NewsOrbit
బిగ్ స్టోరీ

పాయల్ తాడ్వి…కలలు..కన్నీళ్లు!

పాయల్ తాడ్వి ఆత్మహత్యకు నిరసనగా జలగావ్‌లో ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి

భిల్ తాడ్వి తెగ నుంచి మెడిసిన్ పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కోర్సుకు ఎంపికయిన మొదటి యువతి పాయల్ తాడ్వి కుల వివక్షతో సీనియర్లు ఎడతెగకుండా వేధించడంతో మే నెల 22న ఆత్మహత్య చేసుకున్నది. ఆమె గురించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్టులు ఇద్దరు రాసిన కథనం ఇది. జూన్ రెండున ఈ కథనం ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురితం అయింది.

పాయల్ తాడ్వి చనిపోయిన రోజు నుండి జలగావ్ చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి రోజు నిరసనలు, ప్రార్ధన సమావేశాలు, కొవ్వొత్తి ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. “ పాయల్ అక్కలాగా మరింతమందికి కాకూడదు”  అని రవేర్ తాలుకాలోని లోహార గ్రామంలో జరిగిన ప్రదర్శనలో 8 ఏళ్ల సన పేర్కొంది. అలాగే తాను కూడా పాయల్ తాడ్వి లాగా డాక్టర్ అవుదామని అనుకుంటున్నాను అన్నప్పుడు బిగ్గరగా చప్పట్లు వినిపించాయి.

జలగావ్ లో అందరికి పాయల్ తమ భిలి భాష మాట్లాడే ఒక వైద్యాధికారిగా తెలుసు. పాయల్ ప్రోత్సాహంతోనే చోప్డ తాలుకాలోని ధనోరా గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి మహిళలు వెళ్ళటం ప్రారంభించారు. పాయల్ తాడ్వి అక్కడే పని చేసేది. ఈ 26 సంవత్సరాల వైద్యురాలు “ధృడ సంకల్పం” కల మనిషిగా  “ధైర్యవంతురాలు”గా అక్కడ జనాలకి గుర్తుంది.

అందువల్లనే, పాయల్‌ను ఆమె షెడ్యూల్ తెగ అన్న కారణంగా తోటి డాక్టర్లు ముగ్గురు వేధించటంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది అన్న వార్తా జలగావ్ లో అందరినీ – ఆమెవరో తెలిసినవాళ్ళనీ, ఆమెవరో ఇప్పుడు తెలుసుకుంటున్నవారినీ కూడా – దిగ్భ్రాంతికి గురిచేసింది. తాడ్వి భిల్ సమాజం నుండి వైద్య వృత్తిలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరిన మొదటి మనిషి పాయల్ తాడ్వి.

షెడ్యూల్డ్ తెగగా గుర్తింపు పొందిన తాడ్వి భిల్లులు రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో అక్కడక్కడా ఉన్నారు. భిల్ తెగకి చెందిన  ఒక ఉప-తెగ తాడ్వి భిల్. ఇందులో చాలా మంది ఇస్లాం మతం స్వీకరించినా వారి హైందవ సంస్కృతి మూలాలు అలాగే ఉన్నాయి. చాలా మంది అడవి మీద ఆధారపడుతుండగా మరికొంత మంది వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. ఈ సమాజం నుండి వైద్య వృత్తిలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరిన మొదటి మనిషి పాయల్ తాడ్వి.

లోహారాలోని పొలాలలో పనిచేసి అప్పుడే వచ్చిన ఆశా భాయి తాడ్వి తమలో చాలా మంది వ్యవసాయ కూలీలుగా చేస్తున్నారని, మరికొంత మంది అటవీ ఉత్పత్తుల సేకరణ మీద ఆధారపడి రోజుకి వంద రూపాయలు సంపాదిస్తూ జీవిస్తున్నారని చెప్పారు.

“ఉన్న అవకాశాలే తక్కువ. దాంతో మా పిల్లలు మాతో కలిసి పని చేస్తుంటారు లేదా పనిని, చదువుని రెండిటిని ఏదో ఒక రకంగా చూసుకుంటుంటారు. కొందరు ఆశ్రం పాఠశాలలో చదువుకుంటున్నారు. కానీ అక్కడ ఏమి బాగోదు. ఇన్ని కష్టాలు పడి మాలో ఒకరు ఒక స్థాయికి చేరుకుంటే వారికి దక్కే ఫలితం ఇది. ఇంతా కష్టం పడి ఏమి లాభం?”

మహారాష్ట్రలో ట్రైబల్ జనాభా ఎక్కువగా ఉన్న జిలాల్లో ఒకటైన జలగావ్ లో సుమారుగా ఆరు లక్షల మంది తెగల ప్రజలు ఉన్నారు. అందులో ఒకరు భిల్ తెగకి చెందిన ఉప-తెగ అయిన తాడ్వి భిల్లులు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మొఘల్ స్థావరం అయిన బుర్హాన్‌పూర్(నేటి మధ్యప్రదేశ్ లోని ప్రాంతం)కు పదిహేడవ శతాబ్దంలో వచ్చినప్పుడు కొంతమంది తాడ్వి భిల్లులు ఇస్లాం మతం స్వీకరించారు. కొన్ని శతాబ్దాల తరువాత కూడా వారు ముస్లిం మతస్థులు అయినా సరే హైందవ సాంస్కృతిక మూలాలు కొన్నిటిని వదులుకోలేదు. ఉదాహరణకు దేవతల విగ్రహాలకు నమస్కరించడం లాంటివి.

జలగావ్‌లో ట్రైబల్స్ కోసం 17 ఆశ్రం పాఠశాలలు, 42  గ్రాంట్-ఇన్-ఎయిడ్ పాఠశాలలు ఉన్నాయని జలగావ్ కలెక్టర్ అవినాష్ ధక్నే చెప్పారు. అంతే కాక రాష్ట్రంలో ఉన్న వివిధ నివాస పాఠశాలలకి 2700 మంది పిల్లలని పంపించే పధకం కూడా ఉంది. కానీ ఈ పాఠశాలల్లో సామర్ధ్యానికి సరిపడా పిల్లలు చేరండ లేదు. పిల్లలని ఈ పాఠశాలలకి తీసుకురావటానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది.” అని ఆయన పేర్కొన్నారు.

మహారాష్ట్ర అక్షరాస్యత 82.3% ఉండగా జలగావ్ అక్షరాస్యత 78.2% ఉంది. కేవలం 50% మంది తాడ్వి భిల్లుల విద్యార్ధులు మాత్రమే పన్నెండవ తరగతి వరకు చదువుకుంటున్నారని జలగావ్ మాజీ శాసనసభ్యులు శిరీష్ చౌధరి చెప్పారు.

పాయల్ పదవ తరగతి వరకు జలగావ్ లోని తమ ఇంటికి పది నిమిషాల దూరంలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుకుంది. వేసవి సెలవలు అవ్వటం వల్ల మొన్న ఆ పాఠశాలలో కొద్ది మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు, పాయల్ ఆ పాఠశాల చదువు ముగించుకుని వెళ్ళిపోయాక చేరారు. ఆయనకు పాయల్ గురించి గానీ ఆమె ఆత్మహత్య గురించి కానీ తెలియదు. కానీ ఆ పాఠశాల ఎడ్మినిస్ట్రేటర్ మంగలె దునాఖేకి పాయల్ “నిశబ్దంగా, విధేయంగా” ఉండే విద్యార్ధినిగా గుర్తుంది.

స్టాఫ్ గదిలో పాయల్ గురించిన ప్రస్తావన కులం గురించిన చర్చకి దారితీసింది. ఒక టీచర్, ఎటువంటి వివక్ష అయినా “క్షమించరానిది” అని చెప్పగా, మరొక టీచర్, “ వ్యవస్థాగత వివక్షకి మరొక షెడ్యూల్డ్ ట్రైబ్ అమ్మాయి బలి అయిపోయింది అని నేను వాట్స్ఆప్ లో రాస్తే తొంభై మంది చూసారు కానీ ఒక్కరు కూడా స్పందించలేదు” అని అన్నారు.

శారీరిక లోపంతో పుట్టిన తమ కొడుకు రితేష్‌కి రెండు కాళ్ళు చచ్చుపడిపోవటంతో అబేదా, ఆమె భర్త సలీం ఇంకొక సంతానం కనడానికి ముందు తీవ్రంగా ఆలోచించారు. “ రెండవ బిడ్డకి కూడా ఇటువంటి శారీరక లోపం ఉంటుందేమో అని మేము భయపడ్డాము. అందుకనే నాలుగు సంవత్సరాల పాటు ఆగాము. తరువాత ఒక డాక్టర్ మమ్మల్ని ఇంకో బిడ్డని కనమని ప్రోత్సహించారు.” అని అబేదా చెప్పింది.

పాయల్ పుట్టాక ఆమె నడక కోసం ఆత్రుతగా వెయ్యి కళ్ళతో ఎదురుచూశారు వారు. తొమ్మిది నెలల వయసులో ఆమె మొదటి అడుగులు వేసింది. “ తన చెల్లి నడవటం రితేష్ ని కూడా ప్రోత్సహిస్తుంది అని డాక్టర్ చెప్పారు. అలాగే జరిగింది. రితేష్ లేచి నుంచోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు. పాయల్ దేవుడిచ్చిన వరం.” అన్నది అబేదా .

ఎదిగే రోజుల్లో పాయల్ తన అన్నని చాలా జాగ్రత్తగా చూసుకునేది. “ మేము ఇద్దరము రితేష్‌తో ఎక్కువ సమయం గడుపుతామని తనకి తెలుసు. అందుకే మమల్ని పెద్దగా కదిలించేది కాదు. ఒకసారి తనకి రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మట్టిలో ఆడుకుని వచ్చి గచ్చు తుడవటానికి గుడ్డ ముక్క ఒకటి తనంతట తానే తీసుకువెళ్ళింది.” అని అబేదా నవ్వుతూ అన్నది.

ఈత అంటే పాయల్‌కు ఆసక్తి, పాఠశాలలో జరిగే ప్రతి పరుగుపందెంలో పాల్గొనేది, కానీ ఆమె మనసంతా నృత్యం మీద ఉండేది. పాఠశాలలో ఉన్నప్పుడు డాన్స్ ఇండియా డాన్స్ కార్యక్రమం ఆడిషన్స్‌లో పాల్గొంది. పాయల్ చిన్నతనమంతా సలీంకి ఎటువంటి ఉద్యోగం లేదు. అప్పుడప్పుడు రోజు కూలీగా పనిచేసేవాడు. అబేదా జిల్లా పరిషత్ కార్యాలయంలో గుమస్తాగా పనిచేసేది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం ఉండగా, ఇంటిని శుభ్రపరచడం, వంట చెయ్యడం, బట్టలు ఉతకడం ద్వారా పాయల్ చేదోడు వాదోడుగా ఉండేది.

ఇన్ని ఇబ్బందుల నడుమ కూడా పదవ తరగతిలో పాయల్ 87%తో ఉత్తీర్ణురాలు అయ్యింది. పన్నెండవ తరగతి తరువాత ఇంజనీరింగ్, మెడికల్ అర్హత పరీక్షలు చాలా రాసింది. తన ఆరోగ్య సమస్యలే పాయల్‌ని డాక్టర్ అయ్యేందుకు పురిగొల్పాయని రితేష్ నమ్మకం. “నేను సాధువుల దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం చూసి జనాలకి సేవ చెయ్యాలి అని తను నిర్ణయించుకుంది.”

అవసరం అయితే రితేష్‌ని జీవితాంతం చూసుకుంటానని పాయల్ ఇచ్చిన మాటని గుర్తుచేసుకుంది అబేదా:  “అర్హత పరీక్ష ఫలితాలు వచ్చేవరకు తాను డాక్టర్ అవ్వాలనుకుంటున్నట్లు పాయల్ మాతో ఏనాడు అనలేదు.”

2016లో ఎంబిబిఎస్ కోర్సు పూర్తి అయిన సందర్భంగా బ్యాచ్‌మేట్స్‌తో పాయల్ తాడ్వి (ముందు వరసలో ఎడమ నుంచి ఎనిమిది)

2011లో మిరాజ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్పించటానికి పాయల్ తల్లిదండ్రులు ఋణం తీసుకున్నారు. పాయల్ తండ్రికి అప్పటికి అబేదా పనిచేస్తున్న కార్యాలయంలోనే గుమస్తా ఉద్యోగం వచ్చింది. “నా ఆరోగ్య కారణాల రీత్యా నేను పని చెయ్యలేను. కొన్ని సంవత్సరాలలో మా తల్లిదండ్రులు పదవీ విరమణ చేశాక కుటుంబం బాధ్యత తనే చూడాల్సి వచ్చేది” అని రితేష్ అన్నాడు.

వారి దగ్గిరి బంధువులు కొంతమందికి మాత్రం పాయల్ కెరీర్ ఎంపిక అంత నచ్చలేదు. పెళ్లి చేసి పంపించమని పాయల్ తల్లిదండ్రులకు సలహాలు ఇచ్చేవారు. “మా అమ్మాయి డాక్టర్ అవుతానని చెప్పినప్పుడు జలగావ్‌లో మా అంత ఆనందంగా ఉన్న తల్లిదండ్రులు లేరు.” అన్నది అబేదా కళ్ళు తుడుచుకుంటూ.

అయినా కానీ పాయల్ వయసు అమ్మాయిలందరికీ పెళ్ళిళ్ళు జరుగుతుండడంతో అబేదా కొంత కలత చెందింది. “మా కూతురి సంపాదన మీద ఆధారపడి బతకటానికి నిర్ణయించుకున్నాము అనే మాట రావటం మాకిష్టం లేదు.” అన్నదామె.

జూన్ 2014లో పాయల్‌కి ఇరవైఒక్క సంవత్సరాల వయసు ఉన్నప్పుడు  రావెర్‌లో జరిగిన ఒక పెళ్ళిలో బంధువులు సల్మాన్‌ని పరిచయం చేశారు. పాయల్ అప్పుడు ఎంబిబిఎస్ మూడవ సంవత్సరంలో ఉంది. రావెర్ వాస్తవ్యుడైన సల్మాన్ పాయల్‌ను చూడగానే ఆమె తెగ నచ్చేసిన సంగతి గుర్తుచేసుకున్నాడు. “తను పెళ్ళికి సిద్ధంగా లేనని చెప్పింది. కానీ నేనేమో నేను కూడా డాక్టర్నే కదా కుదిరిపోతుందిలే అని అనుకున్నాను.” పెళ్లి ప్రతిపాదన గురించి ఆలోచించమని సల్మాన్ చెప్పాడు. తరువాత ఇద్దరు తమ తమ మొబైల్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు.

రెండు నెలల తరువాత ఆగస్ట్ ఇరవయ్యో తారీఖున సల్మాన్ పుట్టినరోజునాడు పాయల్ అతనికి ఫోన్ చేసింది. “ తాను పెళ్ళికి సిద్ధం అని చెప్పింది. అది నా జీవితంలో అత్యంత ఆనందదాయకమైన రోజు.’ అని సల్మాన్ చెప్పాడు. డిసెంబర్ లో నిశ్చితార్ధం జరిగింది, పాయల్ చదువు పూర్తి అయిన తరువాత ఫిబ్రవరి, 2016లో పెళ్లి చేసుకున్నారు. “ హనీమూన్‌కి కేరళ వెళ్ళాలని తన కోరిక. నేనేమో ఆశీస్సుల కోసం అజ్మీర్ షరీఫ్ దర్గాకి వెళ్దామని పట్టుబట్టాను.” అని సల్మాన్ చెప్పాడు.

పెళ్లి తరువాత సల్మాన్ ముంబై తిరిగి వచ్చాడు. అక్కడ అతను కెఐఎం హాస్పటల్ లో ఎనస్తీషియా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. ఎంబిబిఎస్ పాసయిన విద్యార్ధులు ఒక సంవత్సరం పాటు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచెయ్యాలి అన్న ప్రభుత్వ నియమాన్ని అనుసరించి పాయల్ సాంగ్లీ మెడికల్ కాలేజ్ లో చేరింది.

2017లో ఒకపక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత పరీక్షలకి సిద్ధమవుతూనే పాయల్ ధనోరా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా చేరింది.

అదే సంవత్సరం సల్మాన్ తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని పాయల్‌కి దగ్గరగా ఉండటానికి ఔరంగాబాద్ వచ్చాడు. “రెండేళ్ళ మా పెళ్ళిలో మేము కలిసి ఉంది కేవలం ఆ ఆరు నెలలు మాత్రమే.” అని సల్మాన్ చెప్పాడు.

2018లో సల్మాన్‌కి ముంబైలోని డాక్టర్ ఆర్.ఎన్.కూపర్ ఆసుపత్రిలో లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది. అలాగే పాయల్‌కి టి.ఎన్.టోపీవాలా నేషనల్ మెడికల్ కాలేజ్ లో గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ వచ్చింది. అక్కడ పని బాగా ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రి వీడటమే గగనం అయిపొయింది. దానితో ఒక హాస్టల్ లో చేరింది. సల్మాన్ పాయల్ ని రెండు-మూడు రోజులకి ఒక సారి కలిసేవాడు. అప్పుడప్పుడు తాను వండిన భోజనం తీసుకువచ్చేవాడు. ఇద్దరు కలిసి రోగులు నిద్రపోయాక గైనకాలజీ వార్డ్ పక్క రూములో ఒక గంట సేపు ఏకాంతంగా  గడిపేవారు.

ముంబై, బివైఎల్ నాయర్ ఆసుపత్రి ఎదుట పాయల్ తల్లి అబేదా సలీం

పాయల్ తన సొంత తాలుకాలో పనిచెయ్యాలని కోరుకోవడానికి కారణం ఇప్పటికీ ఆధునిక వైద్యం అంటే భయపడే తెగల ప్రజల బాగోగులు చూడడం కోసమేనని ముప్పై ఏళ్ల కజిన్ తనూజా చెప్పింది. అందుకని ప్రతి రోజు పాయల్ ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణించి ధనోరా వెళ్లేది. కొన్ని సార్లు రాష్ట్ర రవాణ సంస్థ బస్సులలో, మరికొన్ని సార్లు తన స్కూటర్ మీద ప్రయాణించేది. కజిన్ తనూజా ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేసేది.

“తను చేసే పనంటే తనకు బాగా ఇష్టం. దాని గురించే మాట్లాడేది” అని తనూజా చెప్పింది. “పాయల్ మానసికంగా చాలా గట్టి మనిషి. అందుకే జరిగింది నమ్మడం  కష్టంగా ఉంది”.

ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పాయల్-ముఖ్యంగా ఒక సంఘటనకి సంబంధించి- అందరికి బాగా గుర్తుంది. ఆరునెలలు నిండిన గర్భంతో ఉన్న ఒక తాడ్వి భిల్ మహిళని ఆరోగ్య పరీక్షలకోసం కేంద్రానికి తీసుకువచ్చారు. ఆవిడ తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నదని అక్కడ వైద్యులకి అర్థమయ్యింది. వైద్యులేమో అత్యవసరంగా రక్తమార్పిడి జరపాలి అని చెబుతుంటే, ఆమె కుటుంబసభ్యులు మాత్రం తటపటాయిస్తున్నారు. “వారిని ఒప్పించేందుకు ప్రయత్నించాము, కానీ వాళ్ళు ఒప్పుకోవటం లేదు. పాయల్ సహాయం అడిగాము.” అని ఆ కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అజిత్ వాడేకర్ గురుతు చేసుకున్నాడు. పాయల్ ఒక ఏఎన్ఎం నర్స్ తో కలిసి  ఆ మహిళ ఊరు  వెళ్ళింది. పాయల్ ఆ కుటుంబసభ్యులతో భిల్ భాషలో మాట్లాడి ఆ మహిళ పరిస్థితిని వివరించింది. “ చివరికి ఆ మహిళని జలగావ్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.”

ఆ మహిళకి విజయవంతంగా డెలివరీ అయ్యిందని, ఆమె తన బాబుతో కేంద్రానికి ఆరోగ్య పరీక్షల కోసం వస్తున్నదని డాక్టర్ అజిత్ వాడేకర్ పేర్కొన్నారు. అంతే కాక పాయల్ పని చేస్తున్న రోజుల్లో కేంద్రానికి వచ్చే ఆదివాసీల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. పోలియో చుక్కలు వేసే బృందాలతో కలిసి పాయల్ గ్రామాలకి కూడా వెళ్ళేది.

ఆవిడ కృషి ఫలితం ఈనాటికి చూస్తున్నామని డాక్టర్ అజిత్ వాడేకర్ అన్నారు.

అయితే టి.ఎన్.టోపీవాలా కళాశాలలో మాత్రం వాతావరణం వేరేగా ఉంది అని పాయల్‌కి అర్థమయ్యింది అని అబేదా చెప్పింది. “పాయల్ కి స్వీయ-నియంత్రణ ఎక్కువ. తనకి కోపం రావటం నేనెప్పుడూ చూడలేదు. కానీ పోస్ట్-గ్రాడ్యుయేషన్ లో చేరాక డిస్టర్బ్ అయ్యింది. తను మారిపోయింది.”

మొదట్లో పాయల్ ప్రస్తుతం ఈ కేసులో నిందితురాలు అయిన డాక్టర్ భక్తి మెహారేతో కలిసి ఒకే హాస్టల్ గదిలో ఉండేది. “భక్తికి మంచం ఉండగా, పాయల్ కింద పడుకునేది. భక్తి తన కాళ్ళని పాయల్ పరుపుకి తుడుచుకునేది. దానితో పాయల్ ఆ వార్డ్ లో వేరే గదిలో పడుకోవటం మొదలుపెట్టింది.” అని చెప్పింది అబేదా.

పాయల్ తమ ఫోన్ కాల్స్ ఎత్తడం ఆపివేసింది అని ఆమె బంధువు హనీఫ్ తాడ్వి చెప్పింది. పాయల్ కులం కారణంగా వేధింపులకి గురవుతున్నది అని తల్లికి అనుమానం వచ్చింది. అయితే పాయల్ దానిని ఒప్పుకోలేదు. “కులం గురించి ఎత్తవద్దు అని పాయల్ నాకు చెప్పింది. వైద్య వృత్తిలో ఉన్న ఎవ్వరూ కూడా కులవివక్ష పాటించరు అని తను భావించేది.”

పాయల్ తాడ్వి ఆత్మహత్యకు నిరసనగా ముంబై నాయర్ ఆసుపత్రి ఎదుట ప్రదర్శన

డిసెంబర్, 2018లో పాయల్ తన ముందు ఏడ్చేసింది అని సల్మాన్ చెప్పాడు. తన సీనియర్లు అయిన డాక్టర్ అంకిత ఖండేల్వాల్, డాక్టర్ హేమా అహుజా, డాక్టర్ భక్తి మెహారే తనను నిత్యం వేధిస్తున్నారని, తానిక ఆసుపత్రికి వెళ్లననీ పాయల్ భర్తతో చెప్పింది. సల్మాన్  ఈ విషయం మీద ఫిర్యాదు చెయ్యటానికి పాయల్ శాఖాధిపతి డాక్టర్ ఎస్.డి. శిరోద్కర్ ని కలిసాడు. దాని తరువాత ఆవిడ పాయల్ ని రెండు నెలల పాటు చిన్నారుల విభానికి బదిలీ చేశారు.  పాయల్ పనితో తానూ సంతృప్తిగా ఉన్నట్లు డాక్టర్ శిరోద్కర్ తనకి చెప్పిన  విషయాన్ని సల్మాన్ గర్తు చేసుకున్నాడు. పాయల్ ఆత్మహత్య కేసులో డాక్టర్ శిరోద్కర్‌కి కూడా షోకాజ్ నోటీస్ జారీ చేశారు.

ఫిబ్రవరీలో పాయల్‌ని తన పాత విభాగానికి తిరిగి పంపించారు. ఆ ముగ్గురు సీనియర్లు ఆమెను మళ్లీ వేధించడం మొదలుపెట్టారు. నిత్యం చేస్తున్న పని గురించి తిట్టడం, డెలివరీలు చెయ్యనివ్వకపోవటం, తనని చదువుకోనివ్వమని బెదిరించటం చేసేవారు. “వైద్యకళాశాలలో జూనియర్లు సీనియర్ల దగ్గర నుండి నేర్చుకుంటారు. పాయల్‌కి గొడవపడటం కూడా ఇష్టం లేదు. కానీ తిరిగి వచ్చాక హింస మరింత పెరిగింది అని పాయల్ చెప్పేది.” అని సల్మాన్ పేర్కొన్నాడు.

ఈ విషయం మీద ఫిర్యాదు చెయ్యటానికి గైనకాలజీ శాఖాధిపతి డాక్టర్ వై.ఐ.చింగ్ లింగ్ ని మేలో కలిసాను అని సల్మాన్ చెప్పారు. అయితే చింగ్ లింగ్ ఎటువంటి చర్య తీసుకోలేదు అని బి.వై.ఎల్.నాయర్ ఆసుపత్రి నివేదికలో ఉంది.

పోస్ట్-గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న  అంకిత ఖండేల్వాల్ (27), హేమా అహుజా (27), భక్తి మెహారే (26)  లని అరెస్ట్ చేశారు. తమ కూతుళ్ళ మీద వచ్చిన ఆరోపణలని వారి తల్లిదండ్రులు ఖండించారు. ఈ ముగ్గురు చాలా పని ఒత్తిడిలో ఉండేవారని, కేవలం పాయల్ తన పని సవ్యంగా చెయ్యాలని మాత్రమే కోరుకునేవారని తెలిపారు. “నా కూతురు కులపరంగా వివక్ష చూపించి ఉంటే తప్పక శిక్షించాలి. కానీ తనకి అన్ని కులాల నుండి స్నేహితులు ఉన్నారు.” అని అంకిత ఖండేల్వాల్ తండ్రి కైలాష్ ఖండేల్వాల్ చెప్పారు.

హేమా అహుజా చాలా సున్నిత మనస్కురాలు అని ఆమె తల్లి కవిత నొక్కివక్కాణించారు. “పాయల్ శవాన్ని చూడగానే తను ఏడుస్తూనే ఉంది. ఎవరైనా రోగి చనిపోయినా తను ఏడ్చేది. అటువంటి తను తోటి విద్యార్ధులని ఎలా వేధిస్తుంది?”

పాయల్ పని ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకుందని వీళ్ళు చెబుతున్నదానితో అబేదా విభేదిస్తున్నది. “ఎంబిబీఎస్ చదివేటప్పుడు తనకి ఒత్తిడి అంటే ఏంటో బాగా తెలుసు. తను ఏకబిగిన 24-36 గంటలు పనిచేసేది. పని ఒత్తిడికి లోనయ్యి తను ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదు. వేధింపులు తప్పక ఉన్నాయి.”

పైన పేర్కొన్న ముగ్గురు కులం పేరుతో పాయల్‌ని వేధించారు అనేదానికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని శుక్రవారం నాడు ముంబై పోలీసులు సెషన్స్ కోర్టుకి నివేదించారు.

పాయల్ చనిపోయి ఏడు రోజులు అయ్యింది. జలగావ్ లోని సాయి శంకర్ కాలనీలో ఉన్న పాయల్ తాడ్వి ఇంట్లో ఫ్రేమ్ కట్టించిన పాయల్ ఎంబిబీఎస్ డిగ్రీ పక్కన ఒక మూలగా అగరొత్తులు వెలిగించి ఉన్నాయి. బంధువులు, స్నేహితులు వస్తూ పోతూనే ఉన్నారు.

మధ్య ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో మొన్నీమధ్యే అద్దెకి తీసుకున్న, కొత్తగా రంగులు వేసిన వన్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో తాను  పాయల్ కలిసి దిగిన ఫోటోల మధ్య సల్మాన్ కూర్చుని ఉన్నాడు. ఈ ఇంట్లోనే ఆ ఇద్దరు తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకున్నారు.

తాము “గుర్తించలేకపోయిన” విషయాల గురించి ఆలోచిస్తూ రితేష్ అన్నాడు: “వెనుకబడిన ప్రాంతాలలో ట్రైబల్స్ తో తాను పనిచేశాను కాబట్టి, ముంబైలో కూడా ఎలాగోలా మేనేజ్ చేసేయొచ్చు అని పాయల్ చెబుతూ ఉండేది. వేధింపులు మొదలయ్యాక తను మా అమ్మకి చెప్పింది. కానీ మళ్ళీ తనే చెప్పింది వాళ్ళు కూడా తోటి విద్యార్ధులే, ఫిర్యాదులు ఇచ్చి వారి జీవితాలని నాశనం చెయ్యటం నాకు ఇష్టం లేదు అని.”

తన సీనియర్లకి భయపడి చివరి నెలలో పాయల్ తనని ఆసుపత్రికి రానివ్వలేదని సల్మాన్ చెప్పాడు. ఇది కేవలం వైద్యవిద్యార్ధుల మధ్య స్పర్ధగా  తాను ఈ విషయాన్ని కొట్టిపారేసానని సల్మాన్ చెప్పారు. “గైనకాలజీ శాఖలో కేవలం మహిళలే ఉంటారు. అందరూ అందరితో సఖ్యంగా ఉండరు.” అని అతను అన్నాడు. “దీని గురించి నా జీవితం అంతా పశ్చాత్తాపం వెన్నాడుతుంది. ఆ ముగ్గురి కెరీర్ గురించి ఆలోచించి నేను ఈ విషయాన్ని గట్టిగా పట్టించుకోలేదు.”

కొంత కాలం తరువాత జలగావ్ వెళ్ళిపోయి తాడ్వి భిల్లుల కోసం ఆసుపత్రి ప్రారంభించాలని తామిద్దరం అనుకున్నామని సల్మాన్ చెప్పాడు.

ఇప్పుడైతే ఇక అది జరగకపోవచ్చు. కానీ కొన్ని మార్పులు మాత్రం ఇప్పటికే మొదలయ్యాయి. ముప్పై ఏడేళ్ల నసీమా తాడ్వి మరొక తాడ్వి భిల్ డాక్టర్. ప్రాక్టీస్ సమయంలో తన సీనియర్ సహాధ్యాయి ఒకరు తనని ఎలా వేధించేవాడో ఆమె చెప్పింది. “ఏదన్నా తప్పు జరిగితే అతను నన్నే నిందించి, నాది స్థాయి తక్కువ అన్నట్లు మాట్లాడేవాడు. ఇది ఒక తరహా కనబడని వివక్ష. నా అదృష్టం కొద్దీ నేను నా సీనియర్‌కి ఈ విషయం గురించి చెప్పగానే అతను వెంటనే చర్య తీసుకున్నాడు. ఇటువంటి వాటిని నివారించడానికి సంస్థాగత ఏర్పాట్లు తగినంతగా లేవు. మనం చెప్పినా ఎవరూ మన మాట వినరు అనే భయం ఉంటుంది.” అని నసీమా తెలిపారు.

యావల్ తాలుకా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న నసీమా ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో పిల్లలకి ప్రేరణాత్మక ఉపన్యాసాలు ఇస్తున్నారు. “ఇక నిశబ్దంగా ఉండొద్దు అని, గట్టిగా మాట్లాడాలని ఈ సంవత్సరం నేను పిల్లలకి చెప్పదలుచుకున్నాను.”

ముంబైకి సమీపంలోని డోంబీవలిలో టీచర్‌గా పనిచేస్తూ పి.హెచ్ డి లో అడ్మిషన్ పొందిన ఆరీఫా తాడ్వి భవిష్యత్తు గురించి ఆశాజనకంగా ఉన్నారు. “మాలో భయాన్ని సృష్టించడం ద్వారా మా హక్కుల కోసం మేము నోరెత్తకుండా నివారిస్తున్నారు. ఎవరూ కూడా మాకు మద్దతుగా ఉండరు అనే భయం ఉంది. బహుశా పాయల్‌కి కూడా అదే భయం ఉండి ఉంటుంది. దీన్ని మనం మార్చాలి.” అని మొన్నే జలగావ్ నుండి తిరిగివచ్చిన ఆరిఫా పేర్కొన్నారు.

“పాయల్ అక్క” లాగా డాక్టర్ అవుదామని కంకణం కట్టుకున్న ఎనిమిది సంవత్సరాల సన ఆరిఫా కూతురు.

సదఫ్ మోదక్

తబస్సుమ్ బర్నాంగర్‌వాలా

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో

 

 

 

 

 

 

 

author avatar
Siva Prasad

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment