Sai Pallavi: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది రోజులకే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన వారిలో సాయి పల్లవి ఒకరు. ఎలాంటి గ్లామరస్ పాత్రలు చేయకుండా, తన సహజ నటన, ఆట, పాటల ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకొని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఈమె తన మార్క్ ఏమిటో చూపిస్తున్నారు. ఇక సినిమాలో ఈమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ క్రమంలోనే ఫిదా, మారి 2 చిత్రాలలోని పాటలతో సాయి పల్లవి ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసినదే. అయితే తాజాగా సాయి పల్లవి అక్కినేని హీరో నాగచైతన్యతో జతకట్టి లవ్ స్టోరీ సినిమాలో నటించారు.ఈ సినిమాలోని సారంగదరియా అనే పాటలో సాయి పల్లవి చేసిన డాన్స్ ద్వారా మరోసారి ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం సారంగదరియా పాట రికార్డులను బద్దలు కొడుతూ అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది.
150 మిలియన్ కి చేరుకున్న సారంగదరియా:
లవ్ స్టోరీ సినిమా నుంచి ఫిబ్రవరి 27న విడుదల చేసిన సారంగదరియా పాట ఎన్నో వ్యూస్ సాధించి రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ఈ పాట 150 మిలియన్ల మైలురాయిని దాటింది. ఈ విధంగానే 150 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సౌత్ ఇండియన్ సినిమాలో మరో రికార్డు సెట్ చేసిందని చెప్పవచ్చు. అయితే రాబోయే రోజులలో ఈ పాట మరిన్ని వ్యూస్ తప్పకుండా సాధిస్తుందని చిత్ర బృందం అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, కరోనా ప్రభావం వల్ల ఈ సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ లవ్ స్టోరీ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించారు.