తెలుగులో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆహాలో వెబ్ సిరీస్ లతోపాటు కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఆహాను పరిధి పెంచే ప్రయత్నంలో భాగంగా స్టార్ హీరోయిన్ సమంతతో ‘సామ్ జామ్ షో’ పేరుతో సెలబ్రటీస్ ను ఇంటర్వ్యూ చేస్తూ ఆహ్లాదంగా.. వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకూ విజయ్ దేవరకొండ, తమన్నా, సైనా నెహ్వాల్, అల్లు అర్జున్.. ఇలా పలువురిని ఇంటర్వ్యూ చేసిన కార్యక్రమాలో ఆహాలో ప్రసారమయ్యాయి. ఇప్పుడు ఈ షోని ప్రత్యేకంగా నిలిపేందుకు మెగాస్టార్ చిరంజీవితో ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది ఆహా.

‘సామ్ జామ్ షో’లో భాగంగా జరిపిన ఇంటర్వ్యూ కొద్ది రోజుల క్రితమే పూర్తి చేసారు. ఆ ఇంటర్వ్యూ కోసం చిరంజీవి మేకోవర్ స్టిల్స్ ఇంటర్నెట్ ను షేక్ చేశాయి కూడా. ఇప్పుడా కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేయడానికి డేట్ టైమ్ ఫిక్స్ చేసింది ఆహా. డిసెంబర్ 25 క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చిరంజీవి ఇంటర్వ్యూని ప్లే చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన గ్లింప్స్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లో రివీల్ చేసింది ఆహా. ఈ కార్యక్రమం కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. చిరంజీవి లుక్స్ అలా ఉన్నాయి మరి.
ఈ షోలో చిరంజీవి అంతరంగం, ఆచార్య, భవిష్యత్ ప్రాజెక్ట్స్, రామ్ చరణ్ కెరీర్, ఫ్యామిలీ, ప్రస్తుత పరిస్థితులు.. ఇలా పలు విషయాలు పంచుకున్నారని తెలుస్తోంది. సమంత చిలిపితనం.. మెగాస్టార్ హ్యూమర్ కలగలిపి సామ్ జామ్ షోలో చిరంజీవి సందడి వీక్షకులకు, ప్రేక్షకాభిమానులకు కనుల పండుగే అని చెప్పాలి. ప్రస్తుతం చిరంజీవి ఆచార్యలో నటిస్తున్నారు. త్వరలోనే లూసిఫర్, వేదాళం సినిమాలను చేయబోతున్నారు. ఇందులో లూసిఫర్ మూవీ ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లబోతోందని తెలుస్తోంది. మరోవైపు సమంత ఈ కార్యక్రమంతో తమిళ్ లో నయనతారతో కలిసి ఓ సినిమా చేయబోతోంది.