చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

03 Mar, 2020 - 02:49 PM

హైదరాబాద్ : కరోనా వైరస్ భయం తెలుగు ప్రజలకు పట్టుకున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు దీనిపై అవగాహన కల్పిస్తూ వీడియోలను విడుదల చేస్తుండగా సినీ నటి, నిర్మాత చార్మి కౌర్ చేసిన టిక్ టాక్ వీడియో ఆమెను నవ్వులపాలు చేసింది. ఒక పక్క మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, యాంకర్ సుమ ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కలిగేలా జాగ్రత్తలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను విడుదల చేశారు. అయితే దీనిపై చార్మి అనుచిత వ్యాఖ్యలతో టిక్ టాక్ వీడియో చేసి నెటిజన్‌ల నుండి విమర్శలు ఎదుర్కొన్నారు.

హైదరాబాద్‌లో తొలిసారిగా సోమవారం మెదటి కరోనా కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లోని భయాందోళనలు పోయే విధంగానో, చైతన్య పరిచే విధంగానో సూచనలు చేయకుండా చార్మి నవ్వుతూ వీడియో చేశారు. ‘ఆల్ ది బెస్ట్ గాయ్స్..ఎందుకు చెబుతున్నానో తెలుసా? కరోనా వైరస్ ఢిల్లీ, తెలంగాణకు వచ్చేసింది. ఇప్పుడే ఈ వార్త తెలిసింది. ఆల్ ది బెస్ట్..’ అంటూ టిక్ టాక్ వీడియో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  నిమిషాల్లో ఆ వీడియో వైరల్ అయ్యింది. వైరస్‌పై చార్మి కామెంట్స్ వెకిలిగా ఉన్నాయంటూ నెటిజన్‌లు మండిపడ్డారు. వేలాది మంది ప్రాణాలు పోతూ, ఆర్థిక రంగాన్ని అతలాకుతలం అవుతుంటే కరోనా వైరస్ గురించి ఇంత దారుణంగా మాట్లాడటం ఏమిటని నెటిజన్లు చార్మిని ప్రశ్నించారు. కొంత మంది అయితే దిమాక్ ఖరాబైందా అంటూ అనుచిత కామెంట్‌లు కూడా చేశారు. చెత్త వీడియో షేర్ చేస్తావా, కరోనా అంటే ఐస్ క్రీమ్ పేరు అనుకున్నావా అంటూ రకరకాల కామెంట్లు చేశారు. దీంతో చార్మి ఆ వీడియోను డిలీట్ చేశారు.

‘మీ కామెంట్‌లు చూశా, నన్ను క్షమించండి, సరైన ఆలోచన లేకుండా దాన్ని షేర్ చేశా, ఇకపై ఏదైనా విషయంపై స్పందించేటప్పుడు జాగ్రత్తగా ఉంటాను’ అని పోస్టు చేశారు.

మరో పక్క సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంగళవారం మరో ముగ్గురు కరోనా వైరస్ అనుమానిత పేషంట్‌లు చేరారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.