Chiranjeevi .. నట ప్రస్థానం గురించి చెప్పాలంటే ‘ఇంతింతై వటుడింతయై..’ అని భాగవతంలో బమ్మెర పోతన ఆంధ్రీకరించిన పద్యాన్ని చెప్పాలి. ఒక సామాన్యుడిగా మొదలై జీవితంలో అంచెలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి, వ్యవస్థ, సంస్థ గురించి ఈ పద్యాన్ని ఉదహరిస్తారు. ఇటువంటి ఘనతనే తెలుగు సినిమాలో స్వయంగా లిఖించుకున్న వ్యక్తి చిరంజీవి. ప్రేక్షకుల్ని తన నటన, డ్యాన్సులు, ఫైట్లతో సమ్మోహనపరచి వారి మనసుల్లో తిష్ట వేసుకున్నారు. అటువిం చిరంజీవి తెలుగు సినీ కళామతల్లి ముద్దు బిడ్డగా అడుగులు వేసి నేటికి 43 ఏళ్లు పూర్తయ్యయి. 1978 ఫిబ్రవరి 11న తూర్పు గోదావరి జిల్లాలోని దోసకాయలపల్లిలో తొలిసారి కెమెరా ముందుకొచ్చారు. ‘పునాదిరాళ్లు’ సినిమాలో అయిదుగురు హీరోల్లో ఒకరిగా నటించి తన సుదీర్ఘ నట ప్రస్థానానికి నాంది పలికారు. అయితే.. ఈ సినిమా కాకుండా అదే ఏడాది సెప్టెంబర్ 28న ‘ప్రాణం ఖరీదు’ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చారు.

Chiranjeevi ఒక్కడిగా వచ్చి.. ఒకొక్కటిగా..
కొణిదెల శివశంకర వర ప్రసాద్ అనే వ్యక్తి చిరంజీవి నుంచి డైనమిక్ హీరో, సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగిపోయారు. అందుకు ఆయన ఇష్టంగా పడ్డ కష్టం గురించి ఎదిగిన తీరు గురించి కథలు కథలుగా ఎందరో చెప్పగా విన్నాం. ‘చిరంజీవి’తం గురించి ఎందరో పుస్తకాలు కూడా రాశారు. డిగ్రీ చదువుకున్న వ్యక్తి సినిమాల్లో రాణించాలనే ఇష్టంతో ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేరి శిక్షణ పొంది అద్దె గదుల్లో ఉంటూ సినిమా అవకాశాలను పొందడం అంటే.. చదువుకున్న డిగ్రీతో ఉద్యోగం కోసం యువకులు చేసిన ప్రయత్నం వంటిదే. అలా.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వ్యక్తి చిరంజీవి. హీరోగా చేస్తూ మధ్యలో క్యారెక్టర్ అవకాశాలు వస్తే వాటిని కూడా అంగీకరించి చేసి తనలోని నటుడుని సానబెట్టుకున్న వ్యక్తి చిరంజీవి. అప్పటివరకూ తెలుగు సినీ పరిశ్రమ చూడని ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చి యావత్ చిత్ర పరిశ్రమ దృష్టిని తనవైపుకు మళ్లేలా చేసుకున్నారు చిరంజీవి.
తనకంటూ ప్రత్యేకమైన శైలి..
ఇండస్ట్రీలో అప్పటికే ఉద్దండులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు మధ్య తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకాభిమానుల్ని సంపాదించుకోవడం సామాన్యమైన విషయం కాదు. చిరంజీవి అదే చేశారు. చిరంజీవిని కీర్తి శిఖరాలు అందుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది ఆ డ్యాన్స్, ఫైట్స్, కామెడీ. పునాదిరాళ్లు సినిమాలోనే హాస్టల్ లో చిరంజీవి ఎంట్రన్స్ సీన్ లో చేసిన డ్యాన్స్ బిట్ చూస్తేనే ఆయనలో ఎంతటి స్పార్క్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఫైట్స్ లో ఒరిజినాలిటీ, యాక్షన్ లో కామెడీ, రౌద్రం.. ఇలా ప్రతీదీ కొత్తగా సినిమా సినిమాకు విభిన్నంగా తనను తాను మలచుకున్న తీరుకు ప్రేక్షకులు ముగ్దులైపోయారు. చిరంజీవికి వస్తున్న ఆదరణ చూసి నిర్మాతలు, దర్శకులు ఆయన కోసం క్యూలు కట్టారు. రచయితలు రాసుకున్న కథలకు తనదైన హావభావాలను జోడించి.. చిరంజీవి కోసమే కొత్తగా కథలు రాసేంతగా ఎదిగిపోయారు. 1978లో తొలి సినిమా చేస్తే.. 1988కే 100 సినిమాలు చేయడమే కాదు.. సుప్రీం హీరోగా ఎన్టీఆర్ తర్వాత తెలుగు సినిమాకు నెంబర్ వన్ హీరోగా మారిపోయారు. డ్యాన్సులు, ఫైట్స్ లో ఆయన చూపిన వైవిధ్యం, సృష్టించిన ట్రెండ్ తెలుగులో ప్రతి హీరో ఫాలో అయ్యేలా చేశాయి.
స్వయంకృషితో సృష్టించుకున్న సామ్రాజ్యం..
1987 నుంచి 1992 వరకూ ప్రతి ఏడాదీ ఒక్కో ఇండస్ట్రీ హిట్ ఇస్తూ మెగాస్టార్ గా తెలుగులో ఆయన్ను మరెవరూ అందుకోలేనంత స్థాయికి ఎదిగిపోయారు. రాజకీయాల్లోకి వెళ్లి తిరిగొచ్చి సినిమాలు చేస్తే మళ్లీ అదే క్రేజ్ చిరంజీవి సొంతమైంది. కొత్త జనరేషన్ లో కూడా ఆయనే నెంబర్ వన్ హీరోగా చెలామణీ కావడం బాక్సాఫీస్ వద్ద ఆయన స్టామినా తెలియజేస్తుంది. చిరంజీవి సృష్టించిన మ్యానియా ఎంతటిదంటే.. ప్రపంచంలోనే బాలీవుడ్ లో రాజ్ కపూర్ కుటుంబం తర్వాత చిరంజీవి కుటుంబం నుంచే అంతమంది నటులు ఉండటం. నాగబాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, నిహారిక, కల్యాణ్ దేవ్.. ఇలా వీరంతా చిరంజీవి కుటుంబం నుంచి వచ్చి ప్రేక్షకాదరణ పొందారు.. పొందుతున్నారు. 43 ఏళ్ల క్రితం ఒక్కడిగా వచ్చి చిరంజీవి సృష్టించిన మహా సామ్రాజ్యం ఇది. అశేష అభిమానులను, ప్రేక్షకాభిమానాన్ని పొందిన ‘చిరంజీవి’తం ఎందరికో స్ఫూర్తివంతం.