విక్రమ్ సంచలన నిర్ణయం

గత దశాబ్ద కాలంగా వచ్చిన సినిమాల్లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్. నేటితరం దేవదాస్ జీవితాన్ని చూపించిన ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇలాంటి క్లాసిక్ సినిమాలని రీమేక్ చెయ్యాలనుకోవడం నిజంగా సాహసమే. ఇంత పెద్ద డేర్ చేస్తూ  అర్జున్ రెడ్డి సినిమాను చియాన్ విక్రమ్ తన కొడుకు ధృవ్ కు లాంచ్ ప్యాడ్ గా ఎంచుకున్నాడు. తమిళంలో ‘వర్మ’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా విభిన్న చిత్రాల దర్శకుడు బాలా డైరెక్ట్ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకోని మరో అయిదు రోజుల్లో వర్మ సినిమా విడుదలవుతుంది అనుకుంటే ఫైనల్ కాపీ చూసిన నిర్మాతలు ప్రాడక్ట్ ఔట్పుట్ బాగోలేదంటూ సినిమా విడుదలని ఆపేశారు. కోలీవుడ్ వర్గాలకే షాక్ ఇచ్చిన ఈ నిర్ణయం వెనుక విక్రమ్ ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు. విక్రమ్ లోని నటుడిని మరోకోణంలో చూపించిన బాలా, ధృవ్ ని నటుడిగా వాడుకోలేదు, అర్జున్ రెడ్డి సినిమాకి వర్మ చిత్రానికి సంబంధమే లేకుండా తీశాడనే విక్రమ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అక్కడి సినీ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
కొడుకు కెరీర్ బాగుండాలని విక్రమ్ తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదు కానీ హీరోని తప్ప మిగిలిన చిత్ర యూనిట్ మొత్తాన్ని మార్చడం మాత్రం నిజంగా తప్పే. మొదటి సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న మేఘనని కూడా మార్చేయడం మాత్రం క్షమించరాని తప్పు. కెరీర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మేఘనాకి ఇది నిజంగా పెద్ద షాక్ ఇచ్చే విషయమే.