తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్, ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇనిస్టిట్యూట్ విద్యార్ధిగా సినిమాల్లోకి వచ్చి ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుని మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. కోట్లాది అభిమానులకు ఆరాధ్య నటుడయ్యారు. చిరంజీవి సినీ జీవిత గమనంపై గతంలో చాలా మంది పుస్తక రచనలు చేశారు. నటుడి నుంచి మెగాస్టార్ వరకూ ఆయన వేసిన అడుగుల్ని ఎందరికో ఆదర్శంగా ఉండేట్టు రాశారు.
అయితే.. ఒక వ్యక్తి గురించి పుస్తకాలు రావడం వేరు.. స్వయంగా ఆటోబయోగ్రఫీ రాయడం వేరు. ప్రస్తుతం చిరంజీవి అదే పని చేస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో షూటింగ్స్ నిలిచిపోవడంతో అందరిలా ఆయన కూడా ఇంటిపట్టునే ఉంటున్నారు. ఈ సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటున్నారు. తన బయోగ్రఫీని రాస్తున్నారు. తన వ్యక్తిగత జీవితం, ఇనిస్టిట్యూట్ రోజులు, కెరీర్ తొలినాళ్లు, ఖైదీ తర్వాత చిరంజీవి ఎరా, సినిమాలు, సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, అభిమానులు, రాజకీయం, కుటుంబం.. ఇలా ప్రతి అంశాన్ని ఆయన తన బయోగ్రఫీలో పొందుపరచనున్నారు.
ఈ విషయాన్ని ఆమధ్య చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చారు. తన స్వానుభవాలే కాకుండా, తనతో సినీ దిగ్గజాల అనుభవాలు, అభిమానుల నుంచి కూడా సమాచారం సేకరించి.. ఈ బయోగ్రఫీ రాస్తున్నారని తెలుస్తోంది. దేశవిదేశాల్లో ఉన్న అభిమానులందరికీ ఇది ఆనందించే విషయం. ఈ పుస్తకం రావడానికి మరో ఏడాదిపైనే సమయం పడుతుందని అంచనా.