RRR: భారతీయ చలనచిత్ర రంగంలో దర్శకుడు రాజమౌళి పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి, “RRR” లతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకంగా ₹1000 కోట్లకు పైగా వరుస పెట్టి రెండు సినిమాలతో సాధించిన దర్శకుడిగా జక్కన్న రికార్డు సృష్టించారు. పైగా ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మరింతగా భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని పెంచేటట్లు చేశాయి. ముఖ్యంగా పాండమిక్ తర్వాత వచ్చిన “RRR” ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో రాజమౌళి టేకింగ్.. తారక్ మరియు చరణ్ నటనలకి మంచి మార్కులే పడ్డాయి. హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు దర్శకుడు రాజమౌళి పనితీరుపై అనేకమంది సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపించారు.
దీంతో “RRR” తర్వాత అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ కి రాజమౌళికి ప్రత్యేకమైన ఆహ్వానాలు అందాయి. ప్రపంచవ్యాప్తంగా భారతీయ దర్శకుడిగా రాజమౌళికి ప్రత్యేకమైన గౌరవం దక్కుతూ ఉంది. దీనిలో భాగంగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని చైనీస్ థియేటర్ ఐమాక్స్ స్క్రీన్ పై “RRR” ప్రదర్శన జరుగుతుండగా… అదే టైంలో అక్కడికి రాజమౌళి రావడం జరిగింది. జక్కన్న రాకతో అమెరికా థియేటర్ లోని ప్రేక్షకులంతా నిల్చుని చప్పట్లు కొట్టి గౌరవంగా ఆహ్వానించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. “ఈ చప్పట్లు, మరెన్నో గౌరవాలకు మీరు అర్హులు జక్కన్న” అని ఎమోషనల్ కామెంట్ పెట్టారు. దీనికి నెటిజన్ లు కూడా పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. మరోపక్క అమెరికాలో ఈ స్పెషల్ షో .. ఆస్కార్ నామినేషన్స్ కోసమని ప్రచారం జరుగుతుంది. ఇండియా నుండి “RRR” నీ ఆస్కార్ కి నామినేట్ చేయలేదు. అయితే సొంతంగా కూడా ఆస్కార్ నామినేషన్ లకి పోటీపడే అవకాశం ఉండటంతో.. ఆస్కార్ కమిటీ సభ్యులకు “RRR” నీ స్పెషల్ షో ద్వారా అమెరికా డిస్ట్రిబ్యూటర్లు చూపిస్తున్నట్లు.. ఈ క్రమంలో అక్కడికి రాజమౌళి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.