NewsOrbit
బిగ్ స్టోరీ

శాపాలవుతున్న జల వనరుల వరాలు!

వరాలు క్లిష్టమైనవి. అవి అనేక అంశాలతో ముడిపడి ఉంటాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకోకపోతే దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉంది.

నీళ్ళ విషయంలో భారతదేశానికి అనేక విధాలుగా వరాలు దొరికాయి అని చెప్పుకోవాలి. ఋతుపవనాలు, నదులు, భూగర్భ జలాలు, హిమాలయాలు, నీటిని ఒడిసిపట్టే సాంప్రదాయిక విధానాలు ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఈ వనరులని మనం అస్తవ్యస్తంగా నిర్వహించుకు రావటం కారణంగా నేడు  అనేక సంక్షోభాలని ఎదుర్కోవాల్సి వస్తున్నది.

దురదృష్టవశాత్తు నీటి వనరుల నిర్వహణపై తమకే గుత్తాధిపత్యం ఉందన్నట్లు ప్రభుత్వం వ్యవహారిస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో- ముఖ్యంగా నీటి వనరుల శాఖ కార్యక్రమం ప్రతిదీ విచక్షణారహితంగా ఉంటున్నప్పుడు- నీటి పరిరక్షణ కోసం ప్రజలందరూ నడుం బిగించాలని పిలుపునివ్వడంలో చిత్తశుద్ధి కనబడదు. ఉదాహరణకి, నదుల అనుసంధానం ప్రాజెక్టులలో ముఖ్యమైనదయిన కెన్-బెట్వా నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా మిగతా చోట్లకి నీరు తరలించటానికి  కరవు పీడిత బుందేల్‌ఖండ్ ప్రాంతంలో నలభై ఆరు లక్షల చెట్లు కొట్టివేస్తున్నారు. ఈ నలభై ఆరు లక్షల చెట్లు ఎంత నీటిని ఒడిసిపట్టగలవో ఊహించుకోండి.

లేకపోతే ఈ ఉదాహరణ తీసుకోండి. ఈ సంవత్సరం ఏప్రిల్ 25 నుండి జూన్ 12 వరకు సట్లేజ్ నది మీద ఉన్న భాక్ర ఆనకట్ట, బియాస్ నది మీద పొంగ్ ఆనకట్ట, రావి నది మీద ఉన్న రంజిత్ సింగ్ ఆనకట్ట నుండి సాగు సీజన్ కాని సమయంలో రెండు వందల కోట్ల ఘనపు మీటర్ల  నీళ్ళు వదిలారు. అందులో చాలా భాగం పాకిస్థాన్ భూభాగంలోకి పోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాజీ జల వనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీలు సింధు నది నుండి భారతదేశం వాటాలో చుక్క నీరు కూడా పాకిస్థాన్ భూభాగంలోకి పోదు అని ఇంతకముందు బీరాలు పలికారు. ఈ విషయాన్ని పక్కన పెడితే, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో రాను రాను భూగర్భ జలాల పరిస్థితి ప్రమాదకరంగా తయారవుతున్నది. అటువంటప్పుడు ఈ ఆనకట్టల్లోని నీరు భూగర్భ జలాలని రీఛార్జ్ చెయ్యటానికి ఎందుకు వాడలేదు?

భారతదేశంలో నీటి వనరుల నిర్వహణ ఎదుర్కొంటున్న సంక్షోభాలను పరిశీలిస్తే ప్రధానంగా నాలుగు కనబడతాయి.

  1. భూగర్భ జలాలు

ఈ రోజు భారతదేశంలో వాడే నీటిలో ఎక్కువభాగం మూడు కోట్ల బావులు, గొట్టపు బావుల నుండే వస్తున్నది. దేశంలోని నీరు ప్రధానంగా వాడుకునేది వ్యవసాయ రంగమే. నీటి పారుదల భూములలో మూడింట రెండు వంతులు భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో రోజువారి గృహ అవసరాలలో 85 శాతం, పట్టణ ప్రాంత గృహ అవసరాలలో, పారిశ్రామిక అవసరాలలో 55 శాతం నీరు భూగర్భ జలాల నుండే వస్తుంది. అంతేకాక ఈ వాడకం గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూనే ఉంది. 1980 నుండి వాడిన అదనపు నీటిలో 90 శాతం భూగర్భ జలాల నుండే వచ్చిందని అంచనాలు ఉన్నాయి. ఇది మార్చలేని వరం లాగా కనిపించొచ్చు. అయితే వరాలు పని చేసేది అలా కాదు.

కేంద్ర భూగర్భ జల సంఘం లెక్కల ప్రకారం 70 శాతం ప్రాంతాలలో భూగర్భ జలాలు క్షీణించాయి. అలాగే చాలా చోట్ల పూర్తిగా అడుగంటాయి లేదా అడుగంటిపోయే స్థితిలో ఉన్నాయి. భూగర్భ జలాల నాణ్యత పడిపోతున్నది. ఈ విషయంలో ఎన్నో దశాబ్దాలుగా హెచ్చరికలు అందుతూనే ఉన్నాయి. అయితే ఈ సంక్షోభాన్ని నివారించటానికి ప్రభుత్వం చేసింది దాదాపుగా శూన్యం.

అంతేకాక కేంద్ర జల సంఘంలో భారీ ఆనకట్టలను సమర్ధించే లాబీ ఒకటి ఉంది. భారతదేశం నీటి వనరుల నిర్వహణకు భూగర్భజలాలే ఊపిరి అన్న విషయాన్ని ప్రభుత్వం కనీసం గుర్తించకుండా ఈ లాబీ పని చేసింది. దానిని గుర్తించడం మొదటి అడుగు. జాతీయ జల విధానం ద్వారా అటువంటి విషయాన్ని గుర్తించడం అంటే అటువంటి ప్రాణవాయువుని రక్షించే విధంగా విధానాలు, కార్యక్రమాలు రూపొందించడం.

అందుకు నాలుగు విధాల కార్యక్రమం అవసరం. మొదటిది, భూగర్భ జలాల రీఛార్జ్ ఎక్కడ జరుగుతుందో అర్థం చేసుకోవాలి. అలాగే రీఛార్జ్ అయ్యేందుకు అవసరమైన అడవులు, వరద మైదానాలు, నదులు, చిత్తడి నేలలు, స్థానిక కుంటలను పరిరక్షించవలసిన అవసరం ఉంది. రెండవది, కుదిరినచోటల్లా ఇటువంటి చోట్ల నుండి రీఛార్జ్ సామర్ధ్యాన్ని మెరుగుపరచాలి. మూడవది, రివర్స్ బోర్ వెల్స్ తో సహా మరిన్ని రీఛార్జ్ ప్రక్రియలను అభివృద్ధి చేయాలి. నాల్గవది, అత్యంత ముఖ్యమైనది, భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించాలి.

భూగర్భ జల వనరులు లభించే ప్రాంతాన్ని బట్టి, ఆ వనరుల విస్తృతిని బట్టి ఆ నియంత్రణ ఉండాలి. భూమి పొరలలో ఉండే జలాశయాల నుంచి భూగర్భ జలాలు ఊరతాయి. ఎక్కువగా ఇటువంటి జలాశయాలు ఎక్కడికక్కడ స్థానికంగా ఉంటాయి, అలాగే అక్కడ భూగర్భ జల వినియోగం కూడా స్థానికంగానే ఉంటుంది. కాబట్టి నియంత్రణ అనేది స్థానిక స్థాయిలోనే మొదలవ్వాలి. న్యాయ, వ్యవస్థాగత, ఆర్ధిక మార్గాల ద్వారా ఈ నియంత్రణ ఉండాలి. పట్టణాలు, పరిశ్రమలలో ఎక్కువ వాడేవారికి ఎక్కువ బిల్లు వేసి, పేదవారికి తక్కువ ధరలో అందించాలి.

దురదృష్టవశాత్తు భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించే దిశగా ఎటువంటి ప్రభావవంతమైన చర్యలు తీసుకోలేదు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 1996లో ఏర్పాటయిన కేంద్ర భూగర్భ జలాల ప్రాధికార సంస్థ ఒక నియంత్రణ విభాగం లాగా కాకుండా అనుమతులు ఇచ్చే విభాగంగా పనిచేస్తున్నది. నియంత్రణ అంటే డబ్బు కట్టి కావలసినంత తోడుకోవటం కాదు. నియంత్రణ అంటే మట్టాలు తగ్గుతున్న ప్రదేశాలలో అనవసరపు, అన్యాయపు నీటి వినియోగానికి అడ్డుకట్ట వెయ్యడం. వార్షిక రీఛార్జ్ పరిమితులలో ఉండే విధంగా భూగర్భ జలాల వాడకాన్ని నియంత్రించాలి.

  1. ధ్వంసమైన పరివాహక ప్రాంతం

చెన్నైలో తలెత్తిన నీటి సంక్షోభం గురించి అందరూ ఈ వేసవిలో వార్తలు చదివారు. అయితే చాలా మందికి గుర్తులేని విషయం ఏమిటంటే మొన్నీమధ్యనే అంటే జూలై, 2018లో తమిళనాడులో ముఖ్యమైన నది కావేరి మీద ఉన్న అన్ని ఆనకట్టలలో నీరు పొంగిపొర్లింది. ఎంతగా అంటే అప్పటికే వరద నీటితో పోటెత్తుతున్న దిగువ ప్రాంతపు నదులలోకి నీటిని వదలవలసి వచ్చింది. ఆగస్ట్, 2018లో ముళ్ళపెరియార్ ఆనకట్ట కూడా తమిళనాడుకి పుష్కలంగా నీరు అందించింది.

జూలై 24, 2018 నాడు కావేరి నది ఆనకట్టలు పొంగిపొర్లినప్పుడు ఆ పరివాహక ప్రాంతంలో నైరుతి ఋతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువే. ఋతుపవనాల పురోగమనం మధ్యలోనే, అది కూడా సాధారణం కంటే తక్కువ వర్షం పడినప్పుడు నదులు పోటెత్తడం, సంవత్సరం తిరిగేలోపు పూర్తిగా ఎండిపోవటం అనేది దేనికి సంకేతం? ఈ ప్రశ్నకు జవాబు భారతదేశంలోని అన్ని పరివాహక ప్రాంతాలకి వర్తిస్తుంది: నీటిని ఒడిసిపట్టి, నిల్వ ఉంచి, వాన నీటితో భూగర్భ జలాలని రీఛార్జ్ చేసే సామర్ధ్యం ఈ పరివాహక ప్రాంతాలకి తగ్గిపోతున్నది. అందువలన పరివాహక ప్రాంతంలో కురిసిన వాన తొందరగా నదులలో, ఆనకట్టలలోకి చేరుకుంటున్నది. దీని ఫలితం వర్షాలు పడినప్పుడు వరదలు, అటు పిమ్మట ఎండిపోయిన నదులు, నీటి సంక్షోభం.

అడవుల నరికివేత, చిత్తడి భూములు,  ఇతర నీటి వనరుల విధ్వంసం, తేమని పట్టి ఉంచే సామర్ధ్యాన్ని మట్టి క్రమంగా కోల్పోవటం ఇవన్నీ ఈ విషాదానికి కారణం. ఈ సంక్షోభానికి అడ్డుకట్ట వెయ్యాలంటే  ఈ సమస్యలు అన్నిటినీ పరిష్కరించాలి.

  1. పట్టణ నీటి విధానంలోని శూన్యత

పట్టణాలలో నీటి వినియోగం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే పట్టణ నీటి వినియోగానికి సంబంధించి ఒక విధానమంటూ లేకుండా పోయింది. నిర్దిష్టంగా ఈ రంగానికి సంబంధించి ఎటువంటి విధానాలు, మార్గదర్శకాలు, నిబంధనలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో పట్టణాలలో వాన నీటిని ఒడిసిపట్టడం జరగదు, భూగర్భ జలాలని రీఛార్జ్ చెయ్యటం ఉండదు, పంపిణీ, సరఫరా నష్టాలను పూడ్చడం ఉండదు, ఇతర డిమాండ్ ఆధారిత చర్యలు తీసుకునే అవసరం ఉండదు, అక్కడ ఉండే నీటి వనరులని కాపాడే అలవాటు ఉండదు, మురుగునీటిని శుద్ధి చేసి పునరుపయోగించటం జరగదు. దానితో సోమరిపోతు ఆలోచనలు అయిన మరిన్ని పెద్ద, పెద్ద ఆనకట్టలు, మరిన్ని నదుల అనుసంధానం ప్రాజెక్టులు, భారీ లవణ హరణ ప్రాజెక్టులు అమలులోకి వస్తాయి. ప్రభుత్వానికి స్మార్ట్ సిటీ కార్యక్రమం ఉంది కానీ వాటర్ స్మార్ట్ కార్యక్రమం ఏమీ లేదు.

ఇటువంటి వ్యవస్థని సరిచెయ్యటానికి తీసుకోవలసిన మొదటి చర్య జాతీయ పట్టణ నీటి విధానాన్ని రూపొందించటం. ఈ విధానంలో వాటర్ స్మార్ట్ సిటీ అంటే ఏమిటో నిర్వచించాలి. అలాగే పట్టణ నీటి నిర్వహణ రంగానికి సంబంధించి అమలులో ఉన్న అత్యుత్తమ మార్గదర్శకాలని రూపొందించాలి.

  1. కాలం చెల్లిన నీటి సంస్థలు

భారతదేశంలో నీటి వనరులకు సంబంధించిన సంస్థలని స్వాతంత్య్రానంతరం ఏర్పాటు చేశారు. కొన్ని అయితే ముందు నుండీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కాలం చెల్లిన ఆలోచనా ధోరణితో, సంస్థాగత నిర్మాణంతో పనిచేస్తున్నాయి. వీటికి సమగ్ర మార్పులు చేసే పని ఎప్పటినుండో పెండింగ్ లో ఉంది.

భారతదేశంలో నీటి సంస్థలతో ఉన్న సమస్యకి ఒక ఉదాహరణ ఏమిటంటే భారతదేశంలో నీటికి సంబంధించి విశ్వసనీయ సమాచారం లేనే లేదు. నీటికి సంబంధించిన అన్ని సంస్థలకి అధిపతి అయిన కేంద్ర జల సంఘానికి పరస్పరం పొసగని బాధ్యతలు అనేకం ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే లాంటి ఒక స్వంతంత్ర సంస్థ ఇక్కడ కావాలి. నీటికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరించి, ప్రజాబాహుళ్యంలో అందుబాటులో ఉంచటం దీని ముఖ్య ఉద్దేశంగా ఉండాలి. అయితే ఈ సంస్థకి నీటి వనరుల అభివృద్దిలో కానీ నిర్వహణలోకానీ ఎటువంటి పాత్ర ఉండకూడదు.

దేశంలో నదుల పరిస్థితిని పర్యవేక్షించి, నదుల సమస్యల గురించి నివేదికలు, వాటిని బాగుచెయ్యటానికి సలహాలు ఇవ్వటానికి జాతీయ నదుల కమిషన్ ఒకటి ఉండాలి. అలాగే, నది పరివాహక సంస్థలు అంతర్రాష్ట్రీయ సంస్థలుగా ఉండాలి. దేశంలోని పరివాహక ప్రాంతాల గురించి పూర్తి అవగాహన కలిగిన సంస్థలుగా వీటిని రూపొందించాలి.

తాను రెండవసారి పదవి చేపట్టాక మొదటి మన్ కి బాత్ లో  2019 జూన్ 30 నాడు మాట్లాడుతూ నీటి పరిరక్షణ అవసరాన్ని నొక్కిచెబుతూ 8 శాతం అనే అంకెను ప్రధానమంత్రి వాడారు. “ వర్షం నీటిలో కేవలం 8 శాతం నీటినే మనం ఒడిసిపడుతున్నాము అని చెబితే మీరు ఆశ్చర్యపోతారు.” ఈ 8 శాతం అనే అంకె ఎక్కడనుండి వచ్చింది? మోదీ వివరించలేదు కానీ భారతదేశపు వార్షిక వర్షపాతం 4,000 బిలియన్ (నాలుగు లక్షల కోట్లు) క్యూబిక్ మీటర్లు. అందులో 8 శాతం అంటే 320 బిలియన్ (32 వేల కోట్లు) క్యూబిక్ మీటర్లు. ఈ దేశంలో పెద్ద ఆనకట్టల నిల్వ సామర్ధ్యం దాదాపుగా ఇంతే. కాకపోతే, పెద్ద ఆనకట్టలు నీటిని ఒడిసిపట్టే నిర్మాణాలు కావు. అవి కేవలం నీటిని నిల్వ చేసే నిర్మాణాలు మాత్రమే.

అందులోనూ, అవే ఉత్తమమైన నిల్వ నిర్మాణాలు కాదు. మానవ హితమైనవి, తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, సమర్ధవంతమైనవి అయిన భూగర్భ జలాశయాలు ఉత్తమమైనవి. చిత్తడి నేలలు, స్థానిక నీటి కుంటలు, మట్టి కూడా ఉత్తమమైనవే. ఈ 8 శాతం నిల్వ అంకెని చెప్పటం ద్వారా ప్రధాన మంత్రి మిగతా వాటిని విస్మరించి పెద్ద ఆనకట్టలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. భారీ ఆనకట్టలు, భారీ ప్రాజెక్టులు అనే మాయ నుండి మన నీటి వనరుల అధికారగణం బయటపడనంత కాలం మనకున్న నీటి వనరులకు సంబంధించి మనకున్న వరాలు శాపాలుగా మారవన్న భరోసా లేదు.

హిమాంశు థక్కర్

వ్యాసకర్త జల వ్యవహారాల నిపుణులు, ‘ఆనకట్టలు, నదులు, ప్రజల దక్షిణాసియా నెట్‌వర్క్’ (ఎస్‌ఎఎన్‌డిఆర్‌పి) సమన్వయకర్త

‘ద వైర్’ వెబ్‌సైట్ సౌజన్యంతో

author avatar
Siva Prasad

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment