RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించారు. బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రియా కీలక పాత్రలను పోషించారు.
గత ఏడాదే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. తాజాగా ఓ నయా అప్డేట్‌ను బయటకు వదిలారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్ఆర్ఆర్ నుంచి `ఎత్తర జెండా` అనే సెలబ్రేషన్ యాంథమ్ సాంగ్‌ను మార్చి 14న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
అయితే ఇప్పుడు ఆ సాంగ్ ప్రోమోను చిత్ర టీమ్ రిలీజ్ చేసింది. `నెత్తురు మరిగితే ఎత్తెర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా` అంటూ సాగిన ఈ ప్రోమో అభిమానులతో పాటు సినీ ప్రియులందరినీ ఫిదా చేసింది. ఇందులో ఎన్టీఆర్, చరణ్, ఆలియాలు ఎంతో అందంగా కనిపించి ఆకట్టుకున్నారు.
ఈ పాటకు కీరవాణి బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. కాగా, స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.