సేవ సేయగలరా..!? పోలీసు సేవ… యాప్ తోవ..!!

దేశంలోనే మొదటి సాంకేతిక పోలీసు సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా ప్రారంభించింది. “ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ సేవ యాప్” ద్వారా ఆరు విభాగాల్లో 87 రకాల సేవలను ప్రజలు పొందవచ్చు. పోలీస్ స్టేషన్ గడప ప్రతిసారి ఎక్కకుండానే అద్భుతమైన సేవలను వినియోగించుకోవచ్చు. ఇది దేశంలోనే మొదటి పోలీసు సేవ అప్లికేషన్. ఇంతవరకు బాగానే ఉంది. కీడెంచి మేలెంచమన్నారు అన్నట్లు ఈ మొబైల్ అప్లికేషన్ సేవలు చెప్పడం వరకు బాగానే ఉన్నా దీని నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు ఎవరు చూస్తారు? ఎలా చూస్తారు? సేవలను పారదర్శకంగా ఎలా అందిస్తారు? అనే విషయంలో స్పష్టత కొరవడింది. సాంకేతికంగా వేగంగా పరిగెడుతున్న నేటి ప్రపంచంలో ఈ మొబైల్ అప్లికేషన్ మంచిదే, అయితే సేవలను కచ్చితంగా అందించడంలోనే దాని విజయం ఆధారపడి ఉంటుంది…!! పని ఒత్తిడితో, శాంతిభద్రతల నిర్వహణతో, తీరిక లేకుండా గడిపే పోలీసు సిబ్బందికి ఇప్పుడు ఈ 87 రకాల సేవలను అత్యంత వేగంగా ఎలా అందించగలరు? అనేది చూసుకోవాల్సి ఉంది.!!

సాంకేతి”కథ” సాగుతుందా ?

పోలీసు సేవ యాప్ లో 87 రకాల సేవలకు సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు పొందుపరచాలి. స్టేషన్ జనరల్ డైరీ(gd బుక్) లో నమోదైన కొన్ని అంశాలను సైతం ఈ యాప్ లో పొందుపరచాల్సి ఉంటుంది. అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు అందించే సమాచారాన్ని, ఫిర్యాదులను దీని ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. వేగంగా స్పందించాల్సి ఉంటుంది. దీన్ని పోలీస్ స్టేషన్ లలో ఎవరు మోనిటర్ చేస్తారు.?? , ఎవరు బాధ్యత తీసుకుంటారు? అనే దానిపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ లకే బాధ్యత వదిలేశారు. అంటే ప్రత్యేక సిబ్బంది ఏమీ ఉండరు. అంటే ఇది సిబ్బందికి అదనపు పనే.

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖలో 45 వేల మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 50 ఏళ్లకు పైబడిన వారు 12 వేల మంది పైనే. వీరిలో అధిక శాతం సాంకేతికతలో వెనుకబడే ఉన్నారు. ఇటీవల పోలీస్ శాఖలో రిక్రూట్ అయిన యువ సిబ్బంది సాంకేతిక లో పర్వాలేదు. ఈ మొబైల్ అప్లికేషన్ సేవలను ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయడానికి ప్రతి పోలీస్ స్టేషన్ కి కనీసం ఇద్దరు సిబ్బంది అవసరమవుతారు. మరి దీని బాధ్యతలను యువ సిబ్బందికి అప్పగిస్తార? లేక ఉన్న సిబ్బంది లోనే చురుగ్గా ఉన్న వారికి అప్పగిస్తార? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని మారుమూల పోలీస్స్టేషన్లలో సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉంది. అక్కడ సాధారణ నిధులు చేసేందుకే సిబ్బంది లేని పరిస్థితి ఉంది. మరి అలాంటి చోట ఈ 87 సేవలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ సమాచారాన్ని అప్డేట్ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది పోలీసు వర్గాలు ఆలోచించాల్సి ఉంది.

* ఇక రెండో విషయానికి వస్తే ఈ యాప్ ద్వారా బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఎంత టైం లో స్పందిస్తారు అనే దానిపై స్పష్టత లేదు. అలాగే వచ్చిన ప్రతి ఫిర్యాదును ఎఫ్ఐఆర్ నమోదు చేయమని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వస్తే సదరు పిర్యాదు దారుని పోలీస్ స్టేషన్కు రప్పించి సంతకం తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెబుతున్నారు. ఇక్కడే అసలు మతలబు ఉంది. ఫిర్యాదుదారుడు ఎలాంటి ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ అవుతుంది ఎఫ్ఐఆర్ కాదు అనేదానిపై స్పష్టత లేదు. దీని వల్ల కేసులు కాకుండానే సెటిల్మెంట్లు ఎక్కువయ్యే ప్రమాదం లేకపోలేదు. దిశా పోలీస్ స్టేషన్లో మాదిరి ఈ మొబైల్ అప్లికేషన్ నిర్వహణ కోసం కనీసం పోలీస్ స్టేషన్ కు ఒకరిద్దరిని నియమించి కుంటే తప్పా దీని నిర్వహణ అంత సులభం కాదు..!!


ప్రజలు ఎలా స్వీకరిస్తారు ??

ఒక నేరం జరిగినప్పుడు లేదా బాధితుడికి ఆ సమయంలో ఉండే కోపం, ఉద్వేగం వల్ల పోలీస్ స్టేషన్ కు ఎక్కువ గొడవలు వస్తుంటాయి. ఈ మొబైల్ అప్లికేషన్ వల్ల ఫిర్యాదుదారుడు క్షణాల్లో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకు వచ్చే అవకాశం ఉంది. చీటికీమాటికీ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం లేకపోలేదు. ఇది పోలీసులకు కొత్త తలనొప్పులు తెచ్చే అవకాశం ఉంది. ఉన్న కొద్దిపాటి సిబ్బందితో ప్రతిసారి ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు స్పందిస్తే పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది అలాగే స్పందించకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇక గ్రామీణ ప్రాంత పోలీస్స్టేషన్లలో యాప్ ఎంత బాగా ప్రజల్లోకి వెళ్తుందని దానిపైనే దీని విజయం ఆధారపడి ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంత పోలీస్ స్టేషన్లో స్పందించే తీరు ఆధారంగానే యాప్ విజయవంతమవుతుంది. అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలు ఈ యాప్ ను విరివిగా వినియోగించుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా పోలీస్ సిబ్బంది స్పందించే తీరు పైన, ప్రతి విషయాన్ని యాప్ లో నమోదు చేయమని చెప్పడం పైన ఇది ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ప్రతి సేవకు నిర్దేశిత సమయం పెట్టకుండా ఈ యాప్ లు ప్రజల్లోకి తీసుకు వెళ్తే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాకాకుండా బాలారిష్టాలు గా భావించి సమస్యలను సమర్థంగా పోలీసులు ఎదుర్కొంటాయి కచ్చితంగా దేశంలోని ఒక విప్లవం అవుతుందనడంలో సందేహం లేదు.!