బోస్ బయోపిక్ వస్తోంది

తెల్లదొరల పెత్తనంతో బానిసత్వంలో కొట్టుకుమిట్టాడుతున్న బ్రతుకులని పోరాట బాట పట్టించి, చేతికి బందూక్ ఇచ్చి, రక్తం చిందించి అయినా స్వాతంత్య్రాన్ని తెచ్చుకుందామనే ఆవేశం కలిగించిన వారిలో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు… సుభాష్ చంద్ర బోస్. ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి నేతాజీగా అందరి మన్ననలు అందుకున్న బోస్ కి మరణం లేదు. ఆయన చివరి రోజుల గురించి, మరణం గురించి రకరకాల వార్తలు వినిపిస్తాయి కానీ వాటిలో ఏది నిజం అంటే ఖచ్చితంగా ఎవరూ చెప్పలేని పరిస్థితి.

ఇండియన్ నేషనల్ కాంగ్రస్ పార్టీలో చేరిన యంగ్ లీడర్ దగ్గర నుంచి కనిపించకుండా పోయే వరకూ బోస్ జీవితంలోని ప్రతి అంశం, ప్రతి ఘట్టం ఎంతో ప్రత్యేకం. అసలు బోస్ జీవితంలో ఏం జరిగింది అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంటుంది. ఈ పాయింట్ నే తీసుకోని బాలీవుడ్ లో ‘గుమ్నామీ’ పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది. నేతాజీ జయంతి సందర్భంగా గుమ్నామీ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్ లో ఒక వృద్ధుడు నవారు మంచంపై కూర్చొని గోడవైపు తదేకంగా చూస్తున్నాడు. ఆ గోడపై ‘నేతాజీ మిస్సింగ్’.. బోస్ విమాన ప్రమాదంలో చనిపోయాడు’.. ఇంకా నేతాజీకి సంబంధించిన వార్తలు ఉన్న పేపర్ క్లిప్పింగ్స్ చాలానే అంటించి ఉన్నాయి. ఎడమ వైపు ఒక పాతకాలం ఇనప పెట్టె.. ఆ పెట్టెపై వెలుగుతున్న లాంతరు ఉన్నాయి. ‘ది గ్రేటెస్ట్ స్టొరీ నెవర్ టోల్డ్’ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ‘గుమ్నామీ’ సినిమాను అనూజ్ ధర్, చంద్రచూడ్ ఘోస్ లు రాసిన ‘కోనండ్రమ్'(క్లిష్టమైన.. తికమక పెట్టే సమస్య లేదా ప్రశ్న అని అర్థం) అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న గుమ్నామీ సినిమాలో ఎలాంటి అంశాలని చూపించబోతున్నారు అనేది తెలియాలి అంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయ్యే వరకూ ఆగాలి.