రకారం ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలలో ముస్లింల శాతమే చాలా ఎక్కువ) ప్రభుత్వం సమాంతరంగా పౌరసత్వ సవరణ బిల్లుకి చట్టరూపం ఇవ్వటానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నది. ఈ పౌరసత్వ సవరణ బిల్లు ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ మతానికి చెందిన పత్రాలు లేకుండా వలసచ్చిన వ్యక్తులు- అంటే మౌలికంగా ముస్లిం కాని ఎవరైనా సరే- పౌరసత్వానికి అర్హులు అవుతారు.

ఈ రెండిటిని కలిపి చూడగా మనకి అర్థమయ్యేది ఏమిటంటే చివరకు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోలేని ముస్లింలని అక్రమ వలసదారులుగా ప్రకటిస్తారు. ఈ మధ్య కాలంలో రాజ్యసభలో బిల్లులు ఆమోదింపబడుతున్న వ్యవహారం చూస్తుంటే పౌరసత్వ సవరణ బిల్లుకి అడ్డు వచ్చేదేమీ ఉన్నట్టు కనపడటం లేదు.

 ఎన్‌ఆర్‌సి తుది ముసాయిదా విడుదల తర్వాత ఒక ఎన్‌ఆర్‌సి సేవాకేంద్రంలో తమ పేర్లు చూసుకుంటున్న దృశ్యం

ఎన్‌ఆర్‌సి రాష్ట్ర సమన్వయకర్త లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకి సమాధానమిస్తూ, అదే విషయానికి సంబంధించి బాధితులు వేసిన కేసులని కొట్టివేస్తూ మొన్న ఆగస్ట్ 13వ తారీఖున సుప్రీం కోర్టు ఒక ఆదేశాన్ని వెలువరించింది. తల్లితండ్రులలో ఒకరు ‘సందేహాస్పద ఓటరు’  లేదా ‘విదేశీయులుగా ప్రకటించిన’ కేటగిరీలో ఉండడం, లేదా అతని ఆమె కేసు ఫారినర్ ట్రిబ్యునల్ కానీ మరేదన్నా కోర్టు పరిశీలనలో కానీ ఉండడం, ఆ జంటలో రెండవ వారు ఎన్‌ఆర్‌సిలో స్థానం సంపాదించిన వారు అయితే, వారి పిల్లలు 2004 సెప్టెంబర్ 3 తరువాత భారతదేశంలో పుట్టి ఉంటే ఆ పిల్లల పరిస్థితి ఏమిటి అనేది సుప్రీం కోర్టు ముందుకి వచ్చిన ప్రశ్న.

సుప్రీం కోర్టు తరుపున ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మాట్లాడుతూ అటువంటి పిల్లల తల్లితండ్రులలో ఒకరి  పేరు ఎన్‌ఆర్‌సిలో లేకపోతే ఆ పిల్లవాడి పేరు కూడా ఆ జాబితాలో ఉండటానికి వీలు లేదు అని నిర్ధారించాడు. ఇవే ప్రశ్నలు రాజ్యంగ ధర్మాసనం ముందు ఉన్నాయని, ఆ కేసులో తీర్పు ఇచ్చినప్పుడే వీటిని కూడా తేలుస్తారనీ సుప్రీం కోర్టు పేర్కొంది. అప్పటివరకు పైన పేర్కొన్న అవగాహన ప్రకారం ఎన్‌ఆర్‌సి జాబితా సిద్ధం చెయ్యాలని పేర్కొంది.

ఈ ఎన్‌ఆర్‌సి ప్రక్రియ, ముఖ్యంగా ఆగస్ట్ 13 నాడు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం 1935 నాటి జర్మనీలోని నాజీ ప్రభుత్వం ఆమోదించిన రైక్ పౌరసత్వం చట్టాలని గుర్తు తెచ్చేవిధంగా ఉన్నాయి. ఈనాడు మనం హోలోకాస్ట్‌ అంటున్న మహా మారణకాండకి నాంది పౌరసత్వానికి సంబంధించిన ‘న్యూరెంబర్గ్ చట్టాలేనని చరిత్రకారులు చెబుతారు. రైక్ పౌరసత్వం చట్టం ప్రకారం ‘జర్మన్ లేదా తత్సంబంధిత రక్తం కలవారు మాత్రమే’ జర్మనీ పౌరులు.

మూడవ రైక్ ప్రభుత్వం పౌరసత్వ పత్రాలు అందచేస్తేనే ఎవరైనా పౌరులుగా గుర్తింపు పొందేవారు. ఈ చట్టం ప్రకారం పౌరసత్వ పత్రాలు అందుకున్నవారికి మాత్రమే రాజకీయ హక్కులు ఉండేవి. ఈ చట్టానికి సంబంధించిన నియమ  నిబంధనల ప్రకారం ‘జర్మన్’ అంటే ఎవరు అని నిర్వచించటం సంక్లిష్టంగా తయారయ్యింది. అలాగే జర్మన్-యూదు దంపతులకి పుట్టిన పిల్లలని వేరేగా వర్గీకరించారు.

ఒకరు లేదా ఇద్దరు యూదు అవ్వ-తాతలు ఉంటే ఆ వ్యక్తిని జర్మన్ గానే పరిగణించేవారు. ముగ్గురు లేదా నలుగురు యూదు అవ్వ-తాతలు ఉంటే ఆ వ్యక్తిని పూర్తి యూదు గానే పరిగణించేవారు. నెమ్మది నెమ్మదిగా, మిశ్రమ జాతులకి చెందిన తల్లితండ్రులకి పుట్టిన పిల్లల – వీరిని ‘మిక్స్లింగ్’ అనేవారు – పట్ల చట్టాలు మరింత కఠినం అయ్యాయి. పరిశుద్ధ రక్తం కలిగి ఉండాలి అని రానురానూ చట్టాల ద్వారా డిమాండ్ చెయ్యటం మొదలుపెట్టారు.

జర్మన్లని పెళ్లి చేసుకున్న యూదుల –కొన్ని సందర్భాలలో క్రైస్తవ మతం కూడా స్వీకరించిన యూదుల -పిల్లలు, మనవలు అప్పటివరకు జర్మన్లగానే పరిగణింపబడ్డారు. అయితే ఈ చట్టాల తరువాత ఈ చట్ట పరీక్షలలో విఫలం చెంది పౌరసత్వం కోల్పోయారు.

ఈ చట్టాల కింద “ఆర్య రక్తం’ ఉన్నవారికి ఆహెన్ పాస్ (అంటే వారి పూర్వికులు ఆర్యులు అనే గుర్తింపు)  ఇచ్చేవారు. ఈ పాస్ ఆ వ్యక్తి కుటుంబ వృక్షానికి సంబధించిన రికార్డ్. దీని ఆధారంగానే సదరు వ్యక్తికి పౌరసత్వ హక్కులు దఖలు పడతాయి. ఇదంతా కూడా ఎన్‌ఆర్‌సి ప్రక్రియని పోలి ఉండటం మనం స్పష్టంగా గమనించవచ్చు. ఈ ఎన్‌ఆర్‌సి ప్రక్రియలో ప్రతి వ్యక్తి కుటుంబ గత చరిత్రను రికార్డ్ చేస్తారు. ఈ వివరాలు అన్నీ ఎన్‌ఆర్‌సి సంగ్రహంలో నిక్ష్లిప్తమై ఉంటాయి. దీని ఆధారంగానే సదరు వ్యక్తి పూర్వీకులను ‘భారతదేశ మూలాలు కలిగిన’ వారుగా నిర్ధారిస్తారు.  దీని తరువాతనే సదరు వ్యక్తికి భారత రాజ్యాంగం కింద పౌరునికి దఖలు పడే హక్కులన్నీ లభిస్తాయి.

నాజీ జర్మనీలో జర్మన్‌గా ఎవరు అర్హత పొందుతారు అనేది మతం (యూదులు లేదా క్రైస్తవులు) మీద ఆధారపడి ఉండేది కాబట్టి పౌరసత్వ పత్రాలు జారీ చెయ్యడానికి నాజీలు జననం, బాప్టిజం, పెళ్లి, చావు ధృవీకరణ పత్రాల మీద ఆధారపడేవారు. తమ జర్మన్ (అంటే క్రైస్తవులు అని) అవ్వ-తాతలతో తమ రక్త సంబంధాన్ని నిరూపించుకోవటానికి కావలసిన ధృవీకరణ పత్రాల కోసం ప్రజలు నానా హైరానా పడేవారు. ఈ ధృవీకరణ పత్రాలు చర్చీలలో, ప్రభుత్వ కార్యాలయాలలో ఉండేవి.

నాజీ జర్మనీలో బూటకపు శాస్త్రాల ప్రాతిపదికగా చేసిన న్యూరెంబర్గ్ చట్టాలను వివరించేందుకు 1935లో రూపొెందించిన ఒక ఛార్ట్. తర్వాత యూదుల పట్ల చూపిన వివక్షకు మూలం ఈ చట్టాలే.

Photo: United States Holocaust Memorial Museum Collection/Wikimedia Commons, CC BY-SA

ప్రస్తుతం ఎన్‌ఆర్‌సి అస్సాంలో పురోగతిలో ఉంది. దాన్ని దేశమంతటా అమలు చేస్తామని హోం శాఖ ప్రకటించింది. ఇక జనాలు భారతీయులైన తల్లి-తండ్రులతో, అవ్వ-తాతలతో తమ రక్త సంబంధాన్ని నిరూపించుకోవడానికి  రేషన్ కార్డుల కోసం, జనన ధృవీకరణ పత్రాల కోసం , ఇతర పత్రాల నానా తిప్పలూ పడవలసిందే. నచ్చినా నచ్చకపోయినా నాజీ జర్మనీ తాలూకు ఛాయలు మనకి ఇందులో కనిపిస్తాయి.

నాజీ జర్మనీకి ఇక్కడకి ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే ఇక్కడ ఎన్‌ఆర్‌సి ‘భారతీయ మూలాలు కలిగిన’ వ్యక్తిని మతం ఆధారంగా నిర్ధారించదు. అయితే, పైన చెప్పినట్టు పౌరసత్వం బిల్లు ప్రస్తుత రూపంలో ఆమోదం పొందితే పౌరసత్వం కోల్పోయేది కేవలం ముస్లింలు మాత్రమే. మిగతా మతాల వారిని శరణార్ధులుగా గుర్తించి ఇక్కడే ఉండనిస్తారు.

దీనికి సంబంధించి అర్థం కాని విషయం ఏమిటంటే ప్రాధమికంగా ఎన్‌ఆర్‌సి ప్రక్రియ గురించిన కేసు రాజ్యంగ ధర్మాసనం – ఈ విషయాన్ని తన ఆగస్ట్ 13 ఆదేశంలో సుప్రీం కోర్టే పేర్కొంది- ముందు ఉన్నప్పుడు సుప్రీం కోర్టు ఇటువంటి ఆదేశాలు ఎలా ఇస్తున్నది అన్న విషయం.

పౌరసత్వం చట్టంలో సెక్షన్ 6A అమలుకు 1971 మార్చి 24ను గడువు తేదీగా నిర్ణయించడాన్నే రాజ్యంగ ధర్మాసనం ముందు సవాలు చేశారు. అంటే యావత్తు రాష్ట్ర జనాభాను తాము 1971 మార్చి 24కి ముందే ఈ దేశంలో ఉన్నట్లు నిరూపించుకోమని అడిగిన తరువాత, కొన్ని కోట్ల రూపాయలు ప్రజా ధనం ఖర్చయిన తర్వాత, లక్షల మందిని ఏ దేశానికీ చెందని వారుగా నిర్ధారించిన తర్వాత అప్పుడు సుప్రీం కోర్టు ఈ తారీఖుకి రాజ్యంగబద్ధత ఉందా లేదా అని నిర్ణయించడానికి పూనుకుంటుంది అన్నమాట.

ఇక్కడ నిర్ణయించవలసిన ఇంకొక ప్రశ్న ఏమిటంటే ఈ దేశంలో నలభై సంవత్సరాలు పాటు నివసించిన ఒక వ్యక్తి అక్రమ వలసదారుడు అని తేలితే అతనిని కూడా బయటకు పంపవచ్చునా అన్నది. ఆగస్ట్ 13 సుప్రీం కోర్టు ఆదేశానికి ప్రాతిపదిక అయిన పౌరసత్వం చట్టంలోని సెక్షన్ 3(1)(b), 3(1)(c) ల రాజ్యంగబద్ధతని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కూడా రాజ్యంగ ధర్మాసనానికి నివేదించారు. అయితే ఈ కేసుని వినటానికి ఇంకా రాజ్యంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చెయ్యలేదు.

ఈ సందర్భంగా సుప్రీం కోర్టు దృష్టిలో త్వరగా తేలాచాల్సిన అంశాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించిన కేసులలో 2017 వేసవిలో ప్రాధాన్యం కోసం పోటీ పడుతున్న రెండు కేసులలో ఎన్‌ఆర్‌సి ఒకటి. ట్రిపుల్ తలాక్ కేసు రెండవది. 1400 ఏళ్లుగా కొనసాగుతున్న ట్రిపుల్ తలాక్ ఆచారం ఇక సహించడనికి వీలు లేదనుకున్న సుప్రీంకోర్టు ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆ ఆచారం రాజ్యాంగబద్ధత మీద తక్షణమే ధర్మాసనం ఏర్పాటు చేసింది.

ఆ విధంగా ఈ ట్రిపుల్ తలాక్ కేసుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదింఛి, వేసవి సెలవులలో కూడా కేసు వాదోపవాదాలు విని నేడు షయరా బానో కేసుగా ప్రసిద్ది పొందిన కేసు తీర్పుని ఇచ్చింది. అది ఇప్పుడు తాజా భారతదేశ రాజ్యంగ చరిత్రలో ఒక భాగం. మరొక పక్క మాత్రం కొన్ని లక్షల మందిని ఏ దేశానికి చెందని వారిగా ప్రకటించగల ఎన్‌ఆర్‌సి విషయంలో మాత్రం దాటవేత ధోరణిని అవలంబిస్తూ దాని రాజ్యంగబద్ధత మీద కనీసం ధర్మాసనాన్ని కూడా ఏర్పాటు చెయ్యలేదు.

దీనంతటి బట్టి మనకి అర్థమయ్యేది ఏమిటంటే దేని ఆధారంగా ఈ ఎన్‌ఆర్‌సి ప్రక్రియ సాగిస్తున్నారో దానికి అసలు రాజ్యాంగబద్ధత ఉందా లేదా అనే విషయాన్ని ఇంకా నిర్ణయించవలసి ఉన్నది. అంతేకాక ఈ ఎన్‌ఆర్‌సి జాబితా వచ్చాక అక్రమ వలసదారులుగా గుర్తించిన వారి గతి ఏమవుతుందన్న విషయంలో స్పష్టత లేదు.  ఇప్పటికైతే వాళ్ళని దేశం నుండి తరలించే అవకాశం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినవారిగా ఎవరినైతే గుర్తిస్తారో వారిని తిరిగి తీసుకోవటానికి ఆ దేశానికి ఇండియాకి మధ్యలో ఎటువంటి ఒప్పందం లేదు. అదే కాక ఒక్క పెట్టున లక్షల మందిని- అందులో చాలా మటుకు ఇండియాలో పుట్టినవారే- బంగ్లాదేశ్ తీసుకునే అవకాశంలేదు.

ఈ ప్రశ్నని సామాజిక కార్యకర్త హర్ష మందర్ వేసిన ఇంకొక కేసులో సుప్రీం కోర్టు పరిగణిస్తున్నది. ఈలోపు అస్సాంలో ఎన్ని డిటెన్షన్ కేంద్రాలు ఉన్నదీ, వాటి సామర్ధ్యం ఎంతో చెప్పాలని సుప్రీం కోర్టు అస్సాం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ డిటెన్షన్ కేంద్రాలు నాజీ జర్మనీలోని కాన్సంట్రేషన్ క్యాంపులని గుర్తుకు తేక మానవు.

కాన్సంట్రేషన్ క్యాంపులకు తరలించిన యూదుల ఇళ్ళని వారి ‘జర్మన్’ పొరుగువారు లూటీ చేసేవారు, తరుచుగా ఆక్రమించుకునేవారు. అక్రమ వలసదారులుగా నిర్దారణ అయి డిటెన్షన్ కేంద్రాలకు వెళ్లిన వారికి కూడా ఇదే గతి పట్టదూ? లక్షల మందిని మీరు పౌరులు కారు అని నిర్ధారించే ముందు, వారిని ఏ దేశానికి చెందని వారిగా చేసేముందు ఎన్‌ఆర్‌సి జాబితాలో పేరు లేకపోతే దాని పర్యవసానాలు ఏమిటి అనే దాని మీద  ఒక నిర్ణయం తీసుకోవడం సుప్రీం కోర్టు బాధ్యత కాదూ?

సుప్రీంకోర్టు తనపైనున్న ఈ న్యాయ బాధ్యతని నిర్వహించకుండా దానికి బదులు ఈ ప్రక్రియ అమలుపై ఒక పాలనా విభాగం లాగా రోజువారీ ఆదేశాలు ఇవ్వటంపై ఎందుకు తన శక్తిని ధారపోస్తున్నది? దురదృష్టవశాత్తు సుప్రీం కోర్టుని ఈ ప్రశ్నలు అడగలేము. పరిపాలనా బాధ్యతలని తన నెత్తి మీదకు వేసుకుంటే వేసుకుంది కానీ సుప్రీం కోర్టు ఈ నాటికీ ప్రజలకి జవాబుదారీ కాదు.

నిజాం పాషా

వ్యాసకర్త సుప్రీంకోర్టు న్యాయవాది. ఎన్‌ఆర్‌సి కేసులో సుప్రీంకోర్టు ముందు హాజరయ్యారు.

‘ద వైర్’ వెబ్‌సైట్ సౌజన్యంతో

author avatar
Siva Prasad

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment