వైసీపీకి కేంద్ర మంత్రి పదవులు..? కొన్ని షరతులు వర్తిస్తాయి..!!

జగన్ జుట్టు బీజేపీ చేతిలో ఉంది. జగన్ జట్టు బీజేపీతోనే ఉంది. జట్టుగా ఉన్నన్నాళ్ళు.., జుట్టు లూజుగా పట్టుకుంటారు.., ఒకసారి జట్టు కట్ అని జగన్ రంకెలు వేస్తే మాత్రం జుట్టు పట్టుకుని జైల్లో పెట్టినా పెట్టేస్తారు..! అదీ బీజేపీ పవర్ అంటే..! ఆ గోల అంతా ఎందుకు, కేంద్రంలో చేరిపోతే సరి, కేంద్ర మంత్రి పదవులు వస్తాయి.., కేసుల ఒత్తిడి తగ్గుతుంది.., భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. ఇదీ బీజేపీ, వైసీపీ కొత్త ప్లాన్..! వైసీపీకి రెండు లేదా మూడు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేసి, ఇక్కడ రాష్ట్రంలో మంత్రివర్గంలో బీజేపీ వాళ్ళు ఇద్దరు చేరుతారు అనేది వినిపిస్తున్న మాట. దీనిలో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయో నిర్ధారించలేం కానీ.., ఆ పర్యావసానాలు మాత్రం ఒకసారి చేర్చించాల్సిందే.!!

ఎన్డీఏకి హ్యాండ్ ఇస్తున్న పార్టీలు..!!

అయినా పార్లమెంటులో పూర్తి బలం ఉన్న బీజేపీకి మిత్రపక్షాలు ఎందుకు..? అవసరం లేదు కదా అనుకుంటే పొరపాటే. మిత్రబంధాలు కేవలం పార్లమెంటుకి మాత్రమే పరిమితం కాదు. రాజ్యసభకు, ఆయా రాష్ట్రాల రాజకీయాల శాసించడానికి అవసరం అవుతాయి. అందుకే బీజేపీకి మిత్రపక్షాల అవసరం ఉంది. గత ఏడాది శివసేన, అంతకు ముందు టీడీపీ, తాజాగా అకాలీదళ్ ఇలా ఒక్కో పార్టీ బీజేపీ నుండి విడిపోతున్నాయి. కేంద్రం నుండి బయటకు వచ్చేస్తున్నాయి. “మేము చెప్పింది ఆచరించవోయ్. నీకు కావాల్సినవి చూద్దాం లే. మీ రాష్ట్రం మాకు వదిలేయ్ మేము చూసుకుంటాం” అనే రీతిలో ఉన్న మోడీ – షా ద్వయంతో ఈ పార్టీలన్నీ విసిగిపోయాయి.


జేడీయూ తప్ప ఇప్పుడు బీజేపీకి ఎన్డీఏలో నమ్మకమైన ఒక్క మిత్రపక్షమూ లేదు. నవీన్ పట్నాయక్ కి కాకా పడుతున్నా కలవడం లేదు, కేసీఆర్ కత్తులు దూస్తున్నాడు, అన్నా డీఎంకేతో పని అవ్వదు. అందుకే జగన్ వంటి వారితో కలిస్తే బాగుంటుంది, పనిలో పనిగా ఏపీలోనూ బీజేపీకి కొంచెం భవిష్యత్తు ఉంటుందేమో అనేది బీజేపీ ఆశ..!!

ఆ చట్రంలో జగన్ ఇరుక్కుంటాడా..?

“ఆకు వెళ్లి ముళ్ళు మీద పడినా ఆకుకే నష్టం.. ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా ఆకుకే నష్టం..!” అంచేత చెప్పోచ్చేదేమనగా.. బీజేపీతో జత కట్టినా జగన్ కె నష్టం(సహజం).., అడిగిన తర్వాత కట్టకపోయినా జగన్ కె నష్టం (కృత్రిమం)..! ఎందుకో చూద్దాం..!!

Bjp leaders praising ap cm ys jagan
Bjp leaders praising ap cm ys jagan

* బీజేపీ అంటే ఏపీలో తీవ్ర వ్యతిరేకత ఉంది. కనిపించడం లేదు కానీ.., బీజేపీపై ఏపీలో అనేక వర్గాలు కారాలు, మిరియాలూ నూరుతున్నాయి. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ చేసిన గాయాన్ని పూడ్చాల్సిన బీజేపీ… దాన్ని మరింత పెద్దది చేస్తుందనేది కొన్ని వర్గాల వాదన. హోదా ఇవ్వలేదు, పోలవరం నిధుల్లేవు, రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు ఇవ్వట్లేదు, పైగా రైతులు వ్యతిరేకిస్తున్న విద్యుత్ మీటర్లు వంటి కొత్తవాటిని తెచ్చి ఇరికిస్తున్నారు. గడిచిన ఆరేళ్లలో ఏపీకి బీజేపీ ఫలానా చేసింది అని చెప్పండి అంటే… అన్ని రాష్ట్రాలతో కలిసి ఉన్న లెక్క చెప్తారు తప్పం ఏపీకి మాత్రమే ఇచ్చాము అని బీజేపీ చెప్పుకోలేదు.
* స్వతహాగానే కమలం గుర్తు అంటే ఏపీలో ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు ఈ రాజకీయాలు, గొడవలు, బీజేపీ సొంత ప్రయోజనాలు, బీజేపీ తరహా వాదనలతో విసిగిపోయారు. అందుకే బీజేపీతో పొత్తుతో, కేంద్రంలోకి వెళ్లడంతో జగన్ కి పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు.


* 2014 – 2019 మధ్య జగన్ రాజకీయం మొత్తం ప్రత్యేక హోదా చుట్టూ తిరిగింది. టీడీపీ – బీజేపీ సాధించలేదు, మాకు అవకాశం ఇవ్వండి సాధిస్తాం అంటూ వేల సార్లు చెప్పారు. ఎన్నికలు ముగిసి, సీఎం అయిన వెంటనే కేంద్రానికి మన అవసరం లేదు. వారికి బలం ఉంది. సో.., హోదా ఇవ్వరు, అడగాల్సినప్పుడు అడుగుదాం అని తప్పించుకున్నారు. సో.., ఇప్పుడు జగన్ బీజేపీతో కలిస్తే ఏపీలో అంచనాలు పెరుగుతాయి. “ప్రత్యేకహోదా” సెంటిమెంట్ మళ్ళీ రగులుతుంది. ఒకవేళ తేకపోతే జగన్ మాట తప్పినవాడిగా నిలిచిపోతారు.
* రాజ్యసభలో బీజేపీకి అవసరం, ఎన్డీఏలోకి ఏదైనా కొత్త పక్షం అవసరం కాబట్టి జగన్ ని తీసుకుంటారు తప్ప… జగన్ అంటే ప్రేమ, వైసీపీ అంటే అభిమానంతో మాత్రం కాదు. 2014 – 2019 మధ్య టీడీపీతో ఫుట్ బాల ఆడుకున్నట్టే జగన్ తో కూడా ఇప్పుడు ఆడుకోరు అని చెప్పలేం. మొత్తం బీజేపీ మయం..!! వ్యవస్థ, పార్టీ, రంగు, రాజకీయం… సర్వం బీజేపీ నీడలో ఉండాల్సిందే అలా లేని పక్షంలో చంద్రబాబు గతిని నిదర్శనంగా తీసుకుని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ఆలోచనలు జగన్ చేయక కాదు.., జగన్ కి ఇవేమి తెలియక కాదు. కేవలం తనపై వేలాడుతున్న కేసుల కత్తి కోసం ఏమైనా తల ఒంచితే ఒంచుతాడేమో కానీ.. జగన్ బీజేపీకి సైతం లోంగే రకం మాత్రం కాదు.