YS Viveka Case: మళ్ళీ కోర్టుకు సునీత రెడ్డి..! వివేకా కేసులో కొత్త అనుమానాలు..!?

YS Viveka Case: New Suspects in CBI Enquiry
Share

YS Viveka Case: ఆంధ్రప్రదేశ్ లో అనేక కీలకమైన కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి దేశంలో అత్యున్నత పరిశోధనా సంస్థల్లో ప్రముఖమైంది సీబీఐ. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్త సంస్థలపై నమ్మకం లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ లు వస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఏపిలో సీబీఐ దర్యాప్తు తీరు చూస్తుంటే ప్రజలు ఆ సంస్థపై నమ్మకం కోల్పోతున్నారు. అంతర్వేది రథం దగ్ధం కేసు ఇప్పటి వరకూ ఏమీ తేల్చలేదు. అదే విధంగా డాక్టర్ సుధాకర్ కేసు ఏమీ తేలలేదు. సుగాలీ ప్రీతి హత్య కేసు ఇంకా విచారణ ప్రారంభం కాలేదు. హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసు సాగుతూ..నే ఉంది.

YS Viveka Case: ఆ నలుగురు పాత్ర ఏమిటి..!?

అన్నిటికీ మించి రెండు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ.. మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు వేస్తోంది. దాదాపు రెండేళ్ల కిందటే సీబీఐ మీద నమ్మకంతో దర్యాప్తు చేయాలని వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి హైకోర్టును కోరారు. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగ ప్రవేశం చేసింది. ఏడాదిన్నర కాలంగా విచారణ చేస్తుండగా.. ఇన్నాళ్లు సునీత వేచి చూశారు. గడచిన అయిదు నెలల నుండి అంటే జూన్ నెల నుండి నాన్ స్టాప్ గా సీబీఐ అధికారుల బృందం కడప సెంట్రల్ జైలు కేంద్రంగా తిష్టవేసి కడప, పులివెందుల, పొద్దుటూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాలకు చెందిన 400 మందిని విచారించింది. చివరాఖరుకు వివేకా హత్యలో నలుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నారంటూ సీబీఐ తేల్చి.. నిన్న కోర్టులో చార్జి షీటు దాఖలు చేసింది. ఇంతకూ సీబీఐ తేల్చిన నిందితులు ఎవరంటే.. వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్, పొలం పనులు చూసే ఉమా శంకర్ రెడ్డి, డ్రైవర్ దస్తగిరి ప్రధాన నిందితులుగా పేర్కొంది. వీరిని ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనే అరెస్టు చేయగా ఇద్దరు బెయిల్ పై విడుదల అయ్యారు. ఉమాశంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్ లు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అంత పెద్దాయన హత్యలో ఈ చిన్నపాటి వ్యక్తుల పాత్రేమిటనేది పెద్ద ప్రశ్న..!?

YS Viveka Case: New Suspects in CBI Enquiry
YS Viveka Case: New Suspects in CBI Enquiry

వాళ్ళ పాత్ర లేదా..? దాచారా..!?

ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే.. ఈ కేసులో దర్యాప్తును మొదటి నుండి వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గమనిస్తున్నారు. సీబీఐ దర్యాప్తు కోరిన సమయంలోనే సునీతారెడ్డి హైకోర్టుకు 14 మంది అనుమానితుల పేర్లు ఇచ్చారు. ఆ 14 మందిలో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, అవినాష్ తండ్రి భాస్కరరెడ్డి, సీఐ శంకరయ్య, నైట్ వాచ్ మెన్ రంగన్న ఇలా మొత్తంగా 14 మంది పేర్లు సునీతారెడ్డి కోర్టుకు, సీబీఐ అధికారులకు ఇచ్చారు. సునీతా రెడ్డి ఇచ్చిన ఈ 14 మందిలో ముగ్గురు నలుగురుపైనే సీబీఐ ఫోకస్ పెట్టింది కానీ మిగిలిన వారిని విచారణకూ పిలవలేదని సమాచారం. ఎంపి అవినాష్ రెడ్డి పీఏలను, ఆయన తండ్రినీ సీబీఐ విచారణ జరిపింది. అదే మాదిరిగా గుండెపోటుతో వివేకా మృతి అని సాక్షి మీడియాలో బ్రేకింగ్ ఇచ్చిన అక్కడి రిపోర్టర్ ను సీబీఐ పిలిచి విచారించింది. ఇదే సమయంలో “గుండెపోటుతో వివేకా మృతి చెందారంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మాత్రం సీబీఐ నోటీసులు ఇవ్వలేదు, విచారణ జరపలేదు. ఇప్పటికీ ఆనాడు విజయసాయిరెడ్డి… వివేకా మరణంపై మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో సెర్క్యులేట్ అవుతూనే ఉంది.

YS Viveka Case: New Suspects in CBI Enquiry
YS Viveka Case: New Suspects in CBI Enquiry
  • వివేకా గుండె పోటుతో మృతి చెందారని విజయసాయిరెడ్డికి ఎవరు చెప్పారు, ఎలా నిర్ధారించారు..? మీడియాకు ఎందుకు చెప్పారు..!? అనే విషయాన్ని సీబీఐ అధికారులు ప్రశ్నించకపోవడం.. కానీ ఆ మీడియాలో వేసిన రిపోర్టర్ ని విచారణకు పిలవడపై “సవాలక్ష అనుమానాలు” వస్తున్నాయి. దీంతో వైఎస్ సునీతారెడ్డికి కూడా సీబీఐ దర్యాప్తుపై అనుమానాలు కలుగుతున్నాయి. అసలైన నిందితులను పట్టుకోకుండా చిన్నచిన్న వాళ్లను తీసుకువచ్చి అరెస్టు చూపుతోందన్న అనుమానాలు సునీతా రెడ్డిలో ఉన్నాయి. అందుకే ఆమె సుప్రీం కోర్టు గడప తొక్కేందుకు సిద్దం అవుతున్నారని సమాచారం. తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు సహేతుకంగా జరగడం లేదనీ, ఇందులో పెద్దోళ్ల పాత్ర ఉన్నప్పటికీ ఆ దిశగా దర్యాప్తు జరగలేదన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయడానికి సన్నద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Share

Related posts

గన్నావరం అడ్డాలో – వంశీ ని ఎదురుకునే ధీటుగాడు, తురుముగాడు ఇతనే .. భారీ స్కెచ్ తో .. ! 

sekhar

ఏపీ బిజెపిలో ఆ విభాగం ఇప్పుడు ఏం చేస్తుంది..??

somaraju sharma

మాట్లాడింది రోజా ఒక్కటే… రాలింది మాత్రం మూడు పిట్టలు

siddhu