Jagapathi Babu: ఒకప్పటి సీనియర్ హీరో, ప్రస్తుత స్టార్ విలన్ జగపతి బాబు అంటే తెలియని వారుండరు. 1989 లో వచ్చిన `సింహస్వప్నం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జగపతి బాబు.. టాలీవుడ్లో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ డౌన్ ఫాల్ అయిపోతున్న సమయంలో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతిబాబు.. `లెజెండ్` మూవీతో విలన్‌గా మారి సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు.
ప్రస్తుతం సినిమాల్లో ఓవైపు ప్రాధాన్యత ఉన్న పాత్రలను పోషిస్తూనే.. మరోవైపు విలన్‌గానూ నటిస్తూ దూసుకుపోతున్నారీయన. ఇదిలా ఉంటే.. రేపు(ఫిబ్రవరి 12) జగపతిబాబు 60వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అవయవ దానం చేస్తున్నట్లు నేడు కీలక ప్రకటన చేశారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన అవయవ దానం అవగాహన కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్‌గా జగపతి బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `మనుషులుగా జన్మిస్తాము. మనుషులుగానే చనిపోతాం. వెళ్లేటపుడు రెండు వందల గ్రాముల బూడిద తప్ప ఇంకేం మిగలదు. అవయవ దానం వల్ల మనం మరణించిన తర్వాత ఏడెనిమిది మందికి పునర్జన్మ ఇవ్వొచ్చు.
రేపు నా 60వ పుట్టిన రోజు సందర్భంగా అవయవ దానం చేయాలని నిర్ణయించుకున్నాను` అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన తీసుకున్న మంచి నిర్ణయానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే జగపతి బాబుపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.