మెగా ఫ్యామిలీకి భారీ షాక్

చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, శిరీష్… ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీకి అరడజను మంది హీరోలని ఇచ్చిన ఫ్యామిలీ ఇది. ఎన్నో హిట్స్, ఇండస్ట్రీ హిట్స్, ఇచ్చిన ఈ ఫ్యామిలీకి 2018 అసలు కలిసి రాలేదు. ముందుగా ఈ బ్యాడ్ ఇయర్ ని స్టార్ట్ చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ ఏ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలయికలో మూడో సినిమా వస్తుంది అంటే అనౌన్స్మెంట్ అప్పటి నుంచే భారీ అంచనాలు ఉంటాయి, వాటికి తగ్గట్లే భారీ హైప్ తో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకొని, పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీతోనే త్రివిక్రమ్ రైటింగ్ పైన, డైరెక్షన్ పైన కూడా విమర్శలు వచ్చాయి.

పవర్ స్టార్ డిజప్పాయింట్ చేసిన తర్వాత సరిగ్గా రెండు నెలలకి ప్రేక్షకుల ముందుకి వచ్చాడు రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ కి జస్టిఫికేషన్ ఇస్తూ రంగస్ధలం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన చరణ్, తెలుగు సినిమా బాక్సాఫీస్ ముందెన్నడూ చూడని వసూళ్ల వర్షం కురిపించాడు. బాహుబలి తర్వాత బాక్సాఫీస్ దగ్గర అంతగా కాసులు రాబట్టిన సినిమా ఏదైనా ఉందా అంటే అది తప్పకుండ రంగస్థలం మాత్రమే. ఓవర్సీస్ నుంచి సీ సెంటర్స్ వరకూ ప్రతి సినీ అభిమానిని మెప్పించిన రంగస్థలం సినిమాలో చరణ్ చిట్టిబాబుగా మెప్పించాడు. ఆ పాత్రలో తను మాత్రమే నటించగలడు అనే రేంజులో చెర్రీ నటన సాగింది. ఈ ఒక్క మూవీ చరణ్ ని నిజమైన మెగా వారసుడిగా నిలబెట్టింది.

చరణ్, తర్వాత బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులని పలకరించడానికి వచ్చిన హీరో అల్లు అర్జున్, బన్నీ సైనికుడిగా నటించిన నా పేరు సూర్య సినిమా టీజర్ తోనే భారీ అంచనాలు సృష్టించింది, అంతకు మించిన అంచనాలని ట్రైలర్ క్రియేట్ చేసింది. సోల్జర్ గా బన్నీ అద్భుతమైన డెడికేషన్ తో నటించినా కూడా నా పేరు సూర్య సినిమాలో కథ లేక పోవడంతో మూవీ భారీ డిజాస్టర్ గా మిగిలింది. వరస హిట్స్ మీదున్న అల్లు అర్జున్, ఈ ఒక్క ఫ్లాప్ తో ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాడు అంటేనే నా పేరుసూర్య ఎంత ఫ్లాప్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఈ ఇయర్ హిట్ అయిన సినిమాల్లో మంచి ప్రేమకథా చిత్రంగా నిలిచిన తొలిప్రేమతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు వరుణ్ తేజ్, రొటీన్ కి భిన్నంగా సాగుతున్న వరుణ్ ప్రయాణంలో తొలిప్రేమ సినిమా ఒక కొత్త మలుపు తెచ్చింది. ప్రేమికుడిగా వరుణ్ యాక్టింగ్ కి యూత్ ఫిదా అయ్యారు. అలా హిట్ తో ఇయర్ స్టార్ట్ చేసిన వరుణ్, అంతరిక్షం సినిమాతో మేకింగ్ పరంగా మంచి పేరు తెచ్చుకున్నా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించడంలో విఫలమవడంతో నెగటివ్ రిజల్ట్ తెచ్చుకొని 2018ని ముగించాడు.

వరుణ్ తర్వాత చెప్పుకోవాల్సిన మరో హీరో సాయి ధరమ్ తేజ్, సుప్రీమ్ హీరోగా తనకంటూ సొంత మార్కెట్ సృష్టించుకున్న తేజ్, ఈ ఇయర్ రెండు సినిమాలు చేశాడు. ఈ రెండు భారీ ఫ్లాప్స్ గా నిలిచి, సాయి ధరమ్ తేజ్ కెరీర్ ని, మార్కెట్ ని పూర్తిగా దెబ్బతీశాయి. మిగిలిన మెగా హీరోలు… అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ కూడా ఫ్లాప్స్ ఇచ్చి తేజు కోవలకే వచ్చారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి ఏడు సినిమాలు వచ్చిన ఈ ఏడాదిలో ప్రేక్షకులని మెప్పించింది మాత్రం రెండే. సో ఎటు చూసినా మెగా హీరోలకి ఈ ఇయర్ అసలు కలిసి రాలేదు. మరి వచ్చే ఏడాది ఈ కుటుంబం నుంచి భారీ సినిమాలు వస్తున్న నేపథ్యంలో వీళ్లు బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి.