ఇళయరాజా బయోపిక్ తెరకెక్కించనున్నారా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. గిన్నిస్ రికార్డు సాధించిన సంగీత దర్శకుడు ఇళయరాజా. ఆయన సంగీతానికి చెవులు కోసుకునే అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. ఇటీవలే ఇళయరాజా 75 అనే కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించారంటే ఆయనంటే ఎంతటి అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఇళయరాజా తన బయోపిక్ గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ “నా జీవితాన్ని చాలా సులభంగా తెరకెక్కించవచ్చు. సరిగ్గా చేసే వాళ్లుంటే మూడు రోజుల్లో తెరకెక్కించవచ్చు. నా జీవిత చరిత్రలో నేను నటించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రకృతిలో నీళ్లు, గాలితో పాటు సంగీతం కూడా ఉంది. సంగీతాన్ని నేను ఆస్వాదించగలిగాను. నేను ప్రకృతిలో సంగీతాన్ని స్పృశించగలిగాను. మంచి పనులు చేయడం ఎప్పుడూ ఉత్తమం. నా దృష్టిలో ఉత్తమోత్తమమైంది సంగీతం. సంగీతాన్ని తప్పకుండా పాఠశాలల్లో ఒక పాఠంగా మార్చాలి. అది మేథో వికాసానికి ఉపయోగపడుతుంది. నేను విద్యార్థులకు చెప్తున్నది ఒక్కటే.. కలలు కనకండి. ప్రయత్నాలు ప్రారంభించండి“ అని అన్నారు. చెన్నైలో ఓ విద్యాసంస్థలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఇలా ప్రసంగించారు.
previous post
next post