ఏంటి అమల అక్కినేని లవ్ లెటర్ రాసిందా? ఎవరికి, ఎప్పుడు? అనే సందేహాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే అమల అక్కినేని ప్రేమలేఖను తన భర్త నాగార్జునకే రాసింది. నాగార్జున ఈ నెల 23తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి 33 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఓ అభిమానిగా అమల తన ప్రేమను ఓ లేఖ రూపంలో రాసి.. తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
“నా హీరో, నా భర్త, నా స్నేహితుడు.. ఓ నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగావు. నువ్వు స్క్రీన్‌పై కనపడితే చాలు.. ఇప్పటికీ చూపు తిప్పుకోలేకపోతున్నాను. నీ నవ్వు, కళ్లలోని మెరుపు, స్టైల్ చూడటానికి ఆతృతపడుతుంటుంది. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతూ మాకు ఒక ఉదాహరణగా నిలుస్తున్నావు. అన్నీ రకాల కథలతో అలరించావు. ఆ దేవుళ్లను నాకు పరిచయం చేశావు. ఆ దేవుళ్లు ఇప్పుడు నా కుటుంబంలో భాగమయ్యారు. ఓడిపోతామని భయపడలేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అందిస్తావ్. నీలో నిర్మాతను కూడా ఓడిపోనివ్వలేదు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటావు. నువ్వే నా జీవితంలో మ్యాజిక్. 33 ఏళ్ల కెరీర్లో 95 సినిమాలు చేశావు. అమితాబ్ బచ్చన్‌లా, అక్కినేని నాగేశ్వరరావుగారిలా జీవితంలో ఇంకా గొప్ప స్థాయిలో రాణించాలని కోరుకుంటున్నాను“ అని ఆ ప్రేమలేఖలో తెలిపారు అమల.